Home జయశంకర్ భూపాలపల్లి బతుకు పోరులో ‘చితికి’ పోయి

బతుకు పోరులో ‘చితికి’ పోయి

Indian Peoples Died In Gulf Countries

మన తెలంగాణ/జగిత్యాల : ఉన్న ఊరిలో ఉపాధి లేక కన్న వారిని, భార్య బిడ్డలను వదిలి బతుకుదెరువు కోసం పరాయి దేశం పయనమైన ఎంతో మంది అభాగ్యులు అక్కడే తనువు చాలిస్తున్నారు. గల్ఫ్ దేశాలు వెళ్తే బాగా సంపాదించవచ్చనే ఆశతో అప్పులు చేసి, ఉన్న ఆస్తులు అమ్మి గల్ఫ్‌బాట పట్టిన వారు మృత్యువాత పడటంతో అటు ఆస్తులు పోయి ఇటు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఉపాధి కోసం వెళ్ళి మృతి చెందిన వారి శవాలను వారి వారి స్వగ్రామాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాల్సిన ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుండగా ఇక్కడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పట్టించుకోకపోవడంతో బాధిత కుటుంబాల సభ్యుల మృతదేహాల కోసం ఎదురుచూడక తప్పడం లేదు. ఈ నాలుగేళ్లలో తెలంగాణ వాసులు గల్ఫ్‌లో 800 మంది మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. పుట్టి పెరిగిన ఊరిలో ఉపాధి అవకాశాలు ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోలేక గల్ఫ్ మోజులో పడి ఎన్నో ఆశలతో ఏడాది దేశాలకు పయనమవుతున్న వలస జీవులు అక్కడ రోజుకు ఒకరిద్దరూ అనారోగ్యం బారిన పడో, ప్రమాదాలకు గురయ్యో మృత్యువాత పడుతున్నారు. జగిత్యాల జిల్లాలో నిత్యం ఏదో ఒక గ్రామంలో గల్ఫ్‌లో మృతి చెందిన వార్తలు విని పిస్తునే ఉన్నాయి. మృతి చెందిన విషయం స్నేహితుల ద్వారా తెలుసుకుంటున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ వా రిని కడసారి చూసుకునేందుకు మృతదేహాలు గ్రామానికి త్వరగా వచ్చే ఏర్పాట్లు చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
ఆస్తులు పోయి… అప్పులు మిగిలి
విదేశాలకు వెళ్ళితే బాగా సంపాదించవచ్చనే ఆశతో ఉన్న ఆస్తులను అమ్ముకొని లక్షలాది రూపాయలు ఏజెంట్ల చేతిలో పెట్టి ఏడారి దేశాలకు పయనమవుతున్న వలస జీవులు కొందరైతే, అందిన చోటల్లా అప్పులు చేసి వెళ్తున్నవారు మరి కొందరు. అరచేతిలో స్వర్గం చూపించే ఏజెంట్ల మాటలు నమ్మి విదేశాలకు పయనమవుతున్న యువతకు అక్కడికి వెళ్ళిన తర్వాత చుక్కెదురవుతోంది. ఏజెంట్లు చెప్పిన విషయాలకు అక్కడి కంపెనీలు ఇచ్చే వసతి సౌకర్యాలు, వేతనాల విషయంలో చాలా వ్యత్యాసం ఉంటోంది. రోజుకు పది గంటలకు పైగా పనులు చేసినా రూ. 5నుండి10వేల జీతం కంటే ఎక్కువ చెల్లించకపోవడంతో తాము ఎలా బతికేదని, అప్పులు ఎలా తీర్చేదని వారిలో వారే కుమిలిపోతున్నారు. ఇంటికి రాలేక అక్కడ బతకలేక మానసిక వేదనను అనుభవిస్తూ దినదిన గండంగా కాలం వెల్లదీస్తున్నారు. ఈ జీతంలో అప్పులు ఎలా తీర్చేదని మదనపడే సున్నిత మనస్కులు అక్కడే బలవన్మరణాలకు పాల్పడుతుండగా మరి కొందరు అనారోగ్యం బారిన పడి మృత్యువాత పడుతున్నారు. ఇవి చాలవన్నట్లుగా భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదాలకు గురై , విధుల్లో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదాలకు గురి కావడంతో వారి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
నెలలు గడిచినా ఇంటికి చేరని మృతదేహాలు ః
ఏడారి దేశాల్లో మృతి చెందిన వారి శవాలు నెలలు గడిచినా ఇంటికి చేరకపోవడంతో మృతుల కుటుంబ సభ్యులు తమ వారి మృతదేహాల కోసం కళ్లల్లో వత్తులు పెట్టుకొని ఎదిరి చూస్తున్నారు. మృతదేహాలను స్వగ్రామా లకు పంపించాల్సిన కంపెనీలు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తుండగా అక్కడి భారత రాయబార కార్యాలయ అధికారులు కూడా పట్టించుకోకపో వడంతో శవాలు నెలల కొద్ది అక్కడి మార్చురీలలో మగ్గుతున్నాయి. మృతుల స్నే హితులు విరాళాలు జమచేసి శవాలను ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తే తప్పా కంపెనీలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. బాగా సంపా దించుకుని వస్తామని ఎన్నో ఆశలతో కన్న తల్లిదండ్రులను, భార్య, బిడ్డలను వదిలి పరాయి దేశం పయనమైన అభాగ్యులు శవపేటికల రూపంలో ఇళ్ళు చేరడం మనసున్న ప్రతి ఒక్కరిని కలిచి వేస్తుంది.. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయి అనాధలుగా మిగిలిన కుటుంబాలను ఓదార్చి వారిలో మానసిక స్థైర్యం నింపేవారు కరువవుతున్నారు. విషాదంలో మునిగిపోయిన వారి బాధలు పట్టించుకోకుండా తమ వద్ద తీసుకున్న అప్పులు చెల్లించమంటూ కుటుంబ సభ్యులపై అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తూ వారికి నరకాన్ని చూపి స్తున్నారు. బతుకుదెరువు కోసం దేశం కాని దేశం వెళ్ళి మృత్యువాత పడ్డ వారి శవాలను త్వరగా స్వగ్రామాలకు చేర్చడంతో పాటు బాధిత కు టుంబా లను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.