Home తాజా వార్తలు ఏడాదిలో ఎంత మార్పు?

ఏడాదిలో ఎంత మార్పు?

Indian-Economy

సమున్నత శిఖరాలనుంచి పాతాళానికి ఆర్థిక వ్యవస్థ
కుదేలవుతున్న ఫైనాన్షియల్ రంగం
అయిదు సార్లు వడ్డీ రేట్లు తగ్గించినా కోలుకోని కీలక రంగాలు
కఠిన నిర్ణయాలు తీసుకోలేని ఆర్‌బిఐ

2019 సంవత్సరంలోకి అడుగు పెట్టే సమయానికి భారత ఆర్థిక వ్యవస్థ అప్రతిహతంగా దూసుకు వెళ్తూ ఉండింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి బైటపడి మళ్లీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ఆసియా ఖండంలోనే చైనా తర్వాత బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. మోడీ ప్రభుత్వం తీసుకున్న పలు ఆర్థిక సంస్కర ణల కారణంగా ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఎన్నో స్థానాలు అధిగమించి విదేశీ పెట్టుబడులకు కేంద్రంగా నిలిచింది. అయితే 2019 చివరినాటికి ఇదం తా ఆవిరై పోయింది. దేశ ఆర్థి వ్యవస్థ అన్ని రంగాల్లోను మసకబారింది. ఆర్థిక  మందగమనం కారణంగా  పెట్టుబడిదారులతో పాటుగా 140 కోట్ల దేశ ప్రజల విశ్వసనీయత సైతం కొరవడి అన్ని రంగాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి.

మన తెలంగాణ బిసినెస్ డెస్క్ : అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్న ఓ అగ్ర రాజ్యం ఇంత తక్కువ సమయంలో ఈ స్థితికి రావడం అనేది చాలా అరుదు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో దేశ స్థూల ఉత్పాదకత (జిడిపి)4.5 శాతానికి చేరుకుంది. 2018 సంవత్సరం మధ్య కాలంలో జిడిపితో పోలిస్తే ఇది సగం మాత్రమే. అలాగే 2014 తర్వాత వినియోగదారుల విశసనీయత స్థాయి ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయింది. దేశాభివృద్ధికి కీలక గీటు రాయి అయిన ఉద్యోగాల మార్కెట్ దిగజారిపోయింది. నిరుద్యోగిత గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయి(6.1 శాతం)కి చేరుకుంది. ఇదీ

ఇప్పటి దేశ ఆర్థిక పరిస్థితి.

ఏడాది క్రితం మన దేశం ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండింది. చైనా, అమెరికాల సరసన ప్రపంచ వాణిజ్యంలో భారత్ తన వంతు వాటాను దక్కించుకోవడానికి పరుగులు పెడుతోందని గత పదేళ్ల కాలంలో దేశం సాధించిన ప్రగతిని చూసి విశ్లేషకులు అంచనాలు వేస్తూ వచ్చారు. అయితే గత త్రైమాసికంలో ఫిలిప్పీన్స్, మలేసియాలు మన దేశంకన్నా వేగంగా అభివృద్ధి చెందగా, మలేసియాకు, మనకు ఉన్న అంతరం వెంట్రుక వాసి మాత్రమే. మరో వైపు మన లాగానే ఆర్థిక మందగమనంతో సతమతమవుతున్న చైనా దానినుంచి బయట పడి గౌరవప్రదమైన ఆరు శాతం వృద్ధి రేటు సాధించగా,7.3 శాతం వృద్ధి రేటుతో వియత్నాం మనకన్నా ఎంతో ముందుంది.

ఛిన్నాభిన్నమైన ఫైనాన్షియల్ రంగం

దీనికంతటికీ దేశ ఫైనాన్షియల్ రంగం ఛిన్నాభిన్నం కావడమే ప్రధాన కారణం. దేశంలోని ప్రధాన బ్యాంకులన్నీ మోయలేనంత మొండి బకాయిల భారంతో సతమతమవుతున్నాయి. ప్రపంచంలోనే బ్యాంకుల ఎన్‌పిఎలు మన దేశంలోనే అత్యధికం. సంప్రదాయ బ్యాంకులు షాడో బ్యాంకులకు ఉదారంగా రుణాలు అందించాయి. ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు కూడా సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఈ సంస్థల్లో ప్రధానమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(ఐఎల్‌ఎఫ్‌ఎస్) దివాలా తీసింది. దీంతో మార్కెట్‌లో లిక్విడిటీ సంక్షోభం నెలకొంది. జరిగిన నష్టాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈ కంపెనీ అజమాయిషీని తన చేతుల్లోకి తీసుకున్నప్పటికీ వారు చేపట్టిన ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.మరో వైపు రిజర్వ్ బ్యాంక్ దేశంలో మార్టిగేజ్ రుణ దాతల్లో ప్రధానమైన దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజ్‌మెంట్‌ను తొలగించి దాన్ని దివాలా కోర్టుకు పంపించింది.

దీంతో రుణ దాతలు ఇలాంటి సంస్థల్లో తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకున్నాయి. అన్నిటికన్నా మించి రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాదితో అయిదు సార్లు వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదు. ఆర్థిక వృద్ధి మందగమన ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం పలు ఉద్దీపన ప్యాకేజిలు ప్రకటించినప్పటికీ, వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ వీటి ప్రయోజనాలు మాత్రం అసలు వ్యవస్థలోకి అందుబాటులోకి రాలేదు. సాధారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో కేంద్ర బ్యాంకు లు ఆర్థిక వ్యవస్థపై పట్టు బిగించి ఉంటాయి.

అయితే ఆశ్చర్యకరంగా మన రిజర్వ్ ఈ ఏడాదిలో పలుసార్లు వడ్డీ రేట్లను తగ్గించి ఇన్వెస్టర్లను ఆశ్చర్యంలో పడేసింది. సాధారణంగా ఆర్‌బిఐ వడ్డీ రేట్లలో పావు శాతం కోత విధించడం పరిపాటి. అయితే గత ఆగస్టులో రిజర్వ్ బ్యాంక్ 35 బేసిస్ పాయింట్లు తగ్గించడం తెలివైన పనని చెప్పడం కన్నా పరిస్థితి తీవ్రతకు అద్ద పడుతోందని విశ్లేషకులు అంటున్నారు. కాగా డిసెంబర్‌లో కూడా వడ్డీ రేట్లను తగ్గించడం దాదాపు ఖాయంగా కనిపించినప్పటికీ అధికారులు చివరి క్షణంలో ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఇది ఓ పెద్ద తప్పని నిపుణుల అభిప్రాయం.

గణాంకాల తప్పిదం

ఇక మూలిగే నక్కపై తాటిపండు చందంగా గత కొన్ని సంవత్సరాలుగా వాస్తవంగా వృద్ధి రేటు ఈ ఏడాది మూడో త్రైమాసికపు వృద్ధి రేటు అయిన 4.5 శాతం దరిదాపుల్లోనే ఉందంటూ ప్రధాని నరేంద్ర మోడీ మాజీ ఆర్థిక సలహాదారు విడుదల చేసిన పత్రంలో పేర్కొనడం ఆర్థిక రంగంపై మరింత ప్రభావం చూపించింది. దేశ ఆర్థిక వృద్ధి మందగతిలో ఉన్న సమయంలో ఇలాంటి కఠోర వాస్తవాలు ఎంతగా దేశ ఆర్థిక రంగంపై ఎంతగా ప్రభావం చూపిస్తాయో అందరికీ తెలిసిందే.

చైనాతో పోలిక

గతంలో చాలా మంది మన ఆర్థిక వ్యవస్థను చాలా మంది చైనాతో పోల్చి చూసే వారు. పటిష్ఠమైన ఫెడరల్ వ్యవస్థ , స్వతంత్ర న్యాయవ్యవస్థ కలిగిన అతి పెద్ద ప్రజాస్వామిక దేశం మనది అని, చైనాతో మన దేశానికి పోలికే లేదని భారత దేశ ఆర్థిక విధానాలను సమర్థించే వారు గతంలో వాదించే వారు. అయితే అధ్యక్షుడు డెంగ్ జియావో పింగ్ చైనాపై బలవంతంగా రుద్దిన ఆర్థిక సంస్కరణలు లాంటివి మన దేశంలో అమలు చేయడం దాదాపు అసాధ్యమేనని చెప్పాలి. అంత కఠినమైన నిర్ణయాలను తీసుకోగలిగినందునే అది అగ్ర రాజ్యమైన అమెరికాను, అదీ ట్రంప్‌లాంటి నేతను అది ఢీకొని నిలబడగలిగింది. పరిస్థితి బాగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్న నేతలు చైనాతో మనకు పోలికే అనవసరమని వాదిస్తూ వచ్చారు కానీ, ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు.

ఆశాకిరణం

అయితే ఈ మందగమనంతో భారత్ పని అయి పోయిందని అనడానికి వీల్లేదు. గతంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు సైతం మన దేశం ఆ సంక్షోభంనుంచి బయటపడి బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఆసియాలోని చాలా దేశాలు ఇలాంటి సంక్షోభాన్నే ఎదుర్కొంటున్నాయి. అయితే ఇండోనేసియా, థాయిలాండ్, మలేసియా, దక్షిణ కొరియా లాంటి దేశాలు కూడా ఇలాంటి మంద గమనం తర్వాత మరింత బలంగా తయారయ్యాయి.

అయితే కేంద్ర బ్యాంకులు స్వయంప్రతిపత్తితో వ్యవహరించినప్పుడు అధికారులు దిద్దుబాటు చర్యలు తీసుకుని ఆర్థిక వ్యవస్థలను కాపాడగలిగారు. సంక్షోభ సమయంలో వృద్ధి రేటు మందగించినా దాన్ని తట్టుకునే విధంగా ఆర్థిక వ్యవస్థలను తీర్చి దిద్దగలిగారు. మరి అలాంటి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ మన ఆర్‌బిఐకి ఉందా? అనేది ప్రశ్న. అలా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రమే దేశం ఈ సంక్షోభంనుంచి బైటపడగలుగుతుంది. పాలకులు ఆర్‌బిఐ స్వయంప్రతిపత్తిని మరింత బలోపేతం చేయడంపై దృష్టిపెడితే బాగుంటుంది. లేకపోతే ఎన్ని ఉద్దీపన ప్యాకేజిలు ప్రకటించినా ఫలితం ఉండదు. కనీసం కొత్త సంవత్సరంలోనైనా ఈ దిశగా అడుగులు వేస్తారని ఆశిద్దాం.

Indian Economy Came Back Down to Earth