Friday, April 19, 2024

ఆర్థిక వ్యవస్థ ఎటుపోతోంది?

- Advertisement -
- Advertisement -

Indian economy contracts 23.9% due to Corona impact

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థలలో ఒక్కటిగా చెప్పుకొనే భారత ఆర్ధిక వ్యవస్థ పర్యవేక్షణకు అనేక భారీ సంస్థలు ఉన్నాయి. ఒక వంక ఆర్ధిక మంత్రిత్వ శాఖ, అందులో ఎందరో సలహాదారులు, మరో వంక రిజర్వు బ్యాంకు, నీతి ఆయోగ్ ఉన్నాయి. అయితే ఈ వ్యవస్థలు అసలు ఎటువైపు పోతుంది? అంటే సమాధానం చెప్పే పరిస్థితులలో లేము. గత వారం రెండు అంశాలు ఈ సందర్భంగా దేశంలో నెలకొన్న దారుణమైన ఆర్ధిక వైరుధ్యాలను వెల్లడి చేస్తున్నాయి. ఒక వంక దేశంలో అత్యున్నత సంపన్నుడైన ముకేశ్ అంబానీ ఆస్తులు గత ఏప్రిల్ నుండి 35 శాతం పెరిగాయి. మరో వంక దేశ జిడిపి చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువగా – 23.9 శాతం నమోదయింది.

ఇదే సమయంలో దేశంలో ప్రైవేట్ రంగంలో గల అతిపెద్ద ముంబై విమానాశ్రయాన్ని గౌతమ్ అంబానీ ఏ విధంగా నిస్సిగ్గుగా కైవసం చేసుకున్నారో మొత్తం ప్రపంచం చూసింది. ముకేశ్ అంబానీ ఆస్తులు బహుశా ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా పెరుగుతూ ఉన్నప్పటికీ కరోనా సాకు చూపుతూ ఆయన తన ఉద్యోగులకు మాత్రం పూర్తిగా జీతాలు చెల్లించడం లేదు. ఈ వైరుధ్యాలు ఏమిటి? దారుణంగా ఉపాధి అవకాశాలు సన్నగిల్లి పోతున్నాయి. ప్రజల వద్ద డబ్బు చెలామణిలో ఉండడం లేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ‘ఆత్మా నిర్భయ్ భారత్’ అంటూ ఎంతో ఘనంగా కరోనాతో అతలాకుతలమైన ఆర్ధిక వ్యవస్థను ఆదుకోవడానికి రూ. 20 లక్షల కోట్ల పథకం ప్రకటించారు. అయితే ఈ పథకం ప్రజలను ఆదుకోలేక పోతున్నది. చిన్న పరిశ్రమలు, వ్యాపారులు, చివరకు వీధి వ్యాపారులకు సహితం ఉదారంగా రుణాలు ఇవ్వమని ప్రభుత్వం బ్యాంకులు, ఆర్ధిక సంస్థలను ప్రోత్సహిస్తున్నది. బ్యాంకులు సహితం రుణాలు ఇవ్వడానికి నిధులతో సిద్ధంగా ఉన్నాయి. కానీ రుణాలు తీసుకొనే వారే కనబడటక పోవడం పరిస్థితుల తీవ్రతను వెల్లడి చేస్తున్నది.

కరోనా మహమ్మారి పేరుతో పరిశ్రమలు తమ ఉద్యోగుల జీత, భత్యాలలో పెద్ద ఎత్తున కోత పెడుతున్నాయి. చాలా మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అందుకు ఎటువంటి పారదర్శక విధానాన్ని అనుసరించడం లేదు. ఉద్యోగులకు రక్షణగా నిలబడవలసి చట్టాలు గాని, ప్రభుత్వ వ్యవస్థలు గాని అక్కరకు రావడం లేదు. మనం చాలా విషయాలలో పొరుగున ఉన్న పాకిస్థాన్ తో పోల్చుకుంటాము. కరోనాకు సంబంధించి ఆ దేశంలో పరిస్థితులు కూడా భారత్ కన్నా భిన్నమైనవి కావు. అయితే ఆ దేశంలో కరోనాను చాలా ముందుగానే అదుపులోకి తెచ్చుకో గలిగారు. వారి ఆర్ధిక పరిస్థితి సహితం భారత్ అంత దారుణంగా దెబ్బ తినలేదు.

పాకిస్థాన్‌లో సుస్థిర ప్రభుత్వం లేదు. సైన్యం అదుపాజ్ఞలలో పనిచేసే ప్రభుత్వం ఉంది. లాక్ డౌన్ అమలు జరపడం వారికి కష్టం కాదు. అయితే లాక్ డౌన్ లేకుండానే వారు కరోనాను అదుపులోకి తెచ్చుకోగలిగారు. ప్రపంచంలోనే మరెక్కడాలేనంత కఠినంగా, ప్రజలకు కనీసం సర్దుబాటు చేసుకొనే వ్యవధి కూడా ఇవ్వకుండా నాలుగు గంటల వ్యవధిలో లాక్ డౌన్‌ను దీర్ఘకాలం మన దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం అమలు జరిపింది. అయినా కరోనా మహమ్మారి నుండి ప్రజలకు చెప్పుకోదగిన ఉపశమనం కలిగించలేక పోయింది. ఆగస్టు లోనే 20 లక్షల మందికి పైగా ఈ మహమ్మారికి గురికావడం పరిస్థితి తీవ్రతను వెల్లడి చేస్తున్నది.

మన ఆర్ధిక వ్యవస్థ కరోనాకన్నా ముందు సంవత్సరకాలం నుండే తిరోగమనంలో పడుతూ వస్తున్నది. దానిని కట్టడి చేయగల నైపుణ్యంగానీ, ఆలోచనలు గాని ప్రభుత్వంలో ఆర్ధిక వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న వారిలో లేకపోవడమే నేటి దారుణ పరిస్థితులకు కారణమని భావించాలి. ప్రధాని మోడీ ‘ఆత్మా నిర్భయ్ భారత్’ అంటున్నా, స్వావలంబన, స్వదేశీ వంటి పదాలు ప్రయోగిస్తున్నా ఆయన ప్రభుత్వం విదేశీ సంస్థల సలహాలు, విదేశీ ప్రభావిత సలహాదారులతో పనిచేస్తున్నది. అందుకనే మన దేశ సమస్యలను ఎదుర్కోగల విధానాలను రూపొందించలేక పోతున్నారు.

ఆర్ధిక వ్యవహారాలపై విశేషమైన అవగాహన గల సుబ్రమణియన్ స్వామి, ఎస్ గురుమూర్తి వంటి అనేక మంది నిపుణులు విధాన సంబంధ సూచనలు చేయడానికి ప్రభుత్వానికి ఆమడ దూరంలో ఉన్నప్పటికీ తమకు నిపుణుల అవసరం లేదన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. మరోవంక ఆర్ధిక నేరస్థులకు భయం లేకుండా పోతున్నది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి బ్యాంకులను దారుణంగా మోసం చేసిన ఎందరో విదేశాలకు పారిపోయి మన చట్టాల నుండి తప్పించుకొంటున్నారు. వారిని వెనుకకు రప్పించే ప్రయత్నాలు ఫలవంతం కావడం లేదు. రిజర్వు బ్యాంకు వార్షిక నివేదిక ప్రకారం దేశంలోని బ్యాంకులు, ఆర్ధిక సంస్థలలో లక్ష రూపాయలకు, అంతకు మించిన ఆర్ధిక మోసాలు 28 శాతం 2019- 20 సంవత్సరంలో పెరిగాయి. విలువ రీత్యా 159 శాతం పెరిగాయి. అంటే ఈ సంవత్సరంలో రూ 1.85 లక్షల కోట్లు ఆర్ధిక మోసాలు బ్యాంకులు, ఆర్ధిక సంస్థలలో చోటు చేసుకున్నాయి. రాష్ట్రాలకు జిఎస్‌టి బకాయిలను చెల్లించలేమని, అవసరమైతే రుణాలు తీసుకోమని, అందుకు సౌలభ్యం సమకూరుస్తామని కేంద్రం చెప్పడం, ఆర్ధిక దుస్థితులను దైవం ఆడుతున్న క్రీడగా స్వయంగా ఆర్ధిక మంత్రి పేర్కొనడం కేవలం దివాలాకోరు తనాన్ని వెల్లడి చేస్తుంది. జిఎస్‌టి నేడు కేంద్ర, రాష్ట్రాల మధ్య సంఘర్షణ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతున్నది.

రాష్ట్రాలకు విస్తృతమైన వాణిజ్య పన్నుల విభాగాలు ఉన్నాయి. అయితే మీరేమీ పన్నులు వసూలు చేయవద్దు, మేము వసూలు చేసి, తక్కువైతే పరిహారంతో సహా మేమే ఇస్తామని జిఎస్‌టి ప్రవేశ పెట్టిన కేంద్రంకు అందుకు తగిన వ్యవస్థ లేదు. దానితో ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులపై ఆధారపడి వలసి వస్తున్నది. ఈ బాధ్యత నిర్వహించడం కేంద్రాన్ని తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టివేస్తున్నట్లు ఇప్పటికే స్పష్టం అవుతున్నది. ఆర్ధిక వ్యవహారాలలో పారదర్శకత లేకపోవడం, ఆర్ధిక సంస్థల యాజమాన్యంలో జవాబుదారీతనం లేకపోవడంతోనే పరిస్థితులు క్షీణిస్తున్నాయి.

ఆర్ధిక వ్యవహారాలు అదుపు తప్పుతున్నట్లు రెండేళ్ల నుండే స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నా, పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నా బాధ్యులైనవారు పట్టించుకొనక పోవడంతో ప్రస్తుతం దేశం అనూహ్యమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తున్నది. ప్రధాని ఆశిస్తున్నట్లు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థకు దేశం చేరుకున్నా, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదిగినా మౌలికమైన అంశాలలో మార్పు రానిదే సాధారణ ప్రజల జీవితాలలో వెలుగు నింపలేము. ఆకర్షణీయమైన పథకాలు, భావోద్వేగాలు ఎన్నికలలో గెలుపుకు సహకరించినా దేశంలో మార్పు తీసుకు రావడానికి తోడ్పడలేవని గ్రహించాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News