Home స్కోర్ ఫైనల్లో టీమిండియా

ఫైనల్లో టీమిండియా

2020

కొలంబో: నిదహాస్ ముక్కోణపు ట్వంటీ20 టోర్నమెంట్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ పోరుకు చేరుకుంది. ఈ విజయంతో భారత్ అగ్రస్థానంలో నిలిచి టైటిల్ రేసుకు దూసుకెళ్లింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 176 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. శ్రీలంకపై కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడిన దాస్ ఈసారి నిరాశ పరిచాడు. ఏడు పరుగులు చేసిన దాస్‌ను వాషింగ్టన్ పెవిలియన్ పంపించాడు. తర్వాత వచ్చిన సౌమ్య సర్కార్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. ఒక పరుగు మాత్రమే చేసి వాషింగ్టన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మరోవైపు ధాటిగా ఆడిన తమీమ్ ఇక్బాల్ 4ఫోర్లు, ఒక సిక్స్‌తో 27 పరుగులు చేసి వాషింగ్టన్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ మహ్మదుల్లా (11)ను ఠాకూర్ వెనక్కి పంపాడు. దీంతో బంగ్లా 61 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
రహీం పోరాటం…
ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను సీనియర్ ఆటగాడు ముష్ఫికుర్ రహీం తనపై వేసుకున్నాడు. అతనికి షబ్బీర్ అలీ అండగా నిలిచాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న రహీం పరుగుల వరద పారించాడు. రహీం దూకుడుగా ఆడడంతో బంగ్లా గెలుపు అవకాశాలు మళ్లీ చిగురించాయి. అయితే కీలక సమయంలో భారత బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో చేయాల్సిన రన్‌రేట్ పెరిగి పోయింది. దీంతో బంగ్లాకు 17 పరుగుల ఓటమి తప్పలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రహీం 55 బంతుల్లో 8ఫోర్లు, ఒక సిక్స్‌తో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. షబ్బీర్ రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో 27 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 22 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టాడు.
రోహిత్ మెరుపులు…

rhts
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు మెరుగైన ఆరంభాన్ని ఇచ్చారు. టోర్నమెంట్‌లో వరుస వైఫల్యాలు చవిచూస్తున్న రోహిత్ తొలి సారి రాణించాడు. బంగ్లాదేశ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న రోహిత్ పరుగుల వరద పారించాడు. ధావన్ కూడా మెరుపులు మెరిపించాడు. దీంతో భారత్‌కు తొలిసారి మెరుగైన ఆరంభం లభించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన ధావన్ 27 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 35 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించాడు. మరోవైపు చెలరేగి ఆడిన సురేశ్ రైనా 30 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. ఇక, కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ ఐదు భారీ సిక్సర్లు, మరో 5ఫోర్లతో 61 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. దీంతో భారత్ స్కోరు 176కు చేరింది.

స్కోరుబోర్డు:
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ రనౌట్ 89, శిఖర్ ధావన్ (బి) రుబెల్ 35, సురేశ్ రైనా (సి) సౌమ్య సర్కార్ (బి) రుబెల్ 47, దినేష్ కార్తీక్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు 3, మొత్తం 20 ఓవర్లలో 176/3.
బౌలింగ్: అబు హైదర్ రొని 40430, నజ్ముల్ ఇస్లామ్ 40270, రుబెల్ హుసేన్ 40272, ముస్తఫిజుర్ రహ్మాన్ 40380, మెహది హసన్ 30310, మహ్మదుల్లా 1090.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ ఇక్బాల్ (బి) వాషింగ్టన్ సుందర్ 27, లిటన్ దాస్ (స్టంప్డ్) కార్తీక్ (బి) వాషింగ్టన్ 7, సౌమ్య సర్కార్ (బి) వాషింగ్టన్ 1, ముష్ఫికుర్ రహీం నాటౌట్ 72, మహ్మదుల్లా (సి) రాహుల్ (బి) చాహల్ 11, షబ్బీర్ రహ్మాన్ (బి) శార్దూల్ ఠాకూర్ 27, మెహది హసన్ (సి) రైనా (బి) సిరాజ్ 7, అబు హైదర్ రొని నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు 7, మొత్తం 20 ఓవర్లలో 159/6.
బౌలింగ్: మహ్మద్ సిరాజ్ 40501, వాషింగ్టన్ సుందర్ 40223, శార్దూల్ ఠాకూర్ 40371, చాహల్ 40211, విజయ్ శంకర్ 40280.