Friday, April 19, 2024

నేడు ఇండోర్‌లో చివరి టి20.. క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను

- Advertisement -
- Advertisement -

India vs SA Final T20 in Indore today

సమరోత్సాహంతో భారత్, పరువు కోసం సౌతాఫ్రికా

ఇండోర్: ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా మంగళవారం సౌతాఫ్రికాతో జరిగే మూడో, చివరి టి20 మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా తహతహలాడుతోంది. ఇక తొలి రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన సౌతాఫ్రికా కనీసం ఆఖరి పోరులోనైనా గెలిచి కాస్తయినా పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. గౌహతిలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం కోసం తీవ్రంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఈసారి మాత్రం ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. మరోవైపు భారత్ కూడా గెలుపే లక్షంగా బరిలోకి దిగుతోంది. అయితే బ్యాటింగ్ బాగానే ఉన్నా బౌలింగ్ సమస్య జట్టును వెంటాడుతోంది.

కిందటి మ్యాచ్‌లో 237 పరుగుల రికార్డు స్కోరు సాధించినా విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కీలక బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకోవడం జట్టును వెంటాడుతోంది. ఈ మ్యాచ్‌లోనైనా బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయాల్సిన అవసరం నెలకొంది. హర్షల్ పటేల్, అర్ష్‌దీప్‌ల బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాటర్లు భారీగా పరుగులు పిండుకుంటున్నారు. అర్ష్‌దీప్ వికెట్లు తీస్తున్నా పరుగులు మాత్రం భారీగా ఇచ్చుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌లోనైనా అతను ఆ లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక హర్షల్ పటేల్‌కు ఈసారి తుది జట్టులో స్థానం కష్టంగానే కనిపిస్తోంది. హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌కు తుది జట్టులో అవకాశం లభించడం ఖాయమనే చెప్పాలి.

జోరుమీదున్నారు..

మరోవైపు భారత టాప్ ఆర్డర్ జోరుమీదుంది. ఓపెనర్ కెఎల్ రాహుల్ రెండు మ్యాచుల్లోనూ భారీ స్కోర్లతో అలరించాడు. కిందటి మ్యాచ్‌లో రాహుల్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక సూర్యకుమార్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. ఈసారి కూడా రాహుల్, సూర్యకుమార్‌ల నుంచి జట్టు భారీ స్కోర్లను ఆశిస్తోంది. ఇక కెప్టెన్ రోహిత్ కూడా తన బ్యాట్‌కు పనిచెబితే టీమిండియాకు ఎదురే ఉండదు. కిందటి మ్యాచ్‌లో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా మెరుపులు మెరిపించడం జట్టుకు ఊరటనిచ్చే అంశమే. దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, అశ్విన్, దీపక్ తదితరులతో భారత బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలర్లు కూడా రాణిస్తే టీమిండియాకు హ్యాట్రిక్ విజయం ఖాయమనే చెప్పాలి.

బోణీ కోసం

ఇక పర్యాటక సౌతాఫ్రికా కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలవాలని భావిస్తోంది. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన దక్షిణాఫ్రికా కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి కాస్తయిన పరువును కాపాడు కోవాలని భావిస్తోంది. డేవిడ్ మిల్లర్, డికాక్‌లు ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశం. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణిస్తే చివరి మ్యాచ్‌లో గెలవడం సఫారీ జట్టుకు అసాధ్యమేమీ కాదు. ఈ మ్యాచ్‌లో గెలిచి రానున్న వన్డే సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలనే లక్షంతో సౌతఫ్రికా కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News