Home స్కోర్ కివిస్ కు తొలి దెబ్బ

కివిస్ కు తొలి దెబ్బ

india* రోహిత్, ధావన్ మెరుపులు, సత్తా చాటిన బౌలర్లు,
* తొలి టి-20లో కోహ్లి సేన ఘన విజయం

న్యూఢిల్లీ: ట్వంటీ20లో న్యూజిలాండ్‌పై విజయం సాధించాలనే టీమిండియా నిరీక్షణకు ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో తెరపడింది. బుధవారం ఇక్కడ జరిగిన తొలి టి20లో భారత్ 53 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. ఆల్‌రౌండ్‌షో అదరగొట్టిన కోహ్లి సేన చివరి మ్యాచ్ ఆడిన వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశీష్ నెహ్రాకు విజయాన్ని కానుకగా ఇచ్చింది. ఈ మ్యాచ్ అనంతరం నెహ్రా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మరోవైపు యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు శ్రీకారం చుట్టాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత బరిలోకి దిగిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారత బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తూ కివీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.
ప్రారంభంలోనే
భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ప్రారంభంలోనే కోలుకోలేని షాక్ తగిలింది. ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ పేలవమైన ఫాంను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. నాలుగు పరుగులు మాత్రమే చేసి చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరో ఓపెనర్ కొలిన్ మున్రో కూడా నిరాశ పరిచాడు. ఏడు పరుగులు మాత్రమే చేసి భువనేశ్వర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్ విలియమ్సన్, వికెట్ కీపర్ టామ్ లాథమ్ కొద్ది సేపు పోరాటాన్ని కొనసాగించారు. అయితే భారత బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో స్కోరు నత్తనడకన సాగింది. కాగా, స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో కెప్టెన్ విలియమ్సన్ (28) పాండ్య బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ చేరారు. దీంతో కివీస్‌కు ఘోర పరాజయం తప్పలేదు. మరోవైపు ఒంటరి పోరాటం చేసిన లాథమ్ మూడు ఫోర్లు, సిక్స్‌తో 39 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. పొదుపుగా బౌలింగ్ చేసిన చాహల్ కూడా తన ఖాతాలో రెండు వికెట్లు వేసుకున్నాడు. చివరి మ్యాచ్ ఆడిన నెహ్రా కూడా ఆకట్టుకున్నాడు. అయితే అతనికి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన శిఖర్ ధావన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.
శుభారంభం
టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు శుభారంభం అందించారు. ఇద్దరు తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై పైచేయి సాధించారు. రోహిత్ కాస్త జాగ్రత్తగా ఆడగా శిఖర్ వరుస బౌండరీలతో హోరెత్తించాడు. కివీస్ ఈ మ్యాచ్‌లో ప్రారంభ ఓవర్ స్పిన్నర్ సాంట్నర్‌తో వేయించింది. ఇది కూడా భారత ఓపెనర్లకు కలిసి వచ్చింది. మరో ఎండ్ నుంచి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ చేశారు. వీరిద్దరి బౌలింగ్‌ను శిఖర్, రోహిత్‌లు సమర్థంగా ఎదుర్కొన్నారు. ఈ జంటను విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రారంభంలోనే ధావన్ దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. దీంతో భారత్ స్కోరు 6.4 ఓవర్లలోనే 50కి చేరింది. ఇందులో ధావన్ ఒక్కడే 33 పరుగులు చేయడం విశేషం.

ధావన్, రోహిత్ అర్ధ సెంచరీలు
తర్వాత కూడా ధావన్ జోరు సాగించాడు. అతను చెలరేగడంతో కివీస్ బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇదే క్రమంలో ధావన్ 37 బంతుల్లోనే ఏడు ఫోర్లతో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. ఆ తర్వాత స్కోరును పరిగెత్తించే బాధ్యత రోహిత్ శర్మ తనపై వేసుకున్నాడు. అప్పటి వరకు సమన్వయంతో బ్యాటింగ్ చేసిన రోహిత్ తన మార్క్ షాట్లతో చెలరేగాడు. అతన్ని కట్టడి చేయడంతో కివీస్ బౌలర్లకు శక్తికి మించిన పనిగా మారింది. వరుస సిక్సర్లతో విరుచుపడిన రోహిత్ అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. వేగంగా ఆడిన రోహిత్ మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇదే సమయంలో భారత్ స్కోరు 15.3 ఓవర్లలో 150కి చేరింది. అయితే 52 బంతుల్లో పది ఫోర్లు, రెండు సిక్సర్లతో 80 పరుగులు చేసిన శిఖర్‌ను ఐష్ సోధి పెవిలియన్ పంపించాడు. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్య (౦) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఈ వికెట్ కూడా సోధి ఖాతాలోకే వెళ్లింది. కొద్ది సేపటికే రోహిత్ శర్మ కూడా పెవిలియన్ బాట పట్టాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 55 బంతుల్లో ఆరు బౌండరీలు, మరో నాలుగు భారీ సిక్సర్లతో 80 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. కివీస్ బౌలర్లను హడలెత్తించిన కోహ్లి 11 బంతుల్లోనే మూడు కళ్లు చెదిరే సిక్స్‌లతో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ధోని ఒక సిక్స్‌తో ఏడు పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో భారత్ స్కోరు 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 202కు చేరింది. కివీస్ బౌలర్లలో ఐష్ సోధి మాత్రమే రాణించాడు. నాలుగు ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.

గెలుపుతో నెహ్రాకు వీడ్కోలు
భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశీష్ నెహ్రా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. బుధవారం ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు నెహ్రా ప్రకటించాడు. ఈ సందర్భంగా నెహ్రా ఉద్వేగానికి లోనయ్యాడు. మ రోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనితో సహా జట్టు సభ్యు లు నెహ్రాకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా భారత క్రికెట్‌కు నెహ్రా చేసిన సేవలను వారు కొనియాడారు. 1999లో శ్రీలంకతో జరిగిన టెస్టులో నెహ్రా అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టారు. సుదీర్ఘకాలం పాటు సాగిన కెరీర్‌లో నెహ్రా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. 17 టెస్టుల్లో భారత్‌కు ప్రాతిని థ్యం వహించిన నెహ్రా 44 వికెట్లను పడగొట్టాడు. వన్డేల్లో మాత్రం మెరుగైన ప్రతిభను కనబరిచాడు. 120 వన్డేలు ఆడిన నెహ్రా 157 వికెట్లను తన ఖాతాలో జమా చేసుకున్నాడు. అంతేగాక కాగా పొట్టి క్రికెట్ ట్వంటీ20లో కూడా అద్భుతంగా రాణించాడు. 26 మ్యాచుల్లో 34 వికెట్లను పడగొట్టాడు.