Home తాజా వార్తలు నరంపేటలో జవాను హత్య

నరంపేటలో జవాను హత్య

Indian Jawan

 

స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో ఘర్షణ
ఆరుగురిపై కేసు నమోదు

వరంగల్ రూరల్ : భారత జవాన్‌పై కత్తితో మూకుమ్మడిగా దాడి చేయగా తీవ్ర గాయాలపాలై మృతిచెందిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలో చోటు చేసుకుంది. ఈ విషాద సంఘటనకు సంబంధించి మృతుని కుటుంబ సభ్యులు, నర్సంపేట ఎస్సై నాగ్‌నాథ్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి… నర్సంపేట పట్టణానికి చెందిన హన్మకొండ ప్రేమ్‌కుమార్(29) జమ్ము కాశ్మీర్ శ్రీనగర్‌లోని ఎస్‌ఎస్‌డీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత రెండు రోజుల క్రితం సెలవుపై నర్సంపేటకు వచ్చాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి అతని మిత్రులు రాజబోయిన ఉదయ్‌కుమార్, గన్నారపు జాక్సన్, హన్మకొండ రాజులతో కలిసి ఓ సినిమా థియేటర్‌లో సెకండ్ షో సినిమా చూస్తుండగా బత్తుల రాకేష్ బర్త్‌డే ఉందని చిలువేరు రాకేష్ ఫోన్ చేసి ప్రేమ్‌కుమార్‌ను పిలిచాడు.

వల్లబ్‌నగర్‌లోని దూదిమెట్ల నాగరాజు ఇంట్లో బర్త్‌డే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నాగరాజుకు ప్రేమ్‌కుమార్‌కు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో దూదిమెట్ల దిలీప్ ఆర్మీ జవాన్ ప్రేమ్‌కుమార్‌ను కత్తితో సున్నితమైన ప్రదేశంలో పొడిచాడు. మిగిలిన వారు అతన్ని పిడిగుద్దులు గుద్దడంతో స్పృహ తప్పిపడి పోయాడు. కులం పేరుతో దూషిస్తూ నానా దుర్భాషలాడినట్లు తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రేమ్‌కుమార్‌ను స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వరంగల్ ఎంజీఎంకు తరలించాలని వైద్యులు సూచించారు.

వరంగల్ ఎంజీఎంలో కూడా వైద్యులు హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. దీంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రేమ్‌కుమార్ మృతిచెందాడు. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడిగా దూదిమెట్ల దిలీప్‌తోపాటు దూదిమెట్ల నాగరాజు, బీరం భరత్‌రెడ్డి, బాలు, బబ్లూ, బత్తుల రాజులపై హత్యా నేరం, కులం పేరుతో దూషణ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగ్‌నాథ్ తెలిపారు.

అసలేం జరిగింది…?
ఆర్మీ జవాన్ తన మిత్రుడి రాకేష్ బర్త్‌డే వేడుకల కోసం నాగరాజు ఇంటికి వెళ్లిన తరువాత వేడుకలు జరుపుకున్న తరుణంలో నిందితుల మధ్య ఏం జరిగింది.. అనేది ప్రశ్నార్ధకంగా మిలిగింది. మాట మాట ఎందుకు పెరిగింది… వారిలో చంపుకునేంత కక్షలు ఏమున్నాయనేది పోలీసుల దర్యాప్తులో తెల్చాల్సి ఉంది. ఆర్మీ జవాన్ పది మందిని సైతం ఎదుర్కొనే సత్తా కల్గిన ప్రేమ్‌కుమార్ ఆ సమయంలో ఎందుకు తన ప్రాణాల్ని రక్షించుకోలేకపోయాడు.. పక్కా ప్లాన్ ప్రకారంగానే ప్రేమ్ కుమార్‌ను అంతమొందించడానికి పార్టీకి పిలిచి గొడవ సృష్టించి ప్రేమ్‌కుమార్ సున్నిత ప్రదేశంపై దాడి చేసి అంతమొందించాలనే చూశారా… అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఆర్మీ జవాన్ హత్య కేసు సంఘటనను పోలీసులు నిగ్గు తేల్చాల్సి ఉంది.

దోస్తులంటె ప్రాణం.. వారి చేతిలోనే మరణం
ఆర్మీ జవాన్ ప్రేమ్‌కుమార్‌ది సాధారణమైన కుటుంబం. దేశం కోసం తన వంతు కృషి చేయాలనే పట్టుదలతో కష్టపడి ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడు. కావాలని అత్యంత క్లిష్ట పరిస్థితులు ఉన్న శ్రీనగర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా చిన్నతనం నుంచి కూడా ప్రేమ్‌కుమార్‌కు స్నేహితులంటే ప్రాణం. సెలవుకు కోసం ఇంటికి వచ్చిన ప్రేమ్‌కుమార్ ఎక్కువ సమయాన్ని దోస్తులతోనే గడిపేవాడు. అలాంటి ప్రేమ్ చివరకు దోస్తుల చేతిలోనే మృతిచెందడం ప్రతీ ఒక్కరిని కలిచి వేస్తుంది. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Indian Jawan killed by Friends