Home తాజా వార్తలు వెండికొండ విహాన్

వెండికొండ విహాన్

India will increase his medals in asian games

డబుల్ ట్రాప్‌లో శార్దుల్‌కు రజతం                                                                                                                            మహిళా టెన్నిస్ సింగిల్స్‌లో అంకిత రైనాకు కాంస్యం                                                                                                ఆసియా క్రీడలు.. ఐదో రోజు

పాలేంబంగ్ (ఇండోనేషియా): ఆసియా క్రీడల్లో భారత్ తన పతకాల ఖాతాను పెంచుకుంటూ పోతోంది. తాజాగా టెన్నిస్, డబుల్ ట్రాప్ షూటింగ్‌లో పతకాలు సాధించింది. 15 ఏళ్ల భారతీయ యువ షూటర్ శార్దూల్ విహాన్ గురువారం పురుషుల డబుల్ ట్రాప్‌లో రన్నరప్‌గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మీరట్‌కు చెందిన విహాన్ ఫైనల్‌లో 73 షాట్‌లు కొట్టాడు. కాగా స్వర్ణ పతకం మాత్రం దక్షిణ కొరియాకు చెందిన హ్యున్‌వూ షిన్(34) దిక్కించుకోగా, ఖతార్‌కు చెందిన హమద్ అలీ అల్ మర్రీ(42) కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. సాధారణంగా షాట్‌గన్ పోటీల్లో వయస్సులో పెద్దవారే ఆధిపత్యం చెలాయిస్తుంటారు. కానీ గురువారం అది కుదరలేదు. మోడీపురంలో దయావతి మోడీ అకాడమీలో 10వ తరగతి చదువుకుంటున్న విహాన్ వయస్సులో రెట్టింపు, అనుభవంలో ఆరితేరిన షూటర్లకు దీటుగా నిలిచాడు. కాంస్య పతక విజేత అయితే విహాన్ కన్నా మూడింతల వయస్సు పెద్దవాడు. ఇంతకు ముందు మీరట్‌కే చెందిన 16 ఏళ్ల వయస్సున్న సౌరభ్ చౌదరి కూడా మంగళవారం 10మీ. పిస్టల్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు విహాన్ సాధించిన రజతంతో భారత్ జకాబరింగ్ షూటింగ్ రేంజ్ నుంచి ఎనిమిదవ పతకాన్ని స్వాధీనం చేసుకుంది.

నాలుగేళ్ల కిందటే పునాది..
విహాన్ షూటింగ్‌ను నాలుగేళ్ల కిందటే సీరియస్‌గా తీసుకున్నాడు. షామ్లీకి చెందిన కోచ్ అన్వర్ సుల్తాన్ వద్ద అతడు శిక్షణ పొందాడు. ‘విహాన్ ఏ క్రీడా విభాగంలో ఆడిన రాణిస్తాడని నాకు తెలుసు. అది టెనిస్, బ్యాడ్మింటన్ లేక ఏదైన వేరే క్రీడ కావొచ్చు. అతడి కండబలం అద్భుతం. ఇప్పుడు నేను అతడిని ట్రాప్ ఈవెంట్‌కు తయారుచేస్తాను’ అని కోచ్ అన్వర్ సుల్తాన్ చెప్పారు. విహాన్ మామ మనోజ్ విహాన్ కూడా అతడితో ఉన్నాడు. ఆయన కూడా విహాన్‌ది అరుదైన ప్రతిభ అన్నారు. విహాన్ వ్యాపార కుటుంబం నుంచి వచ్చాడు. వారి కుటుంబం ప్రాపర్టీ, సేద్యంలో నిమగ్నమై ఉంది. ఇంతకు ముందు అతడు క్రికెట్, బ్యాడ్మింటన్ కూడా ఆడి చూశాడు. కానీ చివరికి షూటింగ్‌లో స్థిరపడ్డాడు.

తనకన్నా రెట్టింపు వయస్సు, అనుభవం ఉన్న ప్రత్యర్థులను చూసి విహాన్ ఏ మాత్రం కంగు తినలేదు.గేమ్స్ విలేజ్‌లో తన మిత్రుడు, తోటి షూటర్ లక్ష షెరాన్‌తో బుధవారం రాత్రి పియుబిజి అనే షూటింగ్ విడియో గేమ్‌ను ఆడాక విహాన్‌కు భారత కోచ్ సకాలంలో సలహా ఇచ్చాడు. దాని గురించి.. ‘రేపు నీతో పోటీపడే వాళ్లు నీకంటే ఎక్కువ వయసున్న వాళ్లు అని సర్‌అన్నారు.. నిర్భయంగా ఆడాలి అన్నారు. ఆయన చెప్పినట్లే నేను నిరయంగా ఆడాను’ అని విహాన్ విలేకరులకు చెప్పాడు. డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో పాల్గొన్న ఇతర భారతీయ షూటర్లలో అంకుర్ మిట్టల్ ఫైనల్‌లో రాణించలేకపోయాడు. శ్రేయాసీ సింగ్, వర్ష వర్మన్ కూడా నిరాశపరిచారు. వారు డబుల్ ట్రాప్‌లో 6వ, 7వ స్థానంలో నిలిచారు.

టెన్నిస్‌లో అంకిత రైనాకు కాంస్యం
ఆసియా క్రీడలు సింగిల్స్ పతకాల జాబితాలో రెండో భారతీయ క్రీడాకారిణిగా 25 ఏళ్ల అంకిత రైనా నిలిచింది. పాలేంబంగ్‌లో గురువారం జరిగిన మహిళా సింగిల్స్ సెమీఫైనల్‌లో చైనాకు చెందిన ఝాంగ్ షూయీ చేతిలో ఓడిపోయిన భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా కాంస్య పతకంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. రెండు గంటలపాటు జరిగిన హోరాహోరి పోరులో అంకిత 46, 67(6)తో ఓటమిపాలైంది. ఇప్పటి వరకు టెనిస్ మహిళా సింగిల్స్‌లో సానియా మీర్జాదే రికార్డుగా ఉంది. సానియా 2006లో దోహాలో రజతం, తర్వాత 2010లో గ్వాంగ్‌జూలో కాంస్యం సాధించింది. అంకిత గురువారం కాంస్యం సాధించడంతో ఆసియా క్రీడల సింగిల్స్ పతకాల జాబితాలో రెండో మహిళగా నిలిచింది.