Home తాజా వార్తలు క్లీన్‌స్వీప్‌కు రెండు వికెట్ల దూరంలో..

క్లీన్‌స్వీప్‌కు రెండు వికెట్ల దూరంలో..

India-vs-South-Africa

చెలరేగిన షమి, ఉమేశ్  రాణించిన నదీమ్, జడేజా
ఇన్నింగ్స్ విజయం దిశగా భారత్

రాంచీ: సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేసేందుకు టీమిండియా రెండు వికెట్ల దూరంలో నిలిచింది. ఇప్పటికే సిరీస్‌లో 20 ఆధిక్యంలో ఉన్న భారత్ వైట్‌వాష్‌కు చేరువైంది. రాంచీ వేదికగా జరుగుతున్న మూడో, చివరి మ్యాచ్‌లో కూడా సౌతాఫ్రికాకు ఇన్నింగ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. సోమవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసింది. ఇప్పటికే కీలక వికెట్లు చేజారడంతో దక్షిణాఫ్రికాకు మరోసారి ఘోర పరాజయం తప్పక పోవచ్చు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే సఫారీ జట్టు మరో 203 పరుగులు చేయాలి.

దాంతో మంగళవారం నాలుగో రోజు భారత్ విజయం లాంఛనమేనని చెప్పాలి. 9/2 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో సఫారీలను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. అనంతరం ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ చేపట్టిన పర్యాటక జట్టుకు మరోసారి కష్టాలు తప్పలేదు. ఈసారి కూడా భారత బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో సఫారీల ఇన్నింగ్స్‌ను శాసించారు. షమి, ఉమేశ్‌లు అసాధారణంగా రాణిస్తూ ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.

హంజా పోరాటం

9/2 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం బ్యాటింగ్ చేపట్టిన సౌతాఫ్రికాకు భారత బౌలర్లు ఆరంభంలోనే షాక్ ఇచ్చారు. జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ డుప్లెసిస్ నిరాశ పరిచాడు. ఒక పరుగు మాత్రమే చేసి ఉమేశ్ యాదవ్ వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో జుబేర్ హంజా, బవుమాలు కుదురుగా ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీని ఔట్ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. హంజా ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. భారత బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును ముందుకు నడిపించాడు. బవుమా కూడా కుదురుగా ఆడాడు. ఇద్దరు జాగ్రత్తగా ఆడడంతో సౌతాఫ్రికా కోలుకుంటున్నట్టే కనిపించింది. ఈ జోడీని పెవిలియన్ పంపించేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా వరకు ఫలించలేదు. హంజా చూడచక్కని షాట్లతో కనువిందు చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హంజా 79 బంతుల్లో పది ఫోర్లు, సిక్సర్‌తో 62 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇదే క్రమంలో బవుమాతో కలిసి నాలుగో వికెట్‌కు 91 పరుగులు జోడించాడు.

టప..టపా

హంజా ఔటైన తర్వాత భారత బౌలర్లు అనూహ్యంగా పుంజుకున్నారు. అప్పటి వరకు బాగానే సాగిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్ మరోసారి కుదుపు గురైంది. కుదురుగా ఆడుతున్న బవుమా (32)ను నదీమ్ వెనక్కి పంపాడు. నదీమ్ కెరీర్‌లో ఇదే తొలి టెస్టు వికెట్ కావడం విశేషం. తర్వాత వచ్చిన వికెట్ కీపర్ క్లాసెన్‌ను జడేజా చక్కటి బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. తర్వాత సౌతాఫ్రికా మళ్లీ కోలుకోలేక పోయింది. భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ సఫారీ జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. జార్జ్ లిండే కొద్ది సేపు ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా లిండే భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. అయితే చివరికి 3 ఫోర్లు, సిక్స్‌తో 37 పరుగులు చేసి ఉమేశ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. భారత బౌలర్లలో ఉమేశ్ మూడు, షమి, నదీమ్, జడేజాలు రెండేసి వికెట్లు పడగొట్టారు. భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 56.2 ఓవర్లలో 162 పరుగులకే పరిమితమైంది. దీంతో సఫారీ జట్టుకు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఫాలోఆన్ తప్పలేదు.

షమి జోరు..

ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ చేపట్టిన సౌతాఫ్రికాకు స్పీడ్‌స్టర్ మహ్మద్ షమి చుక్కలు చూపించాడు. అసాధారణ బౌలింగ్‌తో సఫారీ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. ఇదే క్రమంలో డీన్ ఎల్గర్ రిటైర్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు ఓపెనర్ క్వింటాన్ డికాక్ (5) ఉమేశ్ యాదవ్ అద్భుత బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. అప్పటికే సౌతాఫ్రికా స్కోరు ఐదు పరుగులే. ఉమేశ్ తన తొలి బంతికే ఈ వికెట్ తీశాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా వికెట్ల పతనాన్ని షమి శాసించాడు. నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడిన షమి సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను గడగడలాడించాడు. అతని ధాటికి సౌతాఫ్రికా వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. జుబేర్ హంజా (౦)ను క్లీన్ బౌల్డ్ చేసిన షమి సఫారీ కెప్టెన్ డుప్లెసిస్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

కొద్ది సేపటికే ప్రమాదకర బ్యాట్స్‌మన్ బవుమాను కూడా వెనక్కి పంపాడు. బవుమా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. మరోవైపు జట్టును ఆదుకుంటాడని భావించిన వికెట్ కీపర్ క్లాసెన్‌ను ఉమేశ్ ఎల్బీగా ఔట్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా 35 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. అయితే జార్జ్ లిండే, పీడ్ కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. లిండే 55 బంతుల్లో ఐదు ఫోర్లతో 27 పరుగులు చేశాడు. మరోవైపు సమన్వయంతో ఆడిన పీడ్ 23 పరుగులు చేసి జడేజా వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక,రిటైర్‌హర్ట్‌గా వెనుదిరిగిన ఎల్గర్ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా బ్యాటింగ్‌కు దిగిన బ్రూన్ 30 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రబడా 12 పరుగులు చేసి అశ్విన్ చేతికి చిక్కాడు. కాగా, భారత బౌలర్లలో షమి మూడు, ఉమేశ్ రెండు వికెట్లు పడగొట్టారు. అశ్విన్, జడేజాలకు ఒక్కో వికెట్ లభించింది.

స్కోరు బోర్డు
భారత్ మొదటి ఇన్నింగ్స్ : 497/9 డిక్లేర్.
సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ : డీన్ ఎల్గర్ (సి) సాహా (బి) షమి 2, క్వింటాన్ డికాక్ (సి) సాహా (బి) ఉమేశ్ 4, జుబేర్ హంజా (బి) రవీంద్ర జడేజా 62, డుప్లెసిస్ (బి) ఉమేశ్ 1, బవుమా (స్టంప్డ్) సాహా (బి) నదీమ్ 32, హెన్రిచ్ క్లాసెస్ (బి) రవీంద్ర జడేజా 6, జార్జ్ లిండే (సి) రోహిత్ (బి) ఉమేశ్ 37, డేన్ పీడ్ ఎల్బీబి షమి 4, కగిసో రబడా రనౌట్ 0, అన్రిచ్ నోర్జే ఎల్బీబి నదీమ్ 4, ఎంగిడి నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు 12, మొత్తం 56.2 ఓవర్లలో 162 ఆలౌట్.
బౌలింగ్: మహ్మద్ షమి 104222, ఉమేశ్ యాదవ్ 91403, షాబాజ్ నదీమ్ 11.24222, రవీంద్ర జడేజా 143192, రవిచంద్రన్ అశ్విన్ 121480.
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: క్వింటాన్ డికాక్ (బి) ఉమేశ్ 5, డీన్ ఎల్గర్ (రిటైర్డ్‌హర్ట్)16, జుబేర్ హంజా (బి) షమి 0, డుప్లెసిస్ ఎల్బీబి ఉమేశ్ 4, బవుమా (సి) సాహా (బి) షమి 0, హెన్రిచ్ క్లాసెస్ ఎల్బీబి ఉమేశ్ 5, జార్జ్ లిండే రనౌట్ 27, డేన్ పీడ్ (బి) రవీంద్ర జడేజా 23, బ్రూయిన్ (బ్యాటింగ్) 30, కగిసో రబడా (సి) జడేజా (బి) అశ్విన్ 12, అన్రిచ్ నోర్జే (బ్యాటింగ్) 12, ఎక్స్‌ట్రాలు 5, మొత్తం 45 ఓవర్లలో 132/8.
బౌలింగ్: మహ్మద్ షమి 95103, ఉమేశ్ యాదవ్ 91352, రవీంద్ర జడేజా 135361, షాబాజ్ నదీమ్ 50180, రవిచంద్రన్ అశ్విన్ 103281.

India vs South Africa 3rd Test at Ranchi