Thursday, April 25, 2024

ఎదురులేని టీమిండియా

- Advertisement -
- Advertisement -

India won match by 9 wickets against Australia

రాహుల్, రోహిత్ జోరు, రాణించిన బౌలర్లు, ఆస్ట్రేలియాపై భారత్ జయభేరి

దుబాయి: ప్రపంచకప్‌కు సన్నాహకంగా బుధవారం జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లోనూ టీమిండియా జయకేతనం ఎగుర వేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 17.5 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్‌ను మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. వరుసగా రెండు ప్రాక్టీస్ మ్యాచుల్లోనూ గెలిచిన టీమిండియా ప్రపంచకప్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది.

శుభారంభం..

ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు కెఎల్.రాహుల్, రోహిత్ శర్మలు మెరుగైన ఆరంభాన్ని ఇచ్చారు. రాహుల్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ దూకుడుగా ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ కూడా అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు. ఇటు రాహుల్, అటు రోహిత్‌లు కుదురుకుని ఆడడంతో భారత్‌కు మంచి ఆరంభం లభించింది. ఆరంభంలో రాహుల్ దూకుడుగా ఆడగా రోహిత్ సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ అతనికి అండగా నిలిచాడు. మరోవైపు ఆస్ట్రేలియా బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తూ భారత ఓపెనర్లపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే చాలా సేపటి వరకు వారి ప్రయత్నాలు ఫలించలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 31 బంతుల్లో మూడు భారీ సిక్సర్లు, రెండు బౌండరీలతో 39 పరుగులు చేసి ఔటయ్యాడు. అప్పటికే రోహిత్‌తో కలిసి తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించాడు.

రోహిత్ జోరు..

ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కెప్టెన్ రోహిత్ శర్మ తనపై వేసుకున్నాడు. అతనికి యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అండగా నిలిచాడు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. రోహిత్ తన మార్క్ షాట్లతో అలరించాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను భారీ షాట్లుగా మలుస్తూ స్కోరును పరిగెత్తించాడు. అతన్ని ఔట్ చేసేందుకు ఆస్ట్రేలియా బౌలర్లు చేసిన ప్రయత్నాలు వృథాగా మారాయి. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 41 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 38 పరుగులు చేసి రిటైర్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యతో కలిసి సూర్యకుమార్ జట్టును లక్షం దిశగా నడిపించాడు. ఇద్దరు ధాటిగా ఆడుతూ మరో వికెట్ కోల్పోకుండానే భారత్‌కు విజయం సాధించి పెట్టారు. అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించిన సూర్యకుమార్ 27 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 38 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. హార్దిక్ 8 బంతుల్లో ఒక సిక్సర్‌తో అజేయంగా 14 పరుగులు చేయడంతో భారత్ మరో 13 బంతులు మిగిలివుండగానే జయభేరి మోగించింది.

తీరు మారని వార్నర్..

అంతకుముందు తొఉలత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి విఫలమయ్యాడు. కిందటి మ్యాచ్‌లో సున్నాకే ఔటైన వార్నర్ ఈసారి కూడా నిరాశ పరిచాడు. ఏడు బంతులు ఆడిన వార్నర్ ఒక పరుగు మాత్రమే చేసి రవిచంద్రన్ అశ్విన్ వేసిన అద్భుత బంతికి వికెట్ల ముందు దొరికి పోయాడు. తర్వాత వచ్చిన మిఛెల్ మార్ష్‌ను కూడా అశ్విన్ ఔట్ చేశాడు. మార్ష్ ఖాతా తెరకుండానే ఔటయ్యాడు. అశ్విన్ వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి ఆస్ట్రేలియాకు కోలుకోలేని దెబ్బ తీశాడు. ఆ వెంటనే కెప్టెన్ అరోన్ ఫించ్ కూడా వెనుదిరిగాడు. ఒక ఫోర్‌తో 8 పరుగులు చేసిన ఫించ్‌ను రవీంద్ర జడేజా వెనక్కి పంపాడు. దీంతో ఆస్ట్రేలియా 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

ఆదుకున్న స్మిత్, మాక్స్‌వెల్..

ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను సీనియర్లు స్టీవ్ స్మిత్, మాక్స్‌వెల్ తమపై వేసుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చేసిన ప్రతయ్నాలు ఫలించలేదు. స్మిత్ సమన్వయంతో ఆడగా మాక్స్‌వెల్ దూకుడును ప్రదర్శించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మాక్స్‌వెల్ 28 బంతుల్లో ఐదు ఫోర్లతో 37 పరుగులు చేసి రాహుల్ చాహర్ వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చిన స్టోయినిస్ అండతో స్మిత్ స్కోరును మరింత ముందుకు తీసుకెళ్లాడు. స్టోయినిస్ ఆరంభం నుంచే చెలరేగి ఆడాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన స్మిత్ 48 బంతుల్లో ఏడు ఫోర్లతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక చెలరేగి ఆడిన స్టోయినిస్ 25 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 152 పరుగులకు చేరింది. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News