Friday, April 19, 2024

క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను

- Advertisement -
- Advertisement -
India
కివీస్‌కు పరీక్ష, నేడు చివరి టి20

మౌంట్ మాంగనూయ్ : వరుస విజయాలతో ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా ఇక క్లీన్‌స్వీప్‌పై దృష్టి సారించింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే ఐదో, చివరి ట్వంటీ20 మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలనే పట్టుదలతో భారత్ ఉంది. మరోవైపు కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా నెగ్గి కాస్తయినా పరువును కాపాడు కోవాలని ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు భావిస్తోంది. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి రెండు మ్యాచ్‌లు కూడా చివరి బంతి వరకు ఆసక్తిగా సాగి టైగా ముగిసాయి. రెండుసార్లు కూడా టీమిండియా సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఇక, ఆఖరి టి20లో కూడా కివీస్ గడ్డపై చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లకు జట్టులో కొదవలేదు. సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో కూడిన టీమిండియా వరుస విజయాలతో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవైపు కివీస్ తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తోంది. ఒత్తిడిని తట్టుకోలేక గెలవాల్సిన మ్యాచ్‌లను కూడా చేజార్చుకుంటోంది. కిందటి మ్యాచ్‌లో చేతిలో వికెట్లు ఉన్నా ఆఖరి ఓవర్‌లో ఏడు పరుగులు కూడా చేయలేక పోయింది. దీన్ని బట్టి కివీస్ ఆట ఏ స్థాయిలో సాగుతుందో ఊహించుకోవచ్చు. ఇక, టీమిండియాలో లోకేశ్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్‌లు అద్భుత ఫామ్‌లో ఉన్నారు.

భారత్ సాధించిన విజయాల్లో వీరంతా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా రాహుల్ ఆడిన అన్ని మ్యాచుల్లోనూ సత్తా చాటాడు. ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. రోహిత్ కూడా గాడిలో పడ్డాడు. కోహ్లి కెప్టెన్సీ ఇన్నింగ్స్‌లతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. బౌలింగ్‌లో కూడా భారత్‌కు తిరుగే లేదు. బుమ్రా, షమి, సైని, శార్దూల్ అద్భుతంగా రాణిస్తున్నారు. జడేజా కూడా జోరుమీదున్నాడు. దీంతో భారత్ ఈసారి కూడా గెలుపే లక్షంగా పోరుకు సిద్ధమైంది. మరోవైపు కివీస్ కూడా కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో ఎంత వరకు సఫలమవుతుందో వేచి చూడాల్సిందే.

India vs New Zealand 5th T20I

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News