Home తాజా వార్తలు చావో.. రేవో!

చావో.. రేవో!

virat kohli

నిర్ణాయక మ్యాచ్‌కోసం కోహ్లీ సేన సమాయత్తం, విజయోత్సాహంలో కరేబియన్లు
నేడే వాంఖడే స్టేడియంలో చివరి టి-20 మ్యాచ్,  రాత్రి 7 గంటలకు స్టార్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం

ముంబయి: చావో.. రేవో తేల్చుకోవలసిన కీలక మ్యాచ్‌కోసం కోహ్లీ సేన, వెస్టిండీస్ సిద్ధమవుతున్నాయి. మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో చెరి ఒక మ్యాచ్ గెలుచుకుని సమవుజ్జీలుగా నిలిచిన ఇరు జట్లు బుధవారం వాంఖడే స్టేడియంలో జరగబోయే నిర్ణాయక మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నాయి. హైదరాబాద్‌లో భారీ లక్షాన్ని అలవోకగా ఛేదించిన కోహ్లీ సేన తిరువనంతపురంలో జరిగిన రెండో మ్యాచ్‌లో అన్ని రంగాల్లో ముఖ్యంగా ఫీల్డింగ్‌లో పూర్తిగా విఫలమైంది. ‘ క్యాచ్‌లే మ్యాచ్‌లను గెలిపిస్తాయి’ అన్న క్రికెట్ నానుడిని ఆ మ్యాచ్‌లో టీమిండియా మరిచి పోయిందేమోననిపిపించింది.

ఫీల్డింగ్ వైఫల్యాలపై జట్టు సారథి విరాట్ కోహ్లీ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం అందరికీ తెలిసిందే. క్యాచ్‌లను జారవిడిచినప్పుడు ఎన్ని పరుగులు చేసినా లాభం ఉండదని కోహ్లీ వ్యాఖ్యానించడం మన జట్టు ఫీల్డింగ్ ఎంత పేలవంగా ఉందో అద్దం పడతాయి. మరో వైపు తిరువనంతపురంలో భారత్ విజయపరంపరకు అడ్డుకట్ట వేసిన పోలార్డ్ నేతృత్వంలోని విండీస్ జట్టు చివరి మ్యాచ్‌లోను గెలిచి రెండు సార్లు ప్రపంచ కప్‌ను గెలుచుకున్న జట్టుగా ఉన్న కీర్తిని నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉంది. ప్రత్యర్థి జట్లు రెండింటికీ ఎక్కడా పోలిక లేదు, వెస్టిండీస్ జట్టులో అంతా యువరక్తమే కాగా టీమిండియా అనుభవజ్ఞులు, యువకుల కలబోత. అయినా లక్షాన్ని అలవోకగా ఛేదించే భారతజట్టు తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం బ్యాటెత్తేస్తోంది.

టి20 మ్యాచ్‌లలో చివరి ఐదు ఓవర్లు ఏ జట్టుకైనా కీలకం. ఈ ఐదు ఓవర్లలో 50కి పైగా పరుగులు చేయడం సర్వ సాధారణం. అయితే తిరువనంతపురం మ్యాచ్‌లో మాత్రం టీమిండియా ఆ సూత్రాన్ని మరిచిపోయినట్లు కనిపించింది. మ్యాచ్ ఫినిషర్ల కొరతను ఇది సూచిస్తుంది. మూడో టి20లో ఈ సమస్యను అధిగమించకపోతే చాలా కష్టం. ఎందుకంటే మంచు కురిసే వాంఖ డే స్టేడియంలో ఛేదన చాలా సులభం. ఒక వేళ విండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్‌ను ఎంచుకుంటే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న.

కోహ్లీ సేనకు సమస్యలు

కోహ్లీ సేనకు అటు ఫీల్డింగ్‌తో పాటుగా బౌలింగ్‌లో కూడా సమస్యలు తప్పడం లేదు. తొలి మ్యాచ్‌లో నాలుగు, రెండో మ్యాచ్‌లో మూడు క్యాచ్‌లు జారవిడవడం చూస్తే ఫిట్‌నెస్ సామర్థం ఎంతో మెరుగుపడిన టీమిండియాలో 90 దశకం నాటి అవలక్షణాలు కనిపించడమేమిటని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక బౌలింగ్ విషయంలోను సమస్యలు ప్రస్ఫుటిస్తున్నాయి. వాషింగ్టన్ సుందర్ పవర్‌ప్లేలో పరుగులను అరికడుతున్నా వికెట్లు తీయడంలో విఫలమవుతున్నాడు. వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లతో జరిగిన ఐదు మ్యాచ్‌లలో కలిసి సుందర్ మూడు వికెట్లు మాత్రమే సాధించాడు.

మరో వైపు తాను బౌల్ చేసిన 23 ఓవర్లలో కలిపి మొత్తం 144 పరుగులు సమర్పించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో ఆడిన రెండు టి20 మ్యాచ్‌లలో ఒక్క వికెట్ కూడా తీయలేదు. దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ కూడా పూర్తి సత్తా చూపలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో చివరి మ్యాచ్‌లో చాహర్ స్థానంలో షమీని, సుందర్‌కు బదులు కుల్దీప్‌ను పరీక్షించినా ఆశ్చర్యపోవలసిన పని లేదు. తిరువనంతపురం మ్యాచ్‌లో అర్ధ శతకంతో ఆకట్టుకున్న ఆల్‌రౌండర్ శివమ్ దూబేనుంచి అభిమానులు మరోసారి అలాంటి ఇన్నింగ్స్‌నే కోరుకుంటున్నారు. పంత్ సమయోచితంగా ఆడినా మునుపటి ఫామ్‌ను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.

సంజుకు చోటుంటుందా?

ఎప్పుడో నాలుగేళ్ల క్రితం జింబాబ్వేపై ఒక్క టి20 మ్యాచ్ ఆడాడు సంజు శాంసన్. బంగ్లాదేశ్ సిరీస్‌లో జట్టులో చోటు దక్కలేదు. ప్రస్తుత సిరీస్‌లోనూ తొలి రెండు మ్యాచ్‌లలో ఎంపిక కాలేదు. మరి కీలకమైన వాంఖడే పోరులో అతనికి చోటు దక్కుతుందా అన్న సందేహాలు లెత్తుతున్నాయి. ఒక వేళ సంజును జట్టులోకి తీసుకుంటే ఎవరిని పక్కన పెట్టాలన్నది కోహ్లీకి మరో తలనొప్పి. వరసగా విఫలమవుతున్నా పంత్‌కు మద్దతుగా ఉంటామంటున్నాడు. రాహుల్ అర్ధ శతకంతో రాణించాడు. వీరిద్దరిలో ఎవరికీ విశ్రాంతి ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అయితే సంజు ఏ స్థానంలోనైనా ఆడగలడు. కాబట్టి శ్రేయాస్ అయ్యర్ స్థానంలో ఆడించవచ్చు. అయితే కీలకమైన నాలుగో స్థానానికి అయ్యరే సరయిన వాడని భావిస్తున్న తరుణంలో అతడిని తప్పిస్తే ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నది మరో ప్రశ్న.

కీలకమైన మ్యాచ్‌లో బౌలర్‌ను తగ్గించే సాహసం విరాట్ చేస్తాడా? అలా కానప్పుడు సంజు ఎదురు చూపులు ఫలిస్తాయా? అయితే మొత్తంమీదచూస్తే టీమిండియాకు బ్యాటింగ్ పెద్ద సమస్యగా కనిపించడం లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. గత రెండు మ్యాచ్‌లలో విఫలమైనా రోహిత్ తన సొంత మైదానంలో చెలరేగడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. మరో ఓపెనర్ కెఎల్ రాహుల్, సారథి కోహ్లీ లు మంచి ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసిన శివమ్ దూబే భారీ షాట్లు కొట్టగలనని నిరూపించుకున్నాడు. ఒక వేళ జట్టులో కొనసాగితే శ్రేయాస్ అయ్యర్ కూడా ముంబయి అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నా డు. పంత్, జడేజాలాంటి ఆల్‌రౌండర్లు ఉండనే ఉన్నారు.

ధీమాగా పోలార్డ్ సేన

మరోవైపు తిరువనంతపురంలో విజయంతో పోలార్డ్ సేనలో ఆత్మవిశ్వాసం ద్విగుణీకృతమైంది. సిమన్స్, లూయిస్, హెట్‌మైర్, పూరన్, బ్రాండన్ కింగ్, పోలార్డ్ అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఏ ఇద్దరు నిలబడినా పరుగుల వరద ఖాయం. మరో వైపు వాంఖడే స్టేడియం పోలార్డ్‌కు కొట్టిన పిండి. ఐపిఎల్‌లో ముంబయి తరఫున చాలాకాలంగా ఆడుతున్న అతనికి అక్కడి పిచ్, వాతావరణంపై పూర్తి అవగాహన ఉంది. బౌలర్లు షెల్డన్ కాట్రెల్, పియరీ, విలియమ్స్, హేడెన్ వాల్ష్‌లు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ, పరుగులను నియంత్రిస్తూ సత్తా చాటుతున్నారు. కాబట్టి కోహ్లీ సేన తన ప్రణాళికను పక్కాగా రూపొందించుకుని అమలు చేయాలి. లేకపోతే కష్టాలు తప్పవు.

ఇరు జట్లు
భారత్: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, సంజు శాంసన్.
వెస్టిండీస్: కీరన్ పోలార్డ్(కెప్టెన్), ఫాబియన్ అల్లెన్, బ్రండన్ కింగ్, డేనిష్ రాందిన్, షెల్డన్ కాట్రెల్, ఎవిన్ లూయిస్, రూథర్‌ఫోర్డ్, షిమ్రాన్ హెట్‌మైర్, ఖారీ పియర్రీ, లెండిల్ సిమన్స్, జాసోన్ హోల్డర్, హేడెన్ వాల్ష్, కీమో పాల్, కేస్రిక్ విలియమ్స్.

India vs West Indies 3rd T20I