Friday, April 19, 2024

చైనా యాప్స్‌పై సంధించిన బాణం

- Advertisement -
- Advertisement -

జూన్ 29, రాత్రి 9 గంటలకు భారతదేశంలో చైనా యాప్స్ పై చర్చలు మొదలయ్యాయి. భారత ఐటి మంత్రిత్వ శాఖ 59 యాప్స్‌ను నిషేధించింది. ఈ యాప్స్‌ను నిషేధించడానికి కారణం ఇవి భారత సార్వభౌమాధికారం, సమగ్రతలకు వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి కాబట్టి నిషేధించారు. ఈ యాప్స్ అన్నీ చైనాకు సంబంధించినవే. అయితే ప్రభుత్వ నిషేధ ఉత్తర్వుల్లో ఈ పేరును ప్రస్తావించలేదు. ఈ నిషేధం ఎందుకు అంటే, లడఖ్ గాల్వాన్ లోయ వద్ద జరిగిన పోరులో 20 మంది భారత సైనికులను హతమార్చినందుకు జవాబుగా తీసుకున్న చర్య అనుకోవచ్చు. జూన్ 15వ తేదీన ఈ సంఘటన జరిగింది. ఈ చర్య వల్ల సాధించేదేమిటనేది ఇప్పుడు చర్చనీయాంశం కాదు. ఇక ముందు ఏం జరుగుతుందనేది ఆలోచించవలసిన విషయం. గూగుల్ ప్లే స్టోర్, ఐఒయస్ యాప్ స్టోర్‌ల నుంచి, భారతదేశానికి సంబంధించి ఈ నిషేధించబడిన యాప్స్‌ను తొలగించాలని కోరడం జరగవచ్చు. ఇంతకు ముందు టిక్ టాక్ యాప్‌ను నిషేధించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించినప్పుడు ఇలాగే జరిగింది.

ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లోను, ఐఒయస్ యాప్ స్టోర్ లోను టిక్ టాక్ అందుబాటులో లేదు. అయితే మిగిలిన 58 యాప్స్ ఎలాంటివలాగే ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క టిక్ టాక్ మాత్రమే ఎందుకు తొలగించబడిందనేది స్పష్టంగా తెలియదు. ప్లే స్టోర్‌లో అనేక అనుమానాస్పదమైన టిక్ టాక్ క్లోన్స్ లిస్టు ఉంది. కాబట్టి యాప్ స్టోర్‌తో సంబంధం లేకుండా అస్థిరమైన టిక్‌టాక్ వర్షన్లు పంపిణీ కావచ్చు. ఇలా యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేయడాన్ని సైడ్ లోడింగ్ అంటారు. యాప్స్ ఉపయోగించేవారు ఏదో ఒక విధంగా యాప్ వాడాలనుకుంటే ఇలాంటి ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేవని చెప్పలేం. కాని ఇలా చేయడం వల్ల సైబర్ సెక్యూరిటీ విషయంలో మరిన్ని రిస్కులు ఎదుర్కోక తప్పదు. ఇటీవల ఒక ఉదాహరణ ఏమిటంటే, ఆరోగ్యసేతుకు సంబంధించి అనేక కాపీలు పంపిణీ అయ్యాయి. కొన్ని రాష్ట్రాలు కూడా తమ కోవిడ్ 19 యాప్స్ పంపిణీ చేస్తున్నాయి. ఇలాంటి పంపిణీ వల్ల నష్టాలే ఎక్కువ. ఈ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల కూడా సైబర్ దాడుల ప్రమాదం పెరుగుతుంది. మరో విషయమేమంటే, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, కాంటెంట్ డెలివరీ నెట్‌వర్క్‌లు ఈ యాప్ లను, సర్వీసులను ఉపయోగించే డొమైన్లను బ్లాక్ చేయాలని కోరవచ్చు. అయితే ఇక్కడ మరో అస్పష్టత ఏమిటంటే, ప్రభుత్వం నిర్దిష్ట జాబితాను ఈ ప్రయివేటు ఆపరేటర్లకు ఇస్తుందా లేక ప్రయివేటు ఆపరేటర్లు తామే హోస్ట్ పేర్లను కనుగొని బ్లాక లిస్టులో పెట్టాలా అనేది స్పష్టంగా లేదు.

ఇది ఆచరణలో ఎంత గట్టిగా అమలు చేస్తారన్నది ఇంకా స్పష్టంగా తెలియదు. జమ్ము కశ్మీరులో వైట్ లిస్టు, అనుమతించబడిన లిస్టుల ప్రయోగం పెద్దగా ఫలితాలు సాధించలేదు. యాప్స్ కు సంబంధించి వివరాలన్నీ నిర్ధారించడం అంత తేలిక కాదని తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా మరో పద్ధతి ఏమిటంటే, పోర్న్ లేదా అశ్లీల సైటుల నిషేధానికి పాటించిన పద్ధతి. ఈ విషయంలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఒక స్థాయిలో విచక్షణాధికారం ఇచ్చారు. దీనివల్ల 100 శాతం కాకపోయినా చాలా వరకు ఫలితాలు లభించాయి. రష్యా 2018లో టెలిగ్రామ్ యాప్‌ను నిషేధించడానికి ప్రయత్నించింది. ఈ యాప్ “డొమైన్ ఫ్రంటింగ్‌” సాంకేతికతను ఉపయోగిస్తుంది. దీనివల్ల కంటెంట్ డెలివరీ నెట్వర్కులు బ్లాక్ చేయడానికి ప్రయత్నించినా దొరకదు. డొమైన్ ఫ్రంటింగ్ అంటే ఇది ఒక డొమైన్ పేరు ప్రకటిస్తుంది, కాని మరో డొమైన్ పేరుతో అమల్లో ఉంటుంది. పైగా ఇదంతా ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటుంది కాబట్టి బ్లాక్ చేయడంలో చాలా ఇబ్బందులు ఉన్నా యి. అంటే డొమైన్లను ఖచ్చితంగా గుర్తించి బ్లాక్ చేసినా కూడా యాప్స్ వివిధ మార్గాల ద్వారా పంపిణీలోకి వచ్చే అవకాశాలున్నాయి. మరో డొమైన్ పేరుతో ప్రచారంలోకి రావచ్చు. టెలీగ్రామ్‌ను నిషేధించడానికి రష్యా చాలా కఠినంగా ప్రయత్నించింది. ఐపి అడ్రసులను కూడా ఉపయోగించారు. ఫలితంగా రష్యాలో అమెజాన్ వెబ్ సర్వీసులు, గూగుల్ సర్వీసులు ప్రభావివతమయ్యాయి.
యూజర్లు విపిఎన్ లను కూడా ఉపయోగించవచ్చు. ఇందులో కూడా సెక్యూరిటీ రిస్కులున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంత కఠినంగా ఈ నిషేధాన్ని అమలు చేయాలనుకుంటుందనే విషయంపై ఇదంతా ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ యాప్స్ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ కోసం ప్రయత్నిస్తాయా అన్న విషయంపై కూడా ఆధారపడి ఉంటుంది. నిషేధించబడిన 59 యాప్స్ అన్నీ ఈ విధంగా ప్రవర్తిస్తాయని కూడా భావించలేం. మరో విషయమేమిటంటే, నిషేధం తర్వాత కూడా ఈ యాప్స్ పంపిణీలో ఉంటే దానిపై ఎంత మంది మాట్లాడతారు, ఎంత బలంగా అభ్యంతరాలు, విమర్శలు వస్తాయన్నది కూడా ముఖ్యమైన విషయం. దాన్ని బట్టే నిషేధం అమలుపై తర్వాతి చర్యలు ఉంటాయి.

ఈ యాప్స్ పంపిణీలో ఉన్నాయనే విమర్శలు బలంగా వస్తే ప్రభుత్వం మరింత కఠినంగా నిషేధాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రస్తుతానికి ఈ యాప్స్‌ను నిషేధించే ఆచరణాత్మక పద్ధతుల విషయంలో స్పష్టత లేదు. ఇప్పుడు మరి కొన్ని ప్రశ్నలేమంటే, ఇప్పటికే టిక్ టాక్ డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగిస్తున్నవారు ఉపయోగించడం చట్టవిరుద్ధమా? అలాగే కేమ్ స్కానర్ ఉపయోగించి డాక్యుమెంట్లు వగైరా స్కాన్ చేస్తున్నవారు దాన్ని ఉపయోగించడం చట్ట విరుద్ధమా? అనే ప్రశ్నలున్నాయి. అలాగే వి చాట్ వంటి యాప్ వాడడం చట్టవిరుద్ధమా? గత సంవత్సరం పబ్జీ ఉపయోగించే వారిపై చర్యలు తీసుకున్న ఉదాహరణ ఉంది. అలాగే ఈ సారి కూడా చర్యలు తీసుకుంటారా?
ఈ వ్యవహారంలో పారదర్శకత లేదని ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్ విమర్శించింది. ప్రస్తుతం చైనా చర్యలకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు కనబడినా, భవిష్యత్తులో ఇంటర్నెట్ స్వేచ్ఛ విషయంలో నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. ఈ నిషేధం తర్వాత చైనా ఎలా ప్రతిస్పందిస్తుందన్నది ఇంకా స్పష్టం కాలేదు. భారతదేశం తీసుకున్న చర్య పట్ల తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ఒక ప్రకటన మాత్రమే వచ్చింది. చైనా ఇలాంటి చర్యే తీసుకునే అవకాశాలు లేవు. ఎందుకంటే భారతదేశానికి చెందిన యాప్స్ చైనాలో ఇలా ప్రజాదరణ పొందినవి లేవు. బహుశా చైనా కొన్ని సేవలను నిరాకరించడం, వెబ్ దాడులకు పాల్పడడం వంటివి జరగవచ్చు. ప్రస్తుతం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ఉద్రిక్తతలు పెరిగినప్పటి నుంచి చైనా వ్యవహార శైలి చాలా గుంభనగా ఉంది. ఉదాహరణకు భారతదేశంలో ఒక మంత్రి చైనీస్ ఫుడ్ పై నిషేధం విధించాలని చెప్పిన వెంటనే చైనా ప్రభుత్వ నిర్వహణలో నడిచే మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ షాంఘైలో భారత రెస్టరెంట్ల గురించి ప్రశంసాత్మకమైన కథనం ప్రసారం చేసింది. చైనా కేవలం సైబర్ దాడులకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పలేం. భారత దేశంలో చైనా పెట్టుబడుల గురించి లోతయిన విశ్లేషణలు వచ్చాయి. 2014 నుంచి దాదాపు ఐదు రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. కాబట్టి ఆర్థికమైన దాడులు కూడా చైనా ప్రారంభించవచ్చు. కరోనా మహమ్మారి, లాక్ డౌన్, ఆర్ధికవ్యవస్థ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో చైనాతో ఆర్థికపోరాటం మరిన్ని ఇబ్బందులను పెంచవచ్చు.

Indian Govt Banned 59 China APPs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News