Saturday, April 20, 2024

కశ్మీర్, మణిపూర్‌లపై మౌన‘మో’!

- Advertisement -
- Advertisement -

దేశం సురక్షితమైన చేతుల్లో ఉందన్నారు. పెద్దనోట్ల రద్దు, ఆర్టికల్ 370 ఎత్తివేత, జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంతో ఉగ్రవాదుల వెన్నువిరిచినట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పెద్దన్న అమెరికాతో ఒప్పందం చేసుకొని కీలక సమాచారాన్ని మార్పిడి చేసుకొనేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆర్భాటం చేశా రు. నిజమే కామోసనుకొని జనం సంతోషించారు. కేంద్ర ప్రత్యక్ష పాలనలో ఉన్న కశ్మీరులో గత పక్షం రోజుల్లోనే పది మంది సైనికుల ప్రాణాలు తీశారు ఉగ్రవాదులు. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా మిలిటరీ గ్రామాలను నిర్మిస్తోందంటూ అమెరికా ఇచ్చిన సమాచారంతో మీడియా పెద్ద ఎత్తున వార్తలు ఇచ్చింది. ఇప్పుడు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల గురించి ఎలాంటి సమాచారమూ ఇచ్చినట్లు వార్తలు లేవు. మరో రాష్ర్టం మణిపూర్. ఇక్కడ బిజెపి పాలన ఉంది. ఇది రాసిన సమయానికి అక్కడ ఇటీవల జరిగిన హింసాకాండలో 55 మంది మరణించినట్లు వార్తలు. వారెలా మరణించిందీ తెలియదు. రాష్ర్టమంతటా ఇంటర్నెట్ బంద్, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇచ్చి ఆర్టికల్ 355ను ప్రకటించి కేంద్ర బలగాలకు అప్పగించారు.శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైనా రాష్ర్టపతి పాలన పెట్టలేదు, స్వంత పార్టీ కదా!
చిత్రం ఏమిటంటే కర్ణాటక ఎన్నికల్లో ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇంత జరుగుతున్నా ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలేదు. విలేకర్లతో మాట్లాడేందుకు ఎలాగూ ముందుకు రారు, కనీసం ఒక ప్రకటన లేదా బహిరంగ సభల్లో మాట్లాడితే నోటిముత్యాలు రాలుతాయన్నట్లు ఉన్నారు. కల్పిత కట్టుకథలతో కేరళ సమాజాన్ని అవమానపరిచేందుకు తీసిన కేరళ స్టోరీ సినిమా గురించి మాట్లాడతారు, ప్రతిపక్షాలు ఉగ్రవాదులతో చేతులు కలిపినట్లు, మద్దతు ఇచ్చినట్లు రాళ్లు వేసేందుకు తీరిక దొరుకుతుంది గానీ కశ్మీర్, మణిపూర్ గురించి ప్రస్తావించలేదు. ఢిల్లీలో రెజ్లర్ల మీద పోలీసు జులం గురించి మాట్లాడరు. స్వంత పార్టీ ఎంపి మీద పోక్సో కేసు పెట్టినా అరెస్టు లేదు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రధాని 30 ట్వీట్లు పెట్టారు వాటిలో సగం కాంగ్రెస్, జెడి(ఎస్) మీద దాడికి దిగారు. మణిపూర్, కశ్మీరు, రెజ్లర్ల ఉదంతాలపై ట్వీట్ల ద్వారా కూడా స్పందించలేదు. జై భజరంగ బలీ అంటూ మతం పేరుతో ఓట్లడిగేందుకు నోరు వచ్చిందన్న విమర్శలువచ్చినా సరే పదేపదే ప్రస్తావించారు. అడిగేవారెవరు, నిబంధనలను అమలు జరిపేదెవరు? ప్రపంచ నేతగా, విశ్వగురువుగా భక్తుల నుంచి నీరాజనాలు అందుకుంటున్న నరేంద్ర మోడీ కశ్మీరు, మణిపూర్‌లో జరుగుతున్న ఉదంతాలు అల్పమైనవని, వాటి మీద స్పందించటం తన స్థాయికి తగదని మౌన ముద్ర దాలుస్తున్నారా?
మణిపూర్ అగ్నిగుండంగా మారేందుకు హైకోర్టు ఇచ్చిన సలహా కారణమైంది. న్యాయమూర్తుల సలహాలు చిచ్చురేపేవిగా ఉండకూడదు, వాటి పర్యవసానాలను కూడా గమనంలో ఉంచుకోవాలి. రాష్ర్ట జనాభాలో 53 శాతంగా ఉన్న మెయితీ సామాజిక తరగతికి చెందిన వారు తమను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలని చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. అది వీలవుతుందో కాదో చట్టబద్ధమో కాదో స్పష్టంగా చెప్పాల్సిన కోర్టు వారి కోర్కెను పరిశీలించాలని ఏప్రిల్ 20వ తేదీన రాష్ర్ట ప్రభుత్వానికి సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దాన్ని గనుక అమలు జరిపితే గిరిజనులుగా ఉన్న కుకీలు, నాగాలు తమ భూములు కోల్పోతామని భయపడ్డారు. అక్కడి బిజెపి ప్రభుత్వం వారి అనుమానాలను తీర్చేందుకు పూనుకోలేదు. ఏప్రిల్ 28వ తేదీన సిఎం బిరేన్ సింగ్ చురుచందపూర్ అనే చోట ఒక జివ్‌ును ప్రారంభించేందుకు రానుండగా ముందు రోజు నిరసనకారులు దాన్ని తగులబెట్టారు.గిరిజన, గిరిజనేతర ప్రాంతాలన్నింటా కనిపిస్తే కాల్చివేత ప్రకటించి ప్రభుత్వం మరింత రెచ్చగొట్టింది. గిరిజన విద్యార్ధి సంఘం మే మూడవ తేదీన చురుచందపూర్‌లో గిరిజన సంఘీభావ ప్రదర్శనకు పిలుపునిచ్చింది. ఆ సందర్భంగా హింసాకాండ చెలరేగింది. గిరిజనేతర ప్రాంతాల్లోని గిరిజనుల మీద, చర్చ్‌ల మీద దాడులు జరిపారు.

అప్పటి నుంచి రాష్ర్టం అగ్నిగుండంగా మారింది.మణిపూర్ భూ సంస్కరణల చట్టం ప్రకారం గిరిజనులు నివసించే కొండ ప్రాంతాల్లో గిరిజనేతరులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకొనేందుకు, భూములు కొనేందుకు వీల్లేదు. గిరిజనేతరులు ఇంఫాల్ లోయ ప్రాంతానికే పరిమితం కావాలి. అక్కడ రాష్ర్టంలోని భూమిలో పది శాతమే ఉంది. గిరిజనులు ఎక్కడైనా స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. గిరిజనేతరుల్లో ఎక్కువ మంది హిందువులు, గిరిజనులంతా క్రైస్తవులు. అసెంబ్లీలోని 60 స్థానాలకు గాను 40 చోట్ల మెయితీలే గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు. వారి మద్దతు కోసమే రాష్ట్రాన్ని బిజెపి అగ్నిగుండంగా మార్చిందా? విస్తారమైన భూమిని ఏదో ఒక పద్ధతిలో స్వంతం చేసుకోవాలని ఈ సామాజిక తరగతి చూస్తున్నదనే ఆరోపణ ఉంది. అందుకు గాను అక్రమంగా పక్కనే ఉన్న మయన్మార్ నుంచి అక్రమంగా గిరిజనుల వలసలను ప్రోత్సహిస్తున్నట్లు ఆ తరగతి ఆరోపిస్తోంది. అక్రమ వలసలన్నది ఒక సాకు మాత్రమే అని గిరిజనులు అంటున్నారు. వాస్తవాలను వివరించి రెండు సామాజిక తరగతుల్లో ఉన్న అనుమానాలు, అపోహలను తొలగించటంలో గతంలో ఉన్న ప్రభుత్వాలతోపాటు వర్తమాన బిజెపి కూడా విఫలమైంది, మతం పేరుతో ఓటు బాంకు ఏర్పాటుకు పూనుకుంది.

తాజా పరిణామాలలో మణిపూర్‌లో తిరిగి ఉగ్రవాదం తలెత్తితే బిజెపిదే బాధ్యత అవుతుంది. కశ్మీరులో నిజంగా ఉగ్రవాదులను, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించారా? అంకెలు చెబుతున్న వాస్తవాలేమిటి? బిజెపి చేసుకుంటున్న ప్రచారంలో నిజమెంత? ఇక్కడ ఉగ్రవాదాన్ని ఐదు దశలుగా విభజించాలి. ఎప్పుడు ఎవరి పాలనలో ఏం జరిగిందో దక్షిణాసియా టెర్రరిజం పోర్టల్ వివరాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. 1988 నుంచి 1997 వరకు కాంగ్రెస్ పాలన. 1998 నుంచి 2003 వరకు ఎన్‌డిఎ వాజ్‌పాయి ఏలుబడి, 2004 నుంచి 2013 వరకు తిరిగి కాంగ్రెస్ పాలన. 2014 నుంచి ఇప్పటి వరకు నరేంద్ర మోడీ అధికారం. 2019 ఆగస్టు నుంచి కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. ఈ కాలంలో మరణించిన పౌరులు, భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులు, చొరబాటుదార్ల సంఖ్యలు. బ్రాకెట్లలో ఉన్నవి వార్షిక సగటుగా గమనించాలి.
పైన పేర్కొన్న అంకెలను చూసినపుడు కశ్మీరులో ఆర్టికల్ 370 రద్దు, కొత్తగా భద్రతా దళాలకు అధికారం ఇచ్చినట్లు ప్రచారం చేసుకున్న కాలంలో జరిగిన పరిణామాలను చూసినపుడు అంత కు ముందు జరిగిన వాటితో కుడి ఎడమలుగా ఉన్నాయి తప్ప ఉగ్రవాదం పూర్తిగా నిర్మూలన కాలేదు. వాజ్‌పాయి పాలనతో పోల్చినపుడు అదే కశ్మీరులో ఆర్టికల్ 370 ఉండగా కూడా కాంగ్రెస్ ఏలుబడిలో ఉగ్రవాదం తగ్గినట్లు అంకెలు చెబుతున్నాయి. పలు కారణాలతో ఉదంతాలు తగ్గినపుడు తమ ఘనతగాను లేనపుడు పాక్ కుట్రగానూ వర్ణిస్తే కుదురుతుందా? తగ్గినపుడు పాక్ దూరంగా ఉందని చెబుతారా?
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో గోవాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ) సమావేశానికి హాజరైనపుడే ఉగ్రవాదులు మన పారా ఎస్‌ఎఫ్ (స్పెషల్ ఫోర్సెస్) దళానికి చెందిన ఐదుగురు కమాండోలను చంపారు. అదే జమ్మూ ప్రాంతంలో ఏప్రిల్ 20న ఐదుగురు సైనికులను చంపారు. తాజా ఉదంతాలను చూసినపుడు ఉగ్రవాదులు కశ్మీరు నుంచి జమ్మూకు తమ కుట్రలను విస్తరింపచేసినట్లు కనిపిస్తోంది. చిన్న బృందాలుగా దాడులు చేసేందుకు శిక్షణ పొందినట్లు కూడా చెబుతున్నారు. అది పాకిస్తాన్‌లో తప్ప మన గడ్డ మీద సాధ్యం కాదు. వీటి గురించి మనకు అమెరికా ఎందుకు సమాచారం అందించటం లేదు అన్నది ప్రశ్న.
పూంచ్‌లో ఏప్రిల్ 20న జరిపిన దాడిలో ఉపయోగించిన ఆయుధాలు, పేలుడు పదార్ధాలు అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా మిలిటరీ వదలి వెళ్లినవని గుర్తించారు. వాటిని అక్కడి తాలిబాన్లు మనదేశంలోని ఉగ్రవాదులకు అందిస్తే తప్ప దొరికేవి కాదు. మరోవైపున ఉగ్రవాదులు స్థానికంగా, విదేశాల నుంచి నిధులు సేకరిస్తున్న ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ జరిపిన సోదాల్లో దొరికిన సమాచారం వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దుకు ఉగ్రవాదులకు నిధులు దొరక్కుండా చేయటం ఒకటని చెప్పారు. మరి ఇప్పుడు దీనికి ఏ సాకు చెబుతారు? పాత నోట్లు రద్దు చేసి కొత్తగా రెండు వేల నోట్లు ముద్రించి మరింత పెద్ద మొత్తాలను సులభంగా అందచేసేందుకు అదే మోడీ సర్కార్ వీలు కల్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News