Home తాజా వార్తలు జోష్ కొనసాగనుంది

జోష్ కొనసాగనుంది

Indian economy

 

మెరుగైన క్యూ2 ఫలితాలు, ప్రభుత్వ సంస్కరణలతో సానుకూలం
ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా

న్యూఢిల్లీ : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ వారం అత్యంత ఎత్తుకు ఎగశాయి. అంచనాల కంటే మెరుగ్గా రెండో త్రైమాసిక ఫలితాలు ఉండడం, ద్రవ్య లభ్యత, ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు మార్కెట్‌కు సానుకూలంగా మారనున్నాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే అంతర్జాతీయ అంశాలూ కీలకం కానున్నాయి. ఆర్థిక మందగమనానికి విరుగుడుగా ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టగా, మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్టు ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మరోవైపు మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ దేశ రేటింగ్‌ను స్థిరత్వం నుంచి ప్రతికూలానికి సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసిక ఫలితాలు చివరి దశకు చేరుకున్నాయి.

ఈ వారంలో అదానీ పోర్ట్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్, కోల్ ఇండియా, హిందాల్కో ఇండస్ట్రీస్(11న), గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఒఎన్‌జిసి లిమిటెడ్(14న) ఫలితాలు వెల్లడించనున్నారు. సెప్టెంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి, తయారీరంగ గణాంకాలు 11న వెలువడనున్నాయి.అక్టోబర్ నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్లుపిఐ) వివరాలను ప్రభుత్వం 14న ప్రకటించనుంది. ఇక విదేశీ అంశాల విషయానికొస్తే జపాన్ మూడో త్రైమాసిక జిడిపి గణాంకాలు 14న, ఇదే వారంలో అమెరికా అక్టోబర్ రిటైల్ అమ్మకాల వివరాలు వెల్లడించనున్నారు. ఏడాదికాలంగా కొనసాగుతున్న అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదానికి ముగింపు పడనుందనే సంకేతాలు వెలువడ్డాయి. ఇరు దేశాల చర్చలతో గత వారం పరిష్కారం కుదరనుందనే ఆశలు చిగురించాయి.

తొలి దశలో పాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు అమెరికా, చైనా దేశాధినేతలు అంగీకరించడంతో డిసెంబర్‌కల్లా డీల్ కుదిరే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటికే ఇరు దేశాధినేతలూ అదనపు టారిఫ్‌లను తొలగించే ప్రణాళికలు ప్రకటించారు. ప్రపంచ స్టాక్ మార్కెట్లకు ఈ డీల్ కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాల కారణంగా ఇటీవల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న సంకేతాలు వెలువడిన విషయం విదితమే. విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పిఐలు) పెట్టుబడులు, బ్రెగ్సిట్ డీల్ తదితర పలు ఇతర అంశాలు మార్కెట్ సెంటిమెంటును ప్రభావితం చేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

Indian economy currently facing challenges, says Nirmala