Home తాజా వార్తలు కనువిందు.. పసందు

కనువిందు.. పసందు

Laddu

 

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వండుకునే ఆహారంలోనూ దేశభక్తిని చాటుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఇడ్లీ, శాండ్‌విచ్, ఊతప్పంలాంటివన్నీ జాతీయ జెండాలోని మూడు రంగులు కనిపించేలా తయారుచేసినవి.

లడ్డూలు:

కావలసిన పదార్థాలు : శనగపిండి-ముప్పావు కిలో, నూనె -ఒక కేజి, పంచదార-ఒక కేజి, యాలకుల పొడి -ఒక టీస్పూన్.
తయారుచేసే విధానం : ఒక పాత్రలో శనగపిండి, నీళ్లు పోసి బూందీ వేయడానికి వీలుగా పిండిని కాస్త జారుడుగా కలుపుకోవాలి. స్టవ్‌పై కళాయి ఉంచి నూనె పోసి అది బాగా మరిగాక బూందీ దూసే గరిటెలో శనగపిండిని వేసి చేతితో కలుపుతూ ఉంటే కళాయిలో బూందీ పడుతూ ఉంటుంది. ఈ బూందీని వేగిన తరువాత తీసి మరో గిన్నెలో ఉంచుకోవాలి. మరో కళాయి స్టవ్‌పై ఉంచి అందులో పంచదార, నీళ్లు పోసి కాస్త లేత పాకం రాగానే బూందీని అందులో వేసి ఆపకుండా ఒక పావుగంటపాటు కలుపుతూ ఉండాలి. ఇందులో యాలకుల పొడి వేసి మళ్లీ ఒకసారి బాగా కలిపి అరచేతికి నెయ్యి లేదా నూనె రాసుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి.

ఊతప్పం
కావాల్సినవి : మినప్పిండి ఒక బౌల్, క్యారెట్ ప్యూరీ మూడు టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీస్పూన్లు, కారం ఒక స్పూన్, కొబ్బరిపొడి కప్పు, మిరియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు, పాలకూర ప్యూరీ మూడు టేబుల్ స్పూను.
తయారీ : ముందుగా పిండి తీసుకుని మూడు కప్పుల్లో చెరి సమానం తీసి ఉంచాలి. తర్వాత తగినంత ఉప్పు మూడు కప్పుల్లో వేయాలి. ఒక దాంట్లో క్యారెట్ ప్యూరీ, స్పూన్ కారం వేసి బాగా కలపాలి. రెండోదాంట్లో పావు కప్పు కొబ్బరిపొడి, మిరియాల పొడి, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. మూడో కప్పులో పాలక్ ప్యూరీ, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి వేడయ్యాక నెయ్యి వేసి కావాల్సిన సైజులో వేసుకుంటే ఊతప్పం రెడీ.

Idli

ఇడ్లీ
కావాల్సినవి : ఇడ్లీ రవ్వ మూడు కప్పులు, పెరుగు రెండు కప్పులు, నీళ్లు కప్పు, ఉప్పు తగినంత, పాలకూర గుప్పెడు ఆకులు, క్యాప్సికమ్ ఒక కప్పు, బఠాణీ గుప్పెడు, క్యారెట్ రెండు, బీట్‌రూట్ చిన్నది.
తయారీ : ముందుగా రవ్వ ఒక కప్పులోకి తీసుకుని తగినంత ఉప్పు, పెరుగు, కప్పు నీళ్లు పోసి బాగా కలిపి పక్కన బెట్టుకోవాలి. మిక్సీ జాడీ తీసుకుని దాంట్లో పాలకూర, క్యాప్సికమ్, బఠాణీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనబెట్టుకోవాలి. మరో జాడీ తీసుకుని దాంట్లో క్యారెట్ సన్నగా తరిగిపెట్టుకున్న కప్పు, కొన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ముందు కలిపిపెట్టుకున్న రవ్వ తీసుకుని మూడు కప్పుల్లో కొద్ది కొద్దిగా తీసుకుని రెండింటిలో రెండు మిక్సీకి పట్టి పెట్టుకున్నవి తీసుకుని వేసి కలుపుకోవాలి. ఆ కలుపుకున్న మిశ్రమాన్ని ఇడ్లీ పాత్రలో మూడు రంగులు కొద్ది కొద్దిగా పెట్టి మూత పెట్టాలి అంతే తిరంగా ఇడ్లీలు రెడీ.

Sandwich

 

శాండ్‌విచ్

కావాల్సినవి : కొత్తిమీర, పుదీన ఒకొక్క కప్పు, పచ్చిమిర్చి మూడు, ఎండుమిర్చి రెండు, చింతపండు పావుకప్పు, ఉప్పు తగినంత, కొబ్బరిపొడి అరకప్పు, బ్రెడ్డు మూడు.
తయారీ : కొత్తిమీర, పుదీన, పచ్చిమిర్చి, చింతపండు, తగినంత ఉప్పు మిక్సీలో వేసి కాస్త గ్రైండ్ చేసుకున్నాక కొన్ని నీళ్లు పోసి పూర్తిగా గ్రైండ్ చేసుకుని పక్కనపెట్టుకోవాలి. తర్వాత ఎండు మిర్చి, కొబ్బరిపొడి కూడా అలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాల్ని ఒక బ్రెడ్‌కు ఒకటి చొప్పున రాసి ఒకదాని మీద ఒకటి పెట్టుకుని కట్ చేసుకుంటే తిరంగా శాండ్‌విచ్ రెడీ..

Indian Food Recipes in National flag colors