Home తాజా వార్తలు 20-21లో 8% కంటే ఎక్కువ వృద్ధి రేటు…

20-21లో 8% కంటే ఎక్కువ వృద్ధి రేటు…

Growth Rate

 

నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్

న్యూయార్క్ : రాబోయే 2020- 21 ఆర్థిక సంవత్సరం నుంచి భారత్ 8 శాతానికి పైగా వృద్ధి రేటును సాధించనుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) వంటి నిర్మాణాత్మక సంస్కరణలకు ఫలితాలు అందుకుంటామని, అప్పటి నుంచి భారత్ జిడిపి వేగవంతమవుతుందని అన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యం’పై నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి కుమార్ ఇక్కడకు వచ్చారు.

ఈ సందర్భంగా న్యూయార్క్‌లో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలో జరిగిన ‘ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ సెమినార్’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాబోయే ఐదేళ్లలో భారత్ ఆర్థిక వృద్ధి రేటును ప్రస్తుతం ఉన్న ఏడు శాతం నుంచి ఎనిమిది శాతానికి పెంచడంపై మోడీ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఆయన అన్నారు. దీంతో దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అన్నారు.

కుమార్ మాట్లాడుతూ ‘వ్యక్తిగతంగా, 2020-21 నాటికి, మేము ఎనిమిది శాతానికి పైగా ఆర్థిక వృద్ధి రేటును సాధిస్తాం. అది చాలా సంవత్సరాలు కొనసాగుతుంది’ అని అన్నారు. జిఎస్‌టి, దివాలా చట్టం వంటి సంస్కరణలతో దీనికి పునాది పడిందని అన్నారు. ఈ సంస్కరణలు ఫలప్రదం కావడానికి సమయం పడుతుందని, అయితే ఇప్పుడు అవి ప్రయోజనాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వృద్ధిని రెండంకెలకు చేరే అవకాశం ఉందని, వచ్చే ఐదేళ్లలో దేశంలో పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కుమార్ చెప్పారు.

India will Achieve Growth Rate of over 8%