Friday, April 26, 2024

కొవిడ్ వారియర్స్‌కు సైన్యం సలాం

- Advertisement -
- Advertisement -

 

Indian Army

 

నేడు గాంధీ ఆసుపత్రిపై ఐఎఎఫ్ హెలికాప్టర్లతో పూలవర్షం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కోవిడ్ వారియర్స్‌కు ఆర్మీ ప్రత్యేకంగా సలామ్ కొడుతోంది. కరోనాపై పోరాటం చేస్తున్న యోధులకు త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ పిలుపు మేరకు ఆర్మీ అధికారులు వైద్యులకు ప్రత్యేకంగా సంఘీభావం తెలుపుతున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రిగా సేవలందిస్తున్న గాంధీ ఆసుపత్రిలో పూలవర్షం కురవనుంది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఐఏఎఫ్ హెలికాప్టర్ల ద్వారా అధికారులు పూలవర్షం కురిపించనున్నారు. ప్రాణాలకు పణంగా పెట్టి పనిచేస్తున్న సిబ్బందికి అరుదైన అభినందనలు లభించనున్నాయి. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు గాంధీ ఆసుపత్రి సిబ్బంది సేవలకు గుర్తింపుగా కరోనా యోధులకు సైన్యం సలాం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ అరుదైన సంఘీభావం తెలుపుతున్న ఆర్మీ అధికారులకు యావత్ తెలంగాణ కృతజ్ఞతలు తెలుపుతోంది.

వైద్య సిబ్బందికి అరుదైన అభినందనలు..
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహామ్మారిపై వైద్యసిబ్బంది నిరంతరం పోరాడుతున్నారు. వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్నారు. దీంతో దేశం మొత్తం వైద్యసిబ్బందికి విభిన్న పద్దతుల్లో కృతజ్ఞతలు తెలుపుతుండగా, ఆర్మీ ప్రత్యేక రీతిలో సలామ్ కొట్టనుంది. ఏకంగా హెలికాప్టర్ల మీద పూలవర్షం అంటే అరుదైన సంఘటనగానే పరిగణించాలని నిపుణులు విశ్లేశిస్తున్నారు. బహుశ దేశ చరిత్రలో వైద్యులపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించడం ఇదే మొట్ట మొదటి సారి కానుందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రాణాలకు పణంగా పెట్టి పనిచేస్తున్నారు…
యావత్ ప్రపంచం మొత్తం కరోనా ఆందోళనలో ఉండగా, ఆ వైరస్ మహామ్మారి మార్చి 2వ తేదిన తెలంగాణలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలంతా కరోనా ఆందోళనతోనే ఉన్నారు. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు యావత్ దేశం మొత్తం లాక్‌డౌన్‌ను పాటిస్తూ అందరు ఇళ్లకే పరిమితం కాగా, వైద్య, పోలీస్, పురపాలక, సిబ్బందిలకు మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది. కోవిడ్ రోగులను కాపాడేందుకు ఉక్కు సంకల్పంతో అన్ని విభాగాలు ఉద్యోగులు పిడికిలి బిగించి మరి పనిచేస్తున్నారు. అత్యంత ప్రమాదం అని తెలిసినా, తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా రోగులకు సేవలందిస్తున్నారు. చిన్న వైఫల్యం నెలకొన్న ప్రాణాలు పోయిన ఆశ్చర్యపోనవసరం లేదు.కానీ రాత్రి, పగలు అని తేడా లేకుండా 24 గంటల పాటు అహర్నిశలు కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారు. కుటుంబాలు, పిల్లలకు దూరంగా ఉంటూ కోవిడ్ రోగులకు వైద్యం అందించేందుకు ఆసుపత్రుల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు.

ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ బాధితుల మాత్రమే ఉండటంతో అక్కడ సిబ్బంది మరింత ఆందోళనలతో వైద్యం అందిస్తున్నారు. ఎవరికి వారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని మరి విధులు నిర్వర్తిస్తున్నారు. వైరస్ తీవ్రతను తగ్గేందుకు వారి వైద్యసిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నివసిస్తున్న వైద్యులకు వారికి సమీపంలో నివసించే ప్రజలు నీరాజనాలు పడుతూ వైద్యసిబ్బందికి కాస్త ఊత్సాహాన్ని ఇచ్చినప్పటికీ, ఆర్మీ తీసుకున్న నిర్ణయంతో వైద్యుల్లో అంతులేని ఆనందం కనిపిస్తుంది. ఇప్పటి వరకు బిక్కపట్టుకున్న ప్రాణాభయాన్ని వదిలేసి, ప్రశాంతగా ఊపిరి పీల్చుకున్నామని కొందరు వైద్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

దేశాన్ని కాపాడే ఆర్మీ తమకు అండగా ఉండగా కోవిడ్‌తో పోరాడటం పెద్ద కష్టమేమి కాదని వైద్యసిబ్బంది ధీమాను వ్యక్తం చేయడం గమనార్హం. అయితే గాంధీ ఆసుపత్రిపై పూలవర్షం కురవనున్న క్రమంలో ఉదయం 9 గంటలకు ఆవరణలోని ప్రో జయశంకర్ విగ్రహం వద్ద డాక్టర్లు, నర్సులు, పోలీసు, మినిస్టీరియల్, పారామెడికల్, 4వ తరగతి ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ సిబ్బంది సహా అందరూ హజరుకావాలని హకీంపేట్ ఇండియన్ ఎయిర్‌ఫోర్సు అధికారులు కోరారు. ఎయిర్ ఫోర్సు అందించే ప్రశంసలను అందుకోవాలని గాంధీ సూపరింటెండెంట్ సిబ్బందికి విజ్ఞప్తి చేశారు.

హర్షం వ్యక్తం చేసిన మెడికల్ జెఎసి….
కోవిడ్ పై పోరాడుతున్న సిబ్బందికి ఆర్మీ ప్రత్యేకంగా సలామ్ చెబుతున్న నేపథ్యంలో తెలంగాణ మెడికల్ జేఎసి హర్షం వ్యక్తం చేసింది. ప్రాణాలకు తెగించి వైద్యం అందిజేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులకు మద్దుతుగా మనోధైర్యం ఇవ్వడానికి భారత ఆర్మీ చేపట్టదలచిన కార్యక్రమం ఆరోగ్యశాఖ ఉద్యోగులకు ఎంతో మనో ధైర్యాన్ని కల్పిస్తుందని జేఏసి కన్వీనర్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు.

Indian Army to shower flowers on Covid Hospitals

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News