Friday, April 26, 2024

గల్వాన్ లోయలో జవాన్ల న్యూ ఇయర్ సంబరాలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నూతన సంవత్సరాది వేడుకల్లో భాగంగా తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత జవాన్లు భారీ త్రివర్ణ పతాకాన్ని చేతబూని వేడుకలు జరుపుకొన్న ఫోటోలను భారత సైన్యం మంగళవారం మీడియాకు విడుదల చేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు కూడా తన ట్విట్టర్‌లో ఈ ఫొటోలను షేర్ చేశారు. ‘న్యూఇయర్ 2022 సందర్భంగా గల్వాన్ లోయలో సాహసవంతులైన భారతీయ జవాన్లు’ అన్న శీర్షికతో మంత్రి ఈ ఫోటోలను షేర్ చేశారు. మూడు రోజుల క్రితం చైనా అధికారిక పత్రిక ‘ గ్లోబల్ టైమ్స్’ గల్వాన్ లోయలో చైనా సైనికులు నూతన సంవత్సరం సందర్భంగా చైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసి, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారంటూ దానికి సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు మోడీ సర్కార్‌పై విరుచుకు పడ్డాయి.‘మోడీజీ ఇకనైనా మౌనం వీడండి’ అని అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ సైతం చేశారు. ఇదంతా జరిగిన మూడు రోజలు తర్వాత ఆర్మీ ఇప్పుడు ఈ ఫోటోలను విడుదల చేసింది. దాదాపు 30 మంది భారతీయ జవాన్లు త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని ఉన్నట్లుగా ఒక ఫోటోలో ఉంది.

వీరిలో నలుగురు జాతీయ జెండాను పట్టుకుని ఉండగా, దగ్గర్లోనే ఉన్న తాత్కాలిక అబ్జరేషన్ పోస్టు వద్ద మరో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతున్న దృశ్యాలు ఆ ఫోటోలో కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలు గల్వాన్ లోయలో జనవరి 1వ తేదీకి చెందినవనిఆర్మీ వర్గాలు తెలిపాయి. జనవరి 1వ తేదీన భారత, చైనా సైన్యాలు వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న పది సరిహద్దు పోస్టుల వద్ద పరస్పరం స్వీట్లు పంచుకుని, శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. తూర్పు లడఖ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పూర్తిగా చల్లారని తరుణంలో ఇది సహృద్భావ సంకేతమని విశ్లేషకులు అభివర్ణిస్తున్న తరుణంలో చైనా అధికార మీడియా గల్వాన్ లోయలో పిఎల్‌ఎ జవాన్లు చైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసినట్లుగా చూపే ఫొటోలను విడుదల చేయడం మరోసారి వివాదాస్పదమయింది. అయితే చైనా సైనికులు తమ జాతీయ పతాకాన్ని ఎగురవేసింది గల్వాన్ లోయలోని చైనా వైపు ఉన్న లోతట్టు ప్రాంతమని, ఇరు దేశాల సైన్యాల మధ్య ఘర్షణ అనంతరం ఏర్పాటు చేసిన బఫర్ జోన్ దగ్గర్లో కాదని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.

Indian Jawans New Year 2022 celebrations at Galwan Valley

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News