Thursday, April 25, 2024

టీమిండియాకు పరీక్ష

- Advertisement -
- Advertisement -
team-india
సిరీస్‌పై కివీస్ కన్ను, నేడు రెండో వన్డే

ఆక్లాండ్: సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌కు టీమిండియా ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. న్యూజిలాండ్‌తో శనివా రం రెండో వన్డేలో భారత్ తలపడనుంది. తొలి మ్యాచ్ లో ఓడిన విరాట్ కోహ్లి సేనకు ఈ మ్యాచ్ సవాలుగా మారింది. ఇందులో ఓడితే మాత్రం సిరీస్‌ను కోల్పో యే పరిస్థితి భారత్‌కు నెలకొంది. తీవ్ర ఒత్తిడి నేపథ్యం లో టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలా ఆడుతుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. తొలి మ్యాచ్‌లో 347 పరుగుల భారీ స్కోరును సాధించినా భారత్‌కు ఓటమి తప్పలేదు. ఇక, మొదటి మ్యాచ్‌లో భారీ లక్ష్యా న్ని సయితం అలవోకగా ఛేదించి చిరస్మరణీయ విజ యం సాధించిన ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు సమరోత్సోహంతో రెండో వన్డేకు సిద్ధమైంది.

కీలక ఆటగాళ్లందరూ ఫామ్‌లో ఉండడం కివీస్‌కు కలిసి వచ్చే అంశం గా చెప్పాలి. సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ కిందటి మ్యాచ్‌లో అజేయ శతకంతో చెలరేగాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఓపెన ర్లు హెన్రీ నికోల్స్, మార్టిన్ గుప్టిల్‌లు కూడా తొలి మ్యాచ్‌లో బాగానే ఆడారు. అంతేగాక కెప్టెన్ లాథమ్ కూడా కీలక ఇన్నింగ్స్‌తో జట్టుకు అండగా నిలిచాడు. ఈసారి కూడా చెలరేగాలనే లక్షంతో కనిపిస్తున్నాడు. సౌథి, ఐష్ సోధి, నిషమ్, సాంట్నర్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో కివీస్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన భారత్‌కు ఈ మ్యాచ్ పరీక్షగా తయారైంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఎలా ఆడుతుందనే దానిపైనే సిరీస్ అవకాశాలు నిలుస్తాయి.

ఓపెనర్లే కీలకం

కిందటి మ్యాచ్‌లో భారీ స్కోర్లను సాధించడంలో విఫలమైన ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, పృథ్వీషా ఈసారైనా మెరుగైన బ్యాటింగ్ కనబరచాల్సిన అవసరం ఉంది. రోహిత్, శిఖర్ వంటి సీనియర్ ఓపెనర్లు గాయాల వల్ల అందుబాటులో లేకుండా పోయారు. దీంతో వన్డే సిరీస్‌లో ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకా శం యువ ఆటగాళ్లు మయాంక్, పృథ్వీషాలకు లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకుని జట్టులో స్థానా న్ని సుస్థిరం చేసుకోవాల్సిన బాధ్యత వీరిపై నెలకొంది. రానున్న ప్రపంచకప్ నేపథ్యంలో ఇద్దరు మెరుగైన ఆట తో ఆకట్టు కోవాలని భావిస్తున్నారు. అంతేగాక కివీస్ తో టెస్టు సిరీస్ కూడా ఉండడంతో వీరిద్దరూ గాడిలో పడక తప్పదు.

దూకుడు మీదున్న అయ్యర్

కెరీర్‌లో తొలి వన్డే శతకం సాధించిన యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌లో కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. కీలక సమయంలో అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్న అయ్యర్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తున్నా డు. మెరుగైన బ్యాటింగ్‌తో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న శ్రేయస్ ఈసారి కూడా భారీ స్కోరుపై కన్నేశాడు. అయ్యర్ నిలదొక్కుకుంటే కివీస్ బౌలర్లకు మరోసారి ఇబ్బందులు తప్పక పోవచ్చు.

జోరు సాగాలి

ఇక, కొంతకాలంగా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతు న్న స్టార్ ఆటగాడు లోకేశ్ రాహుల్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రాహుల్ విజృంభిస్తే భారీ స్కోరును సాధించడం టీమిండియాకు అసాధ్యమేది కాదు. టి20 సిరీస్‌లో పరుగుల వరద పారించిన రాహుల్ మొదటి వన్డేలో కూడా మెరుపులు మెరిపించాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుది. రాహుల్ కూడా తన ఫామ్‌ను కొనసాగిస్తూ భారీ స్కోరును సాధించాలనే లక్షంతో ఉన్నాడు.

కోహ్లినే కీలకం

మరోవైపు అద్భుత ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి కూడా జట్టు కు కీలకంగా మారాడు. తొలి మ్యాచ్‌లో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి న కోహ్లి ఈసారి కూడా జట్టును ముందుండి నడిపించాలని భావిస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారించడం కోహ్లికి అలవాటు. ఈ సిరీస్‌లో ఇప్పటికే సత్తా చాటాడు. రోహిత్ జట్టుకు దూరమైన నేపథ్యంలో కోహ్లి బాధ్యత మరింత పెరిగింది. తన పాత్రను సమర్థంగా నిర్వర్తించి జట్టును విజయపథంలో నడిపించాలనే లక్షంతో కోహ్లి మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. మనీష్ పాండే, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది.

బౌలింగే సమస్య

బ్యాటింగ్‌లో బాగానే ఉన్నా బౌలింగ్ సమస్య భారత్‌ను వెంటాడుతోంది. జట్టులో ప్రతిభావంతులైన బౌలర్లకు కొదవలేదు. అయితే తొలి మ్యాచ్‌లో భారీ స్కోరును కూడా కాపాడు కోవడంలో బౌలర్లు విఫలమయ్యారు. బుమ్రా, షమి, జడేజా వంటి అగ్రశ్రేణి బౌలర్లు జట్టులో ఉన్నా కివీస్ భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించడం ఆందోళన కలిగించే అంశమే. ఈసారైనా బౌలర్లు గాడిలో పడక తప్పదు. లేకుంటే టీమిండియాకు మరోసారి చేదు అనుభవం తప్పక పోవచ్చు.

ఆత్మవిశ్వాసంతో

తొలి మ్యాచ్‌లో చిరస్మరణీయ విజయం సాధించిన న్యూజిలాండ్ రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది. బౌలర్లు విఫలమైనా బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో కివీస్ భారీ లక్ష్యాన్ని కూడా అలవోకగా ఛేదించింది. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. రాస్, లాథమ్, నిషమ్, గుప్టిల్, నికోల్స్, గ్రాండోమ్, సాంట్నర్ తదితరులతో కివీస్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. సౌథి, సోధి, నిషమ్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే కనిపిస్తోంది. దీంతో కివీస్‌ను ఓడించాలంటే భారత్ తీవ్రంగా శ్రమించక తప్పదు.

india vs New Zealand 2st ODI 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News