Thursday, April 25, 2024

మళ్లీ మెరిసిన రాహుల్, అయ్యర్

- Advertisement -
- Advertisement -

team India

 

కలిసికట్టుగా రాణించిన బౌలర్లు, కివీస్‌పై రెండో టి20లో అలవోక విజయం

ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన రెండో టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టి20ల సిరీస్‌లో కోహ్లీ సేన 2-0 ఆధిక్యత సాధించింది. ఆదివారం అచ్చొచ్చిన ఆక్లాండ్ వేదికగా జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థిని బోల్తా కొట్టించింది. కివీస్ నిర్దేశించిన 133 పరుగుల స్వల్ప లక్షాన్ని టీమిండియా 17.3 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి సులువుగా ఛేదించింది. లక్ష ఛేదనలో ఓపెనర్ కెఎల్ రాహుల్ (50 బంతుల్లో 57 పరుగులు నాటౌట్) మరోసారి అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా, శ్రేయాస్ అయ్యర్ (33 బంతుల్లో 44 పరుగులు) మెరుపులు మెరిపించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం. కివీస్ బౌలర్లలో టిమ్ సౌతీ రెండు వికెట్లు పడగొట్టగా,సోధి ఒక వికెట్ సాధించాడు.

మళ్లీ విఫలమైన రోహిత్
స్వల్ప లక్ష ఛేదనలో భారత్‌కు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ(8) కివీస్‌పై తన వైఫల్యాలను కొనసాగించాడు. టిమ్ సౌతీ వేసిన తొలి ఓవర్‌లోనే రెండు బౌండరీలు బాది మంచి ఊపు మీదున్నట్లు కనిపించిన రోహిత్ అదే ఓవర్‌లో స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ మరో ఓపెనర్ రాహుల్‌తో కలిసి నిర్ణయాత్మక భాగస్వామ్యాన్ని నమోదు చేసస్తారని అందరూ భావించారు. అయితే కోహీఎక్కువ సేపు నిలవలేదు. కేవలం 11 పరుగులు చేసిన తర్వాత సౌతీ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు యత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. 39 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను రాహుల్ శ్రేయాస్ అయ్యర్ జోడీ ఆదుకుంది. జట్టును విజయపథంలో నడిపింది. మొదట్లో నుమ్మదిగా ఆడిన అయ్యర్ తర్వాత వేగాన్ని పెంచాడు.

మరో వైపు రాహుల్ తన ఫామ్‌ను కొనసాగించాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. రాహుల్‌కు ఈ సిరీస్‌లో ఇది వరసగా రెండో అర్ధ సెంచరీ కావడం గమనార్హం. మరో వైపు అయ్యర్ సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. ఇదే ఊపులో సోధి బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. 35 బంతుల్లో 44 పరుగులు చేసిన అయ్యర్ మూడు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టాడు. అయితే అప్పటికే భారత్ విజయానికి చేరువలో ఉంది. తర్వాత వచ్చిన శివమ్ దూబె(8నాటౌట్)తో కలిసి రాహుల్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు.కాగా తొలి టి20లో శ్రేయాస్ అయ్యర్ సికర్‌తో మ్యాచ్ ముగించగా, ఈ మ్యాచ్‌లో దూబే సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ముగించడం గమనార్హం.

కివీస్‌ను కట్టడి చేసిన బౌలర్లు
అంతకు ముందు కివీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు.దీంతో కివీస్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి నానా అవస్థలు పడ్డారు. అయితే టిమ్ సీఫెర్డ్ (26 బంతుల్లో 33 నాటౌట్), మార్టిన్ గఫ్తిల్(20 బంతుల్లో 33) ఓ మోస్తరుగా రాణించడంతో కివీస్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకున్న కివీస్‌కు తొలి మ్యాచ్‌లొ లాగా మంచి ఆరంభం లభించలేదు. విధ్వంసక ఆటగాడు మన్రో క్రీజ్‌లో నిలదొక్కుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. దీంతో స్కోరు వేగం మందగించింది. మరో వైపు గఫ్తిల్ ధాటిగా ఆడడానికే యత్నించాడు కానీ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కొద్ది సేపటికే మన్రో కూడా వెనుదిరిగాడు. శివమ్ దూబే బౌలింగ్‌లో కోహ్లీ పట్టిన అద్భుత క్యాచ్‌తో మన్రో( 26) భారంగా పెవిలియన్ చేరాడు.

కివీస్‌ను ఆదుకుంటాడని భావించిన సారథి కేన్ విలియమ్సన్ (14)తో పాటు గ్రాంట్ హోమ్(3)ను భారత బౌలర్లు వెంటవెంటనే పెవిలియన్‌కు పంపించారు. తొలి మ్యాచ్‌లో వీర విహారం చేసిన రాస్ టేలర్ భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు.దీంతో బౌండరీలు మాట అటుంచి పరుగులు చేయడానికే అతను ఇబ్బంది పడ్డాడు. చివరికి 24 బంతుల్లో 18 పరుగులు చేసిన టేలర్‌ను బుమ్రా ఔట్ చేశాడు. అయితే చివర్లో టిమ్ సీఫెర్డ్ తన బ్యాట్‌కు పని చెప్పడంతో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (2/18), దుబే (1/16), ఠాకూర్(1/21), బుమ్రా(1/21) రాణించారు.వీరితో పాటుగా షమీ, చాహల్‌లు వికట్లు తీయకపోయినా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పరుగుల ప్రవాహాన్ని అడ్డుకున్నారు. సిరీస్‌లో మూడో మ్యాచ్ ఈ నెల 29న సెడాన్ పార్క్‌లో జరుగుతుంది.

ఇది బౌలర్ల విజయం : కోహ్లీ
ఆక్లాండ్: కివీస్‌తో రెండో టి20లో విజయానికి తమ బౌలర్లే కారణమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఆదివారం ఇక్కడ మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానం సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ ‘ఈ రోజు అన్ని రంగాల్లో ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో మేము చక్కటి ప్రదర్శన ఇచ్చాం. బౌలర్లు ప్లాన్ ప్రకారం బౌల్ చేసి కివీస్‌ను 132 పరుగులకే కట్టడి చేశారు. ఒక విధంగా న్యూజిలాండ్‌లాంటి మంచి బ్యాటింగ్ జట్టుకు ఇది తక్కువ స్కోరే. కివీస్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంతో మా పని సులువైంది’అన్నాడు. మరో వైపు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా భారత బౌలర్లను ప్రశంసలతో ముంచెత్తాడు. ‘తొలి మ్యాచ్‌తో పోలిస్తే ఈ రోజు పిచ్ పూర్తి భిన్నంగా ఉంది. పరుగులు చేయడం కష్టంగా మారింది. అయినా మేము మరో 20 30 చేసి ఉంటే బాగుండేది. మొదట్లో రెండు వికెట్లు వెంటవెంటనే పడగొట్టి టీమిండియాపై ఒత్తిడి తెచ్చాం కానీ, చివరిదాకా అదే ఒత్తిడి కొనసాగించలేకపోయాం. టీమిండియా అన్ని విభాగాల్లోను మెరుగైన జట్టు. అయినా లోపాలను సమీక్షించుకొని రాబోయే మ్యాచ్‌లలో మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తాం’ అని విలియమ్సన్ అన్నాడు.

తొలి మ్యాచ్‌లోలా ఆడలేకపోయా : రాహుల్
ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో పరిస్థితులు తారుమారయ్యాయని టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం ఆడిన తొలి టి20 నాటి పరిస్థితులు ఈ రోజు లేవని,పిచ్ మారడంతో పాటు లక్షం కూడా మారిందన్నాడు. కివీస్‌తో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో సునాయాస విషయం సాధించిన విషయం తెలిసిందే. కెఎల్ రాహుల్, (57 పరుగులు నాటౌట్), శ్రేయాస్ అయ్యర్(44 పరుగులు) బాధ్యతాయుతం గా ఆడి జట్టుకు మరో విజయం అందించారు.

ఈ సందర్భంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన రాహుల్ మాట్లాడుతూ, తొలి మ్యాచ్‌లో ధాటిగా ఆడినట్లుగా ఈ మ్యాచ్ లో ఆడలేకపోయానని అన్నాడు.‘ పిచ్‌తో పాటుగా లక్షం కూడా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వెంటవెంటనే ఔటవడంతో నాపై బాధ్యత పెరిగింది. నేనేం చేయాలో తెలిసింది. తొలి మ్యాచ్‌లో ఆడినట్లు ఆడలేకపోయా. మరో వైపు నేను నిలకడగా రాణించడానికి కారణమేమిటో నాకు తెలియదు. ఎల్లప్పుడూ జట్టును ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఏం కావాలో దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది.ఈ రోజు చాలా మంచి షాట్లు ఆడగలిగా’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

India win Second T20 over Kiwis
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News