Thursday, April 25, 2024

హాకీ లెజండ్ బల్బీర్ సింగ్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Indian hockey giant Balbir Singh has passed away

 

చండీగఢ్ : భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ (95) కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో మొహాలీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడుసార్లు స్వర్ణ పతకాలు తీసుకురావడంలో బల్బీర్‌సింగ్ కీలక పాత్ర పోషించారు. మే 8న బల్బీర్‌ను అసుపత్రిలో చేర్పించారని… అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించిందని పార్టిస్ ఆస్పత్రి డైరెక్టర్ అభిజిత్ సింగ్ మీడియాకు వెల్లడించారు. ఆధునిక ఒలిపింక్ చరిత్రలో అంతర్జాతీయ ఒలిపింక్ కమిటీ ప్రకటించిన 16 మంది దిగ్గజాలలో బల్బీర్ ఒకరు. ఈ ఘనత సాధించిన ఏకైక భారత అథ్లెట్‌గా ఆయన గుర్తింపు పొందారు. అలాగే ఒలింపిక్స్ హాకీ ఫైనల్స్ చరిత్రలో 1952లో నెదర్లాండ్స్‌తో తలపడిన మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత గోల్స్ సాధించిన ఘనత బల్బీర్‌కే దక్కింది. ఈ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. 1948, 1952, 1956లో ఒలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించిన భారత హాకీ జట్టులో బల్బీర్ కీలక పాత్ర పోషించారు. 1957లో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీతో సత్కరించింది. సెక్టార్-25లో ఎలక్ట్రికల్ శ్మశానంలో బల్బీర్‌సింగ్ భౌతికకాయానికి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.

రాష్ట్రపతి, ప్రధాని నివాళులు

“పద్మశ్రీ బల్‌బీర్ సింగ్ ఆయన చేసిన ప్రదర్శనల్లో మనకు గుర్తుండిపోతారు. ఆయన దేశానికి ఎంతో గౌరవాన్ని, ఎన్నో పురస్కారాలను తీసుకువచ్చారు. ఆయన అత్యద్భుతమైన హాకీ ప్లేయర్ మాత్రమే కాదు.. గొప్ప మెంటార్ కూడా. ఆయన మరణ వార్త ఎంతో బాధించింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి” అంటూ మోదీ ట్వీట్ చేశారు. “బల్‌బీర్ సింగ్ మరణవార్త విని ఎంతో బాధకలిగింది. మూడుసార్లు ఒలింపిక్స్ గోల్ మెడళ్లు, పద్మశ్రీ అవార్డు అందుకు గొప్ప అథ్లెట్ అయన. భవిష్యత్ తరాలకు ఆయన ఎంతో ఆదర్శం. ఆయన కుటుంబానికి, మిత్రులకు నా ప్రగాఢ సానుభూతి” అంటూ కోవింద్ ట్వీట్ చేశారు. ఇక బల్‌బీర్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని.. పంజాబ్ క్రీడాశాఖ మంత్రి రానా గుర్మీత్ సింగ్ సోధీ డిమాండ్ చేశారు. “ఈరోజు మనం కేవలం ఓ దిగ్గజ ఆటగాడినే కాదు.. ఒక గొప్ప మార్గదర్శిని కోల్పోయామని సోధీ పేర్కొన్నారు.

ఆయన లాంటి వారు చాలా అరుదు

భారత హాకీ దిగ్గజం, మూడుసార్లు ఒలింపిక్స్ స్వర్ణ పతకాల విజేత సీనియర్ బల్బీర్ సింగ్(95) మృతిచెందడంపై పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ రోజు ఉదయం మొహాలీలోని ఓ ఆస్పత్రిలో బల్బీర్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే సామాజిక మాధ్యమాల ద్వారా భారత హాకీ ఆటగాళ్లతో పాటు ఒలింపిక్ పతక విజేత అభినవ్ బింద్రా, భారత హాకీ మాజీ సారథి విరెన్ రస్కిన్హా, షూటర్ హీనా సిద్ధు విచారం వ్యక్తం చేశారు.

భారత ఒలింపిక్స్ స్వర్ణ పతకాల విజేత ఇక లేరని తెలిసి చాలా బాధగా ఉంది. ఒక ఆటగాడిగా, ఆదర్శప్రాయుడిగా బల్బీర్ సింగ్ లాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ఆయనతో పరిచయం ఉండటం ఎంతో గర్వంగా ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది అథ్లెట్లకు.. ఆయన చరిత్ర ఎప్పుడూ ఆదర్శంగా నిలుస్తుంది.———– అభినవ్ బింద్రా

బల్బీర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. ఆయన దగ్గరికెళ్లి చాలా సార్లు కలిసేందుకు ప్రయత్నించినా అది కుదరలేదు. ఆయనకు నేనో వీరాభిమానిని. ఏదో ఒకరోజు బల్బీర్‌తో ఫొటో తీసుకోవాలనుకున్నా. బాధగా ఉన్నా ఇప్పుడాయన మన జ్ఞాపకాల్లో మిగిలిపోయారు. – హీనా సిద్ధు

ఆల్‌టైమ్ అత్యుత్తమ ప్లేయర్, దిగ్గజ ఆటగాడు సీనియర్ బల్బీర్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలి. మీరు మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటారు.
– భారత హాకీ క్రీడాకారుడు మన్‌ప్రీత్ సింగ్.

దిగ్గజ ఆటగాడి మరణవార్త తెలిసి షాక్‌కు గురయ్యా. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వారికి ధైర్యాన్నివ్వాలని ప్రార్థిస్తున్నా. బల్బీర్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలి.
– -భారత హాకీ గోల్‌కీపర్ శ్రీజేశ్

దిగ్గజ ఆటగాడు బల్బీర్ సింగ్ మృతిచెందడం బాధ కలిగించింది. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి. – విరాట్ కోహ్లీ

భారత దిగ్గజ ఆటగాడు సీనియర్ బల్బీర్ సింగ్ ఇక లేరు. ఆయన సాధించిన విజయాలు చూస్తే ఆశ్చర్యపోతారు. మూడుసార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత, ఒలింపిక్ ఫైనల్లో ఐదు గోల్స్. 1975 ప్రపంచకప్ సాధించిన జట్టుకు మేనేజర్. భారత అత్యుత్తమ దిగ్గజాలలో ఒకరు. ఆయన ఆశ్మకు శాంతి కలగాలి.
– హర్భజన్‌సింగ్

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News