Thursday, April 25, 2024

సత్తా చాటిన యువ బౌలర్లు

- Advertisement -
- Advertisement -

India vs Australia 4th test updates

 

బ్రిస్బేన్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో, ఆఖరి టెస్టులో టీమిండియా యువ బౌలర్ల ప్రతిభను ఎంత పొగిడినా తక్కువే. సీనియర్లు బుమ్రా, ఉమేశ్, అశ్విన్, షమి, జడేజా తదితరులు లేకున్నా చివరి టెస్టులో యువ బౌర్లు అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోయారు. హైదరాబాది యువ సంచలనం సిరాజ్‌తో సహా అరంగేట్రం బౌలర్లు నటరాజన్, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణించారు. ఇక కెరీర్‌లో రెండో టెస్టు మాత్రమే ఆడుతున్న శార్దూల్ ఠాకూర్ కూడా అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.

ఇక నెట్ బౌలర్‌గా ఆస్ట్రేలియాకు వచ్చిన యువ సంచలనం నటరాజన్ మూడు ఫార్మాట్‌లలోనూ అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే వన్డేల్లో, ట్వంటీ20లలో అద్భుతంగా రాణించిన నటరాజన్ సంప్రదాయ టెస్టుల్లోనూ నిలకడైన బౌలింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. చూడచక్కని బౌలింగ్‌తో నటరాజన్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. కీలక సమయంలో వెంటవెంటనే రెండు వికెట్లు తీసి భారత్‌కు పైచేయి అందించాడు. ఇక సిరాజ్ ఆరంభ ఓవర్‌లోనే ప్రమాదకర వార్నర్ వికెట్‌ను తీసి ఆస్ట్రేలియానే కోలుకోలేని దెబ్బ తీశాడు. శార్దూల్ కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.

ఒకరకంగా చెప్పాలంటే శార్దూల్‌కు కూడా ఇదే తొలి మ్యాచ్ అని చెప్పాలి. గతంలో అతను ఆడిన ఒక టెస్టులో కేవలం పది బంతులు మాత్రమే వేశాడు. గబ్బా స్టేడియంలో మాత్రమే అతను పూర్తి స్థాయి బౌలర్‌గా సేవలు అందించాడు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ టిమ్ పైన్‌ను ఔట్ చేసి భారత్ మళ్లీ మ్యాచ్‌లో పైచేయి సాధించడంలో శార్దూల్ ముఖ్య భూమిక పోషించాడు. ఇక ఆరంభంలోనే ఓపెనర్ హారిస్‌ను కూడా శార్దూల్ ఔట్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా నటరాజన్ కూడా మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఆరంభ మ్యాచ్‌లోనే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. లబుషేన్, వేడ్ వంటి స్టార్ ఆటగాళ్లను అతను పెవిలియన్ బాట పట్టించాడు. ఇక యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కూడా తొలి మ్యాచ్‌లోనే మెరుగైన బౌలింగ్‌తో అలరించాడు. అతని ఖాతాలో కూడా మూడు వికెట్లు పడ్డాయి. రెండో రోజు ప్రమాదకరంగా కనిపించిన కామెరూన్ గ్రీన్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి జట్టును ఆదుకున్నాడు. ఇక సీనియర్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను కూడా సుందర్ పెవిలియన్ బాట పట్టించాడు. అంతేగాక ధాటిగా ఆడుతున్న లియాన్‌ను ఔట్ చేయడం ద్వారా భారత్‌కు పైచేయి అందించాడు. ఇలా యువ బౌలర్లు సమష్టి బౌలింగ్ ఆస్ట్రేలియా వంటి బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టును 369 పరుగులకు కట్టడి చేయడంలో సఫలమయ్యారు.

ఇక భారత బౌలర్ల ప్రతిభపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇటు భారత్, అటు ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెటర్లు వీరిని పొగడ్తలతో ముంచెత్తారు. కీలక బౌలర్లు లేకున్నా యువ బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో చెలరేగిన తీరును వారు ప్రశంసించారు. ఈ మ్యాచ్‌లో సైని సేవలు అందుబాటులో లేకున్నా ఉన్న మిగిలిన బౌలర్లు ఆస్ట్రేలియాను 369 పరుగులకే పరిమితం చేయడాన్ని వారు కొనియాడారు. రానున్న రోజుల్లో వీరు భారత్‌కు కీలక బౌలర్లుగా ఎదగడం ఖాయమని వారు జోస్యం చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News