Home ఎడిటోరియల్ పతనావస్థలో కార్ల పరిశ్రమ

పతనావస్థలో కార్ల పరిశ్రమ

sampadakiyam

 

కారులో షికారు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిన తర్వాత మారుతీ సుజుకి ఇండియా అమ్మకాలు గత జులై నెలలోనే 33.5 శాతం పడిపోయి 1,09,264 కార్లకు తగ్గిపోయాయి. అదే నెలలో హుండై మోటారు ఇండియా విక్రయాలు 3.8 శాతం పడిపోయాయి. 53,310 యూనిట్లకు అమ్మకాలు దిగజారిపోయాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ ద్విచక్ర వాహనాల విక్రయాలు 22 శాతం పడిపోయి 54,185 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ పతన వేగం నెల నెలా మరింత పెరుగుతుండడంతో పరిశ్రమలో ఉద్యోగాలు సైతం అంతరించిపోతున్నాయి. మారుతీ సుజుకి అమ్మకాలు వరుసగా 6 మాసాలుగా పతనావస్థను చవిచూస్తున్నాయి. ద్వి చక్ర వాహనాల మార్కెట్ కూడా అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. టివిఎస్ మోటారు కంపెనీ అమ్మకాలు జులైలో 13 శాతం పతనాన్ని చవిచూశాయి. హీరో మోటారు కంపెనీ విక్రయాలు 21.18 శాతం పడిపోగా, హోండా మోటారు సైకిల్, స్కూటర్ ఇండియా 10.77 శాతం అధోగతిని అనుభవించింది. దేశంలో అతి పెద్ద ప్రైవేటు రంగ మౌలిక సదుపాయాల ఆర్థిక సహాయ సంస్థ అయిన ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్) దెబ్బతిని పోవడంతో ఎదురయిన గడ్డు పరిస్థితి కూడా కార్ల కొనుగోలుపై వ్యతిరేక ప్రభావాన్ని చూపింది. తొలకరి వానలు భారీగా కురిసి వరదలు జల విలయాన్ని సృష్టించడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిద్రమయిపోయింది. దీనితో గ్రామీణ వినియోగదారుల్లో నిరుత్సాహం చోటు చేసుకుని కార్లు, ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు పతనమయ్యాయి. అలాగే కార్లపై పెరిగిన జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను), దిగుమతి సుంకాల భారం మూలిగే నక్క మీద పడిన తాటి పండు చందమయింది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల అగ్గికి ఆజ్యమయింది. ఎన్‌డిఎ ప్రభుత్వం విదేశీ కార్లపై దిగుమతి సుంకాలు పెంచివేయడమూ వాటి ధరల విజృంభణకు దోహదపడింది. 201819 ఆర్థిక సంవత్సరంలో అన్ని వాహనాల అమ్మకాలు 8 శాతం పడిపోయాయి. పర్యవసానంగా దేశ వ్యాప్తంగా 300 డీలర్ షిప్పులు మూతపడ్డాయి. అక్కడ కాంట్రాక్టు ఉద్యోగులే అధికంగా ఉంటారు కాబట్టి వారి ఉద్యోగాలు చీమ చిటుక్కు మంటే ఊడిపోయే దుస్థితిలో ఉండడం సహజం. ఈ ఏడాది జనవరి జూన్ మధ్య కాలంలో మారుతీ సుజుకి ఇండియాలో తాత్కాలిక ఉద్యోగాలు 6 శాతం తగ్గిపోయాయి. ఇప్పటికే లక్ష ఉద్యోగాలు కోల్పోయిన కార్ల కంపెనీల్లో ఇక ముందు కూడా ఇదే దుస్థితి కొనసాగితే వచ్చే రెండు మూడు మాసాల్లో ఈ సంఖ్య పది లక్షలకు చేరుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే స్థాయిలో డీలర్ షిప్పుల మూసివేత, ఉద్యోగాల కోత కలవరపరుస్తున్నది. దేశంలో మొత్తం కార్ల అమ్మకాల్లో కేవలం 1.3 శాతం మేరకే జరుగుతున్న లగ్జరీ కార్ల విక్రయాలు జిఎస్‌టిని తగ్గిస్తే మెర్సెడెజ్ బెంజ్ వంటి ఆ తరహా కార్ల అమ్మకాలు పుంజుకునే అవకాశాలున్నాయి. అమిత ఆదాయాన్ని ఆశించి జిఎస్‌టి రేట్లు పెంచినందువల్ల ఆశించినంత ప్రయోజనం సిద్ధించకపోగా వ్యతిరేక ప్రభావం కనపర్చడం గమనార్హం. పన్ను రేట్ల పెంపు సహేతుకంగా లేకపోడం వల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థే అతలాకుతలమవుతుంది. దిగుమతి సుంకాల పెంపు కూడా విడిభాగాల ధరలను పెంచి కార్ల కంపెనీలను దివాలా దిశకు మళ్లిస్తుంది. మామూలు, లగ్జరీ కార్ల విక్రయాలను నిరుత్సాహపరిచే నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎలెక్ట్రిక్ కార్లను ప్రోత్సహించడానికి మొన్నటి బడ్జెట్‌లో వాటిపై భారీ రాయితీలు ప్రకటించింది. అయితే కొత్తగా రంగ ప్రవేశం చేస్తున్న ఎలెక్ట్రిక్ కార్ల విక్రయాలు అనేక కారణాల రీత్యా కోరుకున్న స్థాయిలో ఊపందుకోలేదు. పర్యవసానంగా ఆ రాయితీలు వృథా అయిపోయే పరిస్థితి తల ఎత్తింది. ఎలెక్ట్రిక్ వాహనాలపై వస్తు, సేవల పన్నును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ మొన్నటి కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న నిర్ణయం ఆచరణలో వాటి అమ్మకాలను పెంచబోదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు బదులుగా అన్ని రకాల కార్లపై జిఎస్‌టిని తగ్గించడం వల్ల ఆ పరిశ్రమ ఎదుర్కొంటున్న మాంద్యం తొలగుతుందని భావిస్తున్నారు. ఇప్పుడున్న 28 శాతం జిఎస్‌టిని 18 శాతానికి తగ్గించాలని కోరుతున్నారు. ఎలెక్ట్రిక్ వాహనాలపై ఇచ్చిన రాయితీల వల్ల వాటి ధర కొంత తగ్గినా అది కొనుగోలు దారులకు అప్పటికీ అందుబాటులోకి రాదని హెచ్చరిస్తున్నారు. పెట్రోలు, డీజిల్‌పై ఆధారపడడాన్ని తగ్గించడం కోసం తీసుకునే ఇటువంటి చర్యలు సద్యః ఫలితాలను ఇవ్వకపోగా కార్ల పరిశ్రమ కోలుకునేలా చేయలేకపోడం ఎంత మాత్రం హర్షించదగినది కాదు. అందుచేత కార్ల పరిశ్రమపై నూతన వ్యూహాన్ని అవలంబించవలసి ఉన్నది.

Indian auto Industry in Loss