Friday, April 19, 2024

నేటి నుంచి ఐపిఎల్ సమరం

- Advertisement -
- Advertisement -

indian premier league 2020 start Today

అబుదాబి: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 క్రికెట్ సమరానికి శనివారం తెరలేవనుంది. నవంబర్ 10 వరకు సాగే ఈ మెగా సమరంలో 8 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్‌ల మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపిఎల్ 13వ సీజన్ ఆరంభమవుతోంది. కరోనా నేపథ్యంలో ఈసారి ఐపిఎల్‌ను యుఎఇకి మార్చారు. గతానికి పూర్తి భిన్నమైన వాతావరణంలో ఈసారి ఐపిఎల్ టోర్నీ జరుగనుంది. కరోనా భయం నేపథ్యంలో స్టేడియాల్లో ప్రేక్షకులకు అనుమతి ఇవ్వడం లేదు.

దీంతో ఖాళీ మైదానాల్లోనే ఐపిఎల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. యుఎఇలోని మూడు వేదికల్లో ఈసారి ఐపిఎల్‌ను నిర్వహిస్తున్నారు. ప్రేక్షకులకు స్టేడియాల్లో అనుమతి లేక పోవడంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ ప్రేమీకులు ఈసారి ఐపిఎల్‌ను టివిల్లోనే వీక్షించనున్నారు. గతంతో పోల్చితే యుఎఇలో జరుగుతున్న ఐపిఎల్‌కు మరింత మెరుగైన ఆదరణ లభిస్తోందని ధీమాతో భారత క్రికెట్ బోర్డు ఉంది. కాగా కొన్ని శని, ఆదివారాల్లో రెండేసి మ్యాచ్‌లు జరుగుతాయి. మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ఆరంభం అవుతుంది. ఇక సాయంత్రం జరిగే మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతోంది. ఇదిలావుండగా ఐపిఎల్ మ్యాచ్‌లను స్టార్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే కాకుండా స్టార్ తెలుగులో కూడా ఐపిఎల్‌ను ప్రసారం చేస్తారు.

గెలుపుపై ఎవరి ధీమా వారిదే

పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో జరుగుతున్న ఐపిఎల్ 13వ సీజన్‌లో అన్ని జట్లు భారీ ఆశలతో బరిలోకి దిగుతున్నాయి. ఈసారి కూడా ముంబై ఇండియన్స్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. స్టార్ క్రికెటర్లతో కూడిన ముంబై మరో ట్రోఫీపై కన్నేసింది. రోహిత్ శర్మ కెప్టెన్సీ ముంబైకి అదనపు బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇక మాజీ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ కూడా ట్రోఫీపై కన్నేసింది. కానీ ఈసారి చెన్నైకి ట్రోఫీ సాధించడం అంత తేలిక కాదని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. సీనియర్ క్రికెటర్లు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ దూరం కావడం జట్టును బలహీనంగా మార్చింది. అంతేగాక యుఎఇ చేరిన వెంటనే జట్టు సిబ్బంది కరోనా బారిన పడడం కూడా జట్టుపై తీవ్ర ప్రభావాన్నే చూపింది. ఇలాంటి స్థితిలో చెన్నై ఎలా ఆడుతుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా ట్రోఫీ సాధించడమే లక్షంగా పెట్టుకున్నాయి. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లికి ఈసారి ఐపిఎల్ చాలా కీలకంగా మారింది. సుదీర్ఘ కాలంగా జట్టుకు సారధ్యం వహిస్తున్నా ఒక్కసారి కూడా బెంగళూరుకు ట్రోఫీని అందించలేదు. ఈసారి ఆ లోటును పూడ్చుకోవాలని కోహ్లి భావిస్తున్నాడు. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ వంటి దిగ్గజాలతో కూడిన హైదరాబాద్ కూడా ట్రోఫీ గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది. దినేశ్ కార్తీక్ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో కూడా ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. దీంతో కోల్‌కతా కూడా టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా కనిపిస్తోంది.

యువ క్రికెటర్లతో నిండిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కూడా ఎలాగైన ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. శ్రేయస్ అయ్యర్ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈసారి ట్రోఫీ సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు లోకేశ్ రాహుల్ సారధ్యంలోని పంజాబ్ కూడా ఈసారి ఎలాగైన ట్రోఫీని గెలుచుకోవాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలోని రాజస్థాన్ కూడా ట్రోఫీపై కన్నేసింది. మొత్తం మీద టోర్నీలో పాల్గొంటున్న 8 జట్లు కూడా ఈసారి కప్పును సాధించడమే లక్షంగా పెట్టుకోవడంతో ఐపిఎల్ సమరం హోరాహోరీగా సాగడం ఖాయం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News