Home తాజా వార్తలు సవాలు వంటిదే…

సవాలు వంటిదే…

Cricket2

మన తెలంగాణ/ క్రీడా విభాగం: వరుస ఓటములతో సతమతమవుతున్న టీమిండియాకు ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు మ్యాచ్‌లు సవాలుగా మారాయి. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లోనూ టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మిగిలిన మూడు టెస్టుల్లోనూ భారత్‌కు కష్టాలు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా క్లీన్‌స్వీప్‌పై కన్నేశారు. ఇక, సిరీస్‌ను గెలవాలంటే భారత్ మిగిలిన మూడు టెస్టుల్లోనూ గెలవక తప్పదు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అంత తేలిక కాదనే చెప్పాలి. బ్యాటింగ్ వైఫల్యం టీమిండియాకు ప్రధాన ప్రతికూలంగా మారింది. ఓపెనర్లతో సహా టాప్ ఆర్డర్, మిడిలార్డర్, చివరికి లోయర్ ఆర్డర్ కూడా పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశే మిగుల్చుతోంది. తొలి మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రమే కాస్త మెరుగ్గా రాణించాడు. ఇప్పటి వరకు కోహ్లి తప్ప మిగిలిన ఎవ్వరూ కూడా కనీసం ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా అర్ధ సెంచరీ మార్క్‌ను సైతం అందుకోలేక పోయారు. ఓపెనర్లు శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, మురళీ విజయ్‌లు జట్టుకు అండగా నిలువడంలో విఫలమయ్యారు. వైస్ కెప్టెన్ అజింక్య రహానె, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌లు ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లలోనూ నిరాశే మిగిల్చారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టుగా గుర్తింపు తెచ్చుకున్న భారత్ ఈ సిరీస్‌లో మాత్రం చెత్త ఆటతో ఆశలను నీరు గార్చింది. జట్టుకు అండగా నిలువడంలో బ్యాట్స్‌మెన్‌లు పూర్తిగా వైఫల్యం చెందారు.

ఈసారైనా..

తొలి రెండు మ్యాచుల్లో తేలిపోయిన భారత ఆటగాళ్లు కనీసం మూడో టెస్టులోనైనా మెరుగ్గా ఆడతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈసారి ఓపెనర్లు శుభారంభం అందిస్తారనే నమ్మకంతో జట్టు యాజమాన్యం ఉంది. రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఖాతా తెరవకుండా ఔటైన మురళీ విజయ్‌కు ఈసారి మరో అవకాశం ఇస్తారా లేదా అన్నది సందేహంగా మారింది. అతనికి బదులు శిఖర్ ధావన్‌ను రంగంలోకి దించే అవకాశాలున్నాయి. అయితే విజయ్‌కు మరో అవకాశం ఇవ్వాలని భావిస్తే మాత్రం ధావన్ మరోసారి పెవిలియన్‌కే పరిమితం కాక తప్పదు. ధావన్‌ను ఆడించాలని భావిస్తే రాహుల్‌పై వేటు పడుతోంది. మూడో టెస్టులో ఓపెనర్ల స్థానం కోసం ముక్కోణపు పోటీ నెలకొంది. ముగ్గురు విఫలమైన నేపథ్యంలో ఎవరికి చోటు కల్పిస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. విశ్లేషకులు మాత్రం విజయ్‌కు మరో ఛాన్స్ ఇవ్వాలని సూచిస్తున్నారు. కిందటి సిరీస్‌లో విజయ్ మెరుగ్గా ఆడడమే దీనికి కారణం. ధావన్‌కు జతగా విజయ్‌ను ఓపెనర్‌గా పంపాలని వారు సూచిస్తున్నారు.

ఇద్దరిపై అందరి కళ్లు…

మరోవైపు సీనియర్ ఆటగాళ్లుగా పేరున్న రహానె, పుజారాలు రెండో టెస్టులో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచారు. పుజారా నిలకడగా ఆడినా జట్టుకు అండగా నిలువడంలో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో అనవసరంగా వికెట్‌ను పారేసుకున్నాడు. అతనిపై జట్టుకు భారీ ఆశలున్నాయి. ఈసారైన తనపై ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెడుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. నయా వాల్‌గా పేరున్న పుజారాకు తొలి టెస్టులో ఛాన్స్ దక్కలేదు. రెండో టెస్టులో జట్టులోకి వచ్చినా ఫలితం లేకుండా పోయింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ చెత్త బ్యాటింగ్‌తో నిరాశే మిగిల్చాడు. తనపై ఎన్నో ఆశలను పెట్టుకున్న కెప్టెన్‌కు, జట్టు యాజమాన్యానికి, చివరికి అభిమానులకు కూడా నిరాశ పరిచాడు. మూడో టెస్టులోనైన పుజారా తన స్థాయికి తగ్గ ఆటను కనబరచాల్సిన అవసరం ఎంతైన ఉంది.

ఇక, రహానె కూడా ఆడిన రెండు మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. కీలక ఆటగాడిగా పరిగణిస్తున్న రహానె ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొలేక పోతున్నాడు. తొలి రెండు టెస్టులో రహానె వైఫల్యం జట్టును వెంటాడింది. మిగిలిన మూడు టెస్టుల్లో మెరుగ్గా రాణించాల్సిన బాధ్యత రహానె ఉంది. ఇందులో అతను ఎంత వరకు సఫలమవుతాడనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా తన బ్యాట్‌కు పని చెప్పాలి. తొలి టెస్టులో రాణించిన కోహ్లి రెండో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అతని వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. కీలకమైన ఈ మ్యాచ్‌లో కోహ్లి రాణించడంపైనే టీమిండియా గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. ఇక, తొలి రెండు మ్యాచుల్లో విఫలమైన వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌కు మూడో టెస్టులో అవకాశం దొరకడం కష్టమేనని చెప్పాలి. యువ ఆటగాడు రిషబ్ పంత్‌ను ఈ మ్యాచ్‌లో ఆడించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అదే జరిగితే కార్తీక్‌కు నిరాశ తప్పదు. రెండు మ్యాచుల్లో అవకాశం లభించినా కార్తీక్ దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు. రిషబ్ మాత్రం అవకాశం లభిస్తే సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు.

మార్పులు ఖాయం..

టెంట్‌బ్రిడ్జ్ వేదికగా ఈ నెల 18 నుంచి జరిగే మూడో టెస్టు కోసం టీమిండియాలో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో కరుణ్ నాయర్, రిషబ్ పంత్‌లను బరిలోకి దించడం ఖాయమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కార్తీక్, విజయ్, రాహుల్‌లు విఫలం కావడంతో వీరిని తప్పించి కొత్త ఆటగాళ్లకు చోటు కల్పించాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే రాహుల్‌కు బదులు ఓపెనర్‌గా శిఖర్ ధావన్ ఆడే అవకాశం ఉంటుంది. విజయ్‌కు మరో ఛాన్స్ ఇచ్చేందుకే కెప్టెన్ మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ఇక, హార్దిక్ పాండ్యను తప్పించి కరుణ్ నాయర్‌ను బరిలోకి దించడం కూడా తథ్యమనిపిస్తోంది. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన ఘనత కలిగిన నాయర్‌కు మూడో టెస్టులో స్థానం లభించడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. పాండ్యను తప్పించి నాయర్‌ను తుది జట్టులోకి తీసుకునేందుకు కోహ్లి సమ్మతించాడని తెలిసింది. మరోవైపు రెండో టెస్టులో ఘోరంగా విఫలమైన యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మూడో టెస్టులో స్థానం దాదాపు అసాధ్యంగానే చెప్పాలి. జస్‌ప్రిత్ బుమ్రాను అతని స్థానంలో జట్టుకు ఎంపిక చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని భావిస్తే ఉమేశ్ కూడా జట్టులోకి వస్తాడు. అప్పుడూ రాహుల్ లేదా పాండ్య తప్పుకోక తప్పదు. అశ్విన్ స్థానానికి మాత్రం ఎటువంటి ఢోకా ఉండదు. ఒకవేళ వెన్నునొప్పితో బాధపడుతున్న కెప్టెన్ కోహ్లి బరిలోకి దిగక పోతే రాహుల్‌కు ఛాన్స్ దొరకడం ఖాయమని చెప్పాలి. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు మాత్రం మూడో టెస్టులో కచ్చితంగా స్థానం దక్కుతుందనే విషయం ఇప్పటికే స్పష్టమైంది. కెప్టెన్ కూడా పంత్‌వైపే ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే కార్తీక్‌పై వేటు పడడం తథ్యం.