Friday, April 19, 2024

నేపాల్ కోపాలు!

- Advertisement -
- Advertisement -

Indian anti is on the rise in Nepal

 

పొరుగునున్న నేపాల్, చైనాలతో ఒకేసారి సరిహద్దు వైషమ్యాలు తలెత్తడం ఒకదానితో ఒకటి సంబంధం లేని కాకతాళీయ పరిణామమే అయినప్పటికీ ఆ రెండు దేశాలు తనకు వ్యతిరేకంగా బాహాటంగా కుమ్మక్కు అయ్యే పరిస్థితులు తలెత్తకుండా ఇండియా చాకచక్యంగా వ్యవహరించవలసి ఉంది. చైనా ఇప్పటికే పాకిస్థాన్‌తో కలిసి మనను ఇరకాటంలో పెడుతున్నది. శ్రీలంకను లోబర్చుకొని మనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నది. నేపాల్‌ను కూడా చెప్పుచేతల్లో పెట్టుకోడానికి అంది వచ్చే ఏ అవకాశాన్నీ అది వదులుకోదు. బ్రిటిష్ పాలకులు ఈ ప్రాంతాన్ని వదిలి వెడుతూ మన ఇరుగు పొరుగులతో సరిహద్దు చిక్కుముడులను మిగిల్చిపోయారు. పర్యవసానంగా చైనా, పాకిస్థాన్‌లతో యుద్ధాలు తలెత్తాయి. దీనితో నిరంతరం అప్రమత్తంగా ఉండేందుకు సైనిక వ్యయాన్ని పెంచుకుంటూ పోవలసి వస్తున్నది. న్యూఢిల్లీ కైలాస్ మానస సరోవర్ మధ్య దూరాన్ని తగ్గించిన లిపులేఖ్ రోడ్డును రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 10 రోజుల క్రితం ప్రారంభించడమే నేపాల్‌తో ఇప్పటి వివాదానికి దారి తీసింది. ఈ రోడ్డుకు ఖాట్మండూ నిరసన తెలిపింది.

తనతో సంప్రదించకుండా తన భూభాగం గుండా రోడ్డు వేసినందుకు అది అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిని తమ మధ్య వాణిజ్యానికి సులభమార్గంగా భారత, చైనాలు భావిస్తున్నాయి. లిపులేఖ్ అంతర్భాగంగా ఉన్న కాలాపానీ, తదితర ప్రాంతాలను తన భూభాగాలుగా నేపాల్ భావిస్తున్నది. ఈ ప్రాంతాలన్నింటినీ తనవిగా చూపిస్తూ నేపాల్ ఇటీవల కొత్త దేశ పటాన్ని ప్రచురించింది. గత నవంబర్‌లో భారత ప్రభుత్వం తీసుకు వచ్చిన మ్యాప్‌లో ఈ ప్రాంతాలను కలిపి చూపించడం నేపాల్‌కు కోప కారణమైంది. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని కోల్పోయిన సందర్భంలో ఇండియా తాజా పటాన్ని విడుదల చేసింది. భారత దేశం ఆక్రమణ నుంచి తన భూభాగాలను విడిపించుకోడానికి ప్రయత్నిస్తున్న ధీ, ధైర్యశాలిగా ప్రధాని కెపి శర్మ ఓలిని నేపాల్ ప్రజలు కీర్తిస్తున్నారు. నేపాల్‌లో భారత వ్యతిరేకోన్మాదం పెరుగుతున్నది. భారత నేపాల్ మధ్య ఈ విధంగా పరస్పర విశ్వాస రాహిత్యం చోటు చేసుకున్నది. 1950వ దశకం ప్రారంభంలో కాలాపానీ ప్రాంతంలో భారత సరిహద్దు సైనిక స్థావరాలు 17 ఉండేవి. నేపాల్ కోరిక మేరకు 16 స్థావరాలను ఇండియా తొలగించింది.

కాని కాలాపానీ వద్ద ఉన్నదానిని మాత్రం మూసివేయకుండా కొనసాగిస్తున్నది. 1970లో రాచరికానికి తెర దించి ప్రజాస్వామ్యం వేళ్లూనుకొన్న తర్వాత నుంచి నేపాల్ ప్రభుత్వాలు ఈ ఒక్క స్థావరాన్నీ తొలగించి ఆ ప్రాంతాన్ని తమకు అప్పగించాలని భారత్‌ను అదే పనిగా కోరుతున్నాయి. లిపులేఖ్ రోడ్డు నిర్మాణంతో భారత్‌పై నేపాలీయుల్లో భయానుమానాలు పెరిగాయి. ఇండియాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. తాజాగా లిపులేఖ్‌కు దగ్గరలో నేపాల్ సాయుధ పోలీసు దళాలు కొత్త సరిహద్దు స్థావరాన్ని నెలకొల్పాయి. చైనాతో గల సరిహద్దుల్లో నేపాల్ ఈ దళాలను కాపలా ఉంచింది. టిబెట్ శరణార్థులు నేపాల్‌లో చొరబడకుండా అవి అడ్డుకుంటున్నాయన్న కారణంతో వాటి పోషణ భారాన్ని చైనా పంచుకుంటున్నది. నేపాల్‌తో గతంలో ఎప్పుడూ ఎటువంటి సమస్య తలెత్తలేదని ఇప్పటి వివాదం వెనుక బయటి వారి హస్తం ఉండవచ్చని మన సైనిక దళాల ప్రధానాధికారి ఎంఎం నరవానే ఇటీవల వ్యాఖ్యానించినట్టు సమాచారం.

అది చైనాను ఉద్దేశించినదేనని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. నరవానే ప్రకటన నేపాల్‌లో అలజడిని సృష్టించింది. భారత చైనా నేపాల్ ముక్కోణపు జంక్షన్ గుండా లిపులేఖ్ రోడ్డు నిర్మాణానికి బీజింగ్ పాలకులు అభ్యంతరం చెప్పకపోడం పట్ల నేపాలీయుల్లో అసంతృప్తి గూడు కట్టుకొని ఉంది. ఆ విధంగా నేపాల్ ప్రజలు ఇటు ఇండియాను, అటు చైనాను కూడా వ్యతిరేకిస్తున్నారనే అభిప్రాయమూ నెలకొన్నది. నరవానే ప్రకటనతో చైనా, నేపాల్‌లు మరింత చేరువయ్యే అవకాశమున్నది. ఒకప్పుడు మనకు అనుకూలంగా ఉండిన నేపాల్ ప్రధాని ఇప్పుడు చైనా వైపు మొగ్గారు. ఇంకొక వైపు లడఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో సైనిక గస్తీ కోసం ఇండియా రోడ్డును నిర్మిస్తుండడం చైనాతో వివాదానికి దారి తీసినట్టు సమాచారం.

ఈ రోడ్డును ఆపడానికి చైనా సైన్యం ప్రయత్నించడంతో మన సేనలకు వాటికి మధ్య వైరం పరిస్థితి తలెత్తింది. రెండు వైపులా మోహరింపులు పెరిగాయి. యుద్ధంలో చైనా దురాక్రమించుకున్న ఆక్సాయ్ చిన్ ప్రాంతానికి తూర్పున ఈశాన్య లడఖ్‌లో గాల్వన్ నదీలోయ ఉన్నది. ఈ విధంగా నేపాల్, చైనాలు రెండింటితోనూ ఒకేసారి సంభవించిన సరిహద్దు వైషమ్యాలు ముదరకుండా చూడవలసిన బాధ్యత మూడు దేశాల మీద ఉంది. వాస్తవానికి నేపాల్ మన మీద ఆధారపడిన నిస్సముద్ర దేశం. అది మనల్ని ఏమీ చేయలేదు, కాని అంతర్జాతీయంగా యాగీ చేయగలదు. యుద్ధాల కంటే దౌత్యానికి, సామరస్య మార్గాల్లో పరిష్కార సాధనకే ప్రాధాన్యమివ్వడం ఆధునిక అంతర్జాతీయ సంబంధాలకు అత్యవసరం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News