Friday, July 19, 2024

భారత్‌కు సవాల్

- Advertisement -
- Advertisement -

India-vs-Australia

సిరీస్‌పై ఆస్ట్రేలియా కన్ను, నేడు రాజ్‌కోట్‌లో రెండో వన్డే

రాజ్‌కోట్: కిందటి మ్యాచ్‌లో ఘోర పరాజయం చవిచూసిన టీమిండియాకు శుక్రవారం రాజ్‌కోట్‌లో జరిగే రెండో వన్డే చావోరేవోగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. తొలి వన్డేలో పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇందులోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆసీస్ సమతూకంగా కనిపిస్తోంది. ముంబైలో ఓపెనర్లు డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్‌లు అజేయ సెంచరీలతో కదంతొక్కారు. దీన్ని మొదటి మ్యాచ్‌లో కంగారూలు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించారు.

ఇక, ఈ మ్యాచ్ విరాట్ కోహ్లి సేనకు సవాలుగా తయారైంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో జట్టుపై ఒత్తిడి నెలకొంది. సిరీస్‌లో ఫేవరెట్‌గా కనిపించిన భారత్‌కు తొలి వన్డేలో కోలుకోలేని షాక్ తగిలింది. ఘోర పరాజయం నేపథ్యంలో ఆతిథ్య జట్టు తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగ్గా రాణించాల్సిన అవసరం జట్టుపై ఉంది. తొలి వన్డేలో బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. ప్రత్యర్థికి చెందిన ఒక్క వికెట్‌ను కూడా తీయలేక పోయారు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా బౌలర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తారా లేదా అనేది అందరిని కలవరానికి గురిచేస్తోంది.

ఓపెనర్లే కీలకం

ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఓపెనర్లు కీలకంగా మారారు. కిందటి మ్యాచ్‌లో శిఖర్ ధావన్ మెరుగ్గానే ఆడాడు. అయితే రోహిత్ శర్మ నిరాశ పరిచాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రోహిత్ విఫలం కావడంతో ముంబై వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించలేక పోయింది. ఇక, ఈ వన్డేలో రోహిత్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రోహిత్ విజృంభిస్తే మెరుగైన లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచడం భారత్‌కు కష్టమేమి కాదు. అయితే దీని కోసం ఓపెనర్లు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైన ఉంది. ధావన్ ఫామ్‌లోకి రావడం భారత్‌కు పెద్ద ఊరటనిచ్చే అంశం. ధావన్ ఈసారి కూడా చెలరేగితే భారత్ మెరుగైన స్కోరు సాధించడం ఖాయం.

ఇక, లోకేశ్ రాహుల్ ఫామ్‌లో ఉండడం కూడా టీమిండియాకూ సానుకూల పరిణామమే. కొంతకాలంగా రాహుల్ నిలకడైన ఆటతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. లంకతో జరిగిన టి20 సిరీస్‌లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో కూడా బాగానే ఆడాడు. ఈసారి కూడా రాహుల్ జట్టుకు కీలకంగా మారాడు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా తన బ్యాట్‌కు పని చెప్పక తప్పదు. కోహ్లి విజృంభిస్తే భారీ స్కోరు సాధించడం భారత్‌కు కష్టమేమి కాదు. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారించడం కోహ్లి అలవాటుగా మార్చుకున్నాడు. కానీ, తొలి వన్డేలో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. అయితే కీలకమైన ఈ మ్యాచ్‌లో మాత్రం బ్యాట్‌ను ఝులిపించేందుకు సిద్ధమయ్యాడు.

మరోవైపు శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, జడేజా తదితరులు కూడా తమ బ్యాట్‌కు పని చెప్పాలి. ఈ మ్యాచ్‌కు వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూరమయ్యాడు. అతనికి బదులు రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలను చేపట్టనున్నాడు. దీంతో పంత్ స్థానంలో మనీష్, కేదార్ జాదవ్‌లలో ఒకరికి చోటు ఖాయంగా కనిపిస్తోంది. కాగా, తొలి మ్యాచ్‌లో విఫలమైన బౌలర్లు ఈసారి మెరుగ్గా రాణించాలనే పట్టుదలతో ఉన్నారు. తొలి మ్యాచ్‌లో ఎదురైన చేదు అనుభవానికి బదులు తీర్చుకోవాలనే లక్షంతో భారత బౌలర్లు మ్యాచ్‌కు సిద్ధమయ్యారు. ఇందులో ఎంత వరకు సఫలమవుతారో వేచి చూడాల్సిందే.

జోరుమీదున్న కంగారూలు

మరోవైపు ఇప్పటికే ఓ మ్యాచ్‌లో గెలిచి జోరుమీదున్న ఆస్ట్రేలియా సిరీస్‌పై కన్నేసింది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఫించ్ సేన చాలా బలంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. తొలి మ్యాచ్‌లో ఓపెనర్లు ఫించ్, వార్నర్‌లు అజేయ శతకాలతో కదంతొక్కిన విషయం తెలిసిందే. ఈసారి కూడా జట్టు వీరిపై భారీ ఆశలే పెట్టుకుంది. ఇద్దరిలో ఏ ఒక్కరూ నిలదొక్కుకున్నా టీమిండియా బౌలర్లకు మరోసారి కష్టాలు తప్పక పోవచ్చు. అంతేగాక స్మిత్, లబూషేన్, అలెక్స్‌కారె, డిఆర్సిషార్ట్ వంటి ప్రతిభావంతులైన బ్యాట్స్‌మెన్ జట్టుకు అందుబాటులో ఉన్నారు. దీంతోపాటు కమిన్స్, స్టార్క్, రిచర్డ్‌సన్, హాజిల్‌వుడ్, అష్టన్ టర్నర్, ఆడమ్ జంపా తదితరులతో బౌలింగ్ కూడా చాలా బలంగా ఉంది. దీంతో ఈసారి కూడా ఆస్ట్రేలియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

India vs Australia Rajkot ODI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News