Wednesday, April 24, 2024

గెలుపే లక్ష్యంగా భారత్

- Advertisement -
- Advertisement -

Virat

సంచలనం కోసం శ్రీలంక నేడు తొలి  టి20

గౌహతి: కొత్త సీజన్‌ను విజయంతో ఆరంభించాలనే పట్టుదలతో శ్రీలంకతో ఆదివారం జరిగే తొలి ట్వంటీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ ఏడాది టి20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో ఇకపై జరిగే అన్ని మ్యాచ్‌లు టీమిండియాకు కీలకంగా మారాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సీజన్‌కు శ్రీకారం చుట్టాలనే పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. సీనియర్ ఆటగాడు, డాషింగ్ ఓపెనర్, కీలక బౌలర్ మహ్మద్ షమి లేకుండానే భారత్ సిరీస్‌లో తలపడనుంది. అయితే శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్‌ల రూపంలో మెరుగైన ఓపెనర్లు ఉండడం, బుమ్రా చేరడం భారత్‌కు కలిసి వచ్చే అంశమే.

ఇక, శ్రీలంక కూడా సిరీస్‌ను సవాలుగా తీసుకుంది. ఇందులో గెలవడం ద్వారా రానున్న సిరీస్‌లకు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని భావిస్తోంది. ప్రతిభావంతులైన క్రికెటర్లతో కూడిన లంక గెలుపే లక్షంగా పెట్టుకుంది. సీనియర్లు లసిత్ మలింగ, ఎంజిలో మాథ్యూస్ జట్టుకు కీలకంగా మారారు. వీరిద్దరిపైనే జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అపార అనుభవజ్ఞులైన వీరిద్దరూ విజృంభిస్తే భారత్‌ను ఓడించడం లంక జట్టుకు అసాధ్యమేమి కాదు.

ఓపెనర్లే కీలకం..

కిందటి ఏడాది వరుస విజయాలతో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన టీమిండియా ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే లక్షంతో కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఇక, ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఓపెనర్లు కీలకంగా మారారు. రోహిత్ శర్మ లేక పోవడంతో రాహుల్, ధావన్‌లు ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఖాయమనే చెప్పాలి. గాయం నుంచి కోలుకున్న ధావన్ ఇటీవలే జరిగిన రంజీ మ్యాచ్‌లో సెంచరీతో గాడిలో పడ్డాడు. రాహుల్ కూడా విండీస్‌పై మెరుపులు మెరిపించాడు. లంకపై కూడా ఇద్దరు చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక, భారత్ కూడా వీరిపై భారీ ఆశలే పెట్టుకుంది. వీరు శుభారంభం అందిస్తే తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడే అవకాశం ఉంటుంది.

కోహ్లిపైనే భారం..

మరోవైపు రోహిత్ దూరంగా ఉండడంతో కెప్టెన్ విరాట్ కోహ్లి బాధ్యతలు మరింత పెరిగాయి. ఈసారి జట్టుకు కోహ్లి ప్రధాన అస్త్రంగా మారాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి విజృంభిస్తే ప్రత్యర్థి బౌలర్లు కష్టాలు ఖాయం. కిందటి సిరీస్‌లో కూడా కోహ్లి భారీ స్కోర్లతో జట్టుకు అండగా నిలిచాడు. ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. కోహ్లి తన మార్క్ ఆటతో విజృంభిస్తే సిరీస్‌లో భారత్‌కు ఎదురే ఉండదు. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారించడం కోహ్లి అలవాటుగా మార్చుకున్నాడు. ఇక, ఈ మ్యాచ్‌లో ఒక పరుగు సాధిస్తే కోహ్లి అరుదైన రికార్డును సొంతం చేసుకుంటాడు. ట్వంటీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచేందుకు ఒక అడుగు దూరంలో ఉన్నాడు. లంక మ్యాచ్‌లో ఒక పరుగు సాధిస్తే రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును చేరిపేస్తాడు.

కొంత కాలంగా వరుస ఓటములతో తిరోగమనంలో ప్రయాణిస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టు భారత్‌తో జరిగే సిరీస్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబరచ డం ద్వారా కొత్త సీజన్‌ను ఆత్మవిశ్వాసంతో ప్రారంభించాలని భావిస్తోంది. సీనియర్ ఆటగా ళ్లు లసిత్ మలింగ, మాథ్యూస్‌లతో పాటు ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. దీంతో శ్రీలంక ఈ సిరీస్‌లో సంచలనం సృష్టించాలనే పట్టుదలతో ఉంది. ఒకప్పుడూ ప్రపంచ క్రికెట్‌లో బలమైన జట్టుగా కొనసాగిన శ్రీలంక కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతోంది.

సీనియర్ క్రికెటర్లు మహేల జయవర్ధనే, దిల్షాన్, సంగక్కర, హెరాత్ తదితరులు తప్పుకోవడంతో లంక బలహీనంగా మారింది. చివరికి బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ వంటి చిన్న జట్ల చేతుల్లోనూ ఓటమి పాలుకాక తప్పడం లేదు. అయితే ఇటీవలే పాకిస్థాన్ గడ్డపై జరిగిన ట్వంటీ20 సిరీస్‌లో సంచలన విజయం సాధించడంతో లంక ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. స్టార్ ఆటగాళ్లు లేకుండానే ఈ సిరీస్‌లో ఆడిన లంక 30తో క్లీన్‌స్వీప్ చేసింది. అగ్రశ్రేణి ఆటగాళ్లతో కూడిన పాకిస్థాన్‌ను వారి సొంత గడ్డపైనే చిత్తుచిత్తుగా ఓడించి లంక జట్టు పెను ప్రకంపనలే సృష్టించింది.

ఇక, భారత్‌తో జరిగే సిరీస్‌లో సీనియర్, జూనియర్ క్రికెటర్లతో లంక సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు లంక జట్టులో కొదవలేదు. దీంతో ఈ సిరీస్‌లో భారీ ఆశలపై బరిలోకి దిగుతోంది. అయితే భారత్ వంటి బలమైన జట్టును ఓడించడం అంత తేలిక కాదు. కానీ, సంచలన విజయాలకు మరో పేరుగా చెప్పుకునే లంకను ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయలేం.

అందరి కళ్లు బుమ్రాపైనే

గాయం వల్ల సుదీర్ఘ కాలం జట్టుకు దూరంగా ఉన్న స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ ద్వారా మళ్లీ పునరాగమనం చేస్తున్నాడు. దీంతో అందరి కళ్లు బుమ్రాపైనే నిలిచాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా బుమ్రా పేరు తెచ్చుకున్నాడు. ఫార్మాట్ ఏదైనా వికెట్ల పంట పండించడం అలవాటుగా మార్చుకున్నాడు. కెరీర్ ఆరంభించిన కొన్ని రోజుల్లోనే జట్టుకు ప్రధాన అస్త్రంగా మారాడు. ఈసారి కూడా జట్టు అతనిపైనే భారీ ఆశలు పెట్టుకుంది. సీనియర్ బౌలర్లు షమి, భువనేశ్వర్‌లు జట్టుకు దూరంగా ఉన్న పరిస్థితుల్లో బుమ్రా బాధ్యతలు మరింత పెరిగాయి. మరోవైపు దీపక్ చాహర్ కూడా జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు.

దీంతో యువ సంచలనం నవ్‌దీప్ సైనీ, శార్ధూల్ ఠాకూర్‌లతో కలిసి బుమ్రా ఫాస్ట్ బౌలింగ్ భారాన్ని మోయనున్నాడు. కాగా, చాలా రోజుల తర్వాత మళ్లీ బరిలోకి దిగుతుండడంతో బుమ్రా ఎలా రాణిస్తాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు కుల్దీప్ యాదవ్, చాహల్, జడేజా, సుందర్‌లతో భారత స్పిన్ విభాగం చాలా బలంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉన్న టీమిండియా సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

పంత్‌కు పరీక్షే!

కొంతకాలంగా వరుస వైఫల్యాలు చవిచూస్తున్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు కూడా సిరీస్ చాలా కీలకంగా మారింది. రానున్న రోజుల్లో జట్టులో స్థానాన్ని కాపాడు కోవాలంటే పంత్ తన ఆటను గణనీయంగా మెరుగు పరుచుకోక తప్పదు. ఇప్పటికే పంత్‌కు ఎన్నో అవకాశాలు లభించాయి. అయినా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. కనీసం లంక సిరీస్‌లోనైనా ఆ లోటును తీర్చుకోవాల్సిన బాధ్యత పంత్‌పై ఉంది. ఇక, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రవీంద్ర జడేజా తదితరులకు కూడా ఈ సిరీస్ సవాలుగా మారింది. రానున్న సిరీస్‌లకు జట్టులో చోటు సుస్థితరం చేసుకోవాలంటే ఇందులో మెరుగ్గా రాణించాల్సిన బాధ్యత వీరిపై ఎంతైన ఉంది. ఇందులో విఫలమైతే మాత్రం కష్టాలు రెట్టింపు కావడం ఖాయం.

జట్ల వివరాలు

భారత్
విరాట్ కోహ్లి (కెప్టెన్), లోకేశ్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, సంజు శాంసన్, బుమ్రా, చాహల్, సైనీ, ఠాకూర్, కుల్దీప్ యాదవ్.
శ్రీలంక
లసిత్ మలింగ (కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్సె, ఒశాడా ఫెర్నాండో, ధనుష్క గుణతిలక, మాథ్యూస్, దాసున్ శనక, ధనంజయ డిసిల్వా, ఇసురు ఉడాన, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, డిక్వెల్లా, వనిండు హరసంగా, లహిరు కుమార, సండకాన్, కాసున్ రజిత.

India vs Sri Lanka 1st T20I

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News