Home ఎడిటోరియల్ ట్రంప్ దెబ్బకు కరెన్సీల బేజారు

ట్రంప్ దెబ్బకు కరెన్సీల బేజారు

Indian rupee has fallen to the lowest level of 70 in US dollar

అమెరికన్ డాలర్‌తో భారత రూపాయి మారక విలువ ఎన్నడూలేని విధంగా 70 దిగువకు పడిపోయింది. ఇది సాధారణంగా కల్లోలపరిచే విషయం. అయితే ఇతర దేశాల కరెన్సీల మారక విలువ తగ్గినందున ఇది ఆందోళన చెందాల్సిన విషయం కాదని ఆర్థికవేత్తలు అంటున్నారు. రిజర్వుబ్యాంక్ వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగినంతగా ఉన్నాయని, విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో అనూహ్య ఒత్తిడి ఏర్పడితే దాన్ని తట్టుకునే శక్తి ఉందని కేంద్ర (మాజీ ఆర్థిక) మంత్రి అరుణ్‌జైట్లీ ట్వీట్ చేశారు. ఆగస్టు 3తో ముగిసిన వారంలో ఆర్‌బిఐ వద్ద 402.70 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయి.

ఇవి అంతకు క్రితం వారంకన్నా 1.49 బిలియన్ డాలర్లు తక్కువ. రష్యా, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా వంటి ప్రధానమైన ప్రాదుర్భావ మార్కెట్ ఆర్థిక వ్యవస్థల కరెన్సీల కన్నా రూపాయి బలంగా ఉండటం ఊరట. అంతేగాక విదేశీ ఇన్వెస్టర్లు కంగారుపడి పెట్టుబడులు ఉపసంహరించుకోవటంగాని, ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల ఆగమనం తగ్గటంగానీ సంభవించకపోవటం భారత ఆర్థిక వ్యవస్థకు భరోసా ఇస్తున్నది. అయితే రూపాయి, ఇతర విదేశీ కరెన్సీల విలువ ఎందుకు శీఘ్రంగా పతనమవుతున్నదో పరిశీలించాల్సిన విషయం.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కర్రపెత్తందారీ, బ్లాక్ మెయిల్ ఆర్థిక విధానాలు, అమెరికా ప్రయోజనాల పేరుతో సాగిస్తున్న వాణిజ్య యుద్ధం ఇందుకు ప్రధాన హేతువు. నాటో కూటమిలో సహభాగస్వామి అయిన టర్కీపై ఆయన తాజాగా వాణిజ్య యుద్ధం ప్రకటించారు. టర్కిష్ ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేస్తానని ట్రంప్ గత శుక్రవారం ప్రకటించాడు. దీనికి ఆర్థిక కారణాలకన్నా అహంభావ రాజకీయాలు మూలంగా కనిపిస్తున్నది. గూడచర్యం, రెండేళ్ల క్రితం విఫలమైన తిరుగుబాటులో ప్రమేయం ఆరోపణలపై టర్కీ 2016లో గృహ నిర్బంధం చేసిన అమెరికన్ క్రైస్తవ మత ప్రచారకుడు ఆండ్రూ బ్రున్‌సన్‌ను విడుదల చేయాలన్న ట్రంప్ డిమాండ్‌ను అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ తిరస్కరించిన కారణాన ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆయన సుంకాలు పెంచారు, ఆంక్షలు విధించారు.

ఇది టర్కీ సార్వభౌమాధికారంలో ప్రత్యక్ష జోక్యం. ఐఎంఎఫ్ డేటా ప్రకారం టర్కీ గత సంవత్సరం అమెరికా నుంచి 12 బిలియన్ డాలర్ల సరుకులు దిగుమతి చేసుకోగా, 8.7 బిలియన్ డాలర్ల సరుకులు ఎగుమతి చేసింది. అనగా టర్కీ దిగుమతులకు నాల్గవ పెద్ద వనరుగా, ఎగుమతులకు ఐదవ పెద్ద మార్కెట్‌గా అమెరికా ఉంది. టర్కీ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం ఒత్తిళ్లలో ఉండగా ట్రంప్ సుంకాల పెంపుదల గోరుచుట్టుపై రోకటిపోటులా తగిలింది. టర్కీ కరెన్సీ లిరా మారక విలువ మూడు రోజుల్లో 30 శాతం పతనమైంది. ఈ టర్కీష్ సంక్షోభం ప్రాదుర్భావ ఆర్థిక వ్యవస్థల కరెన్సీలన్నిటినీ తాకింది. అందులో భాగమే రూపాయి విలువ భారీ పతనం. రూపాయి ఈ ఏడాది తన విలువలో 8.6 శాతం కోల్పోయింది.

టర్కీ అధ్యక్షుడు ప్రతీకార చర్యగా అమెరికా నుంచి దిగుమతులపై బుధవారం సుంకాల పెంపు ప్రకటించాడు. బియ్యం, సౌందర్య పోషకాలు, బొగ్గుపై సుంకాలు రెట్టింపు అయినాయి. మద్యంపై 120 శాతానికి, కార్లపై 120 శాతానికి, పొగాకు ఆకులపై 60 శాతానికి పెరిగాయి. వీటికితోడు, సంక్షోభాన్ని తట్టుకుంటామని సెంట్రల్ బ్యాంక్ ప్రకటించటం, 16 బిలియన్ డాలర్ల సహాయం అందించటానికి కటార్ ముందుకు రావటంతో లిరా దాదాపు 30 శాతం పుంజుకుంది. కాని రూపాయి విలువ గురువారం 70.16 పైసలకు పతనం చెందటం ఆందోళనకరం. ఇది ఇలాగే కొనసాగితే క్రూడ్ ఆయిల్, ఇతర ముడి సరుకులు ప్రియమై రిటైల్ ధరల పెరుగుదలకు దారితీస్తుంది. విదేశీ వాణిజ్య లోటు మరింతగా పెరిగితే, విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఒకస్థాయి నుంచి దిగజారి మన ఆర్థిక వ్యవస్థ సంక్షోభం దిశలో పడుతుంది. అందువల్ల రిజర్వు బ్యాంక్ తగు దిద్దుబాటు చర్యలు తీసుకుని రూపాయి విలువను నిలబెట్టాలి.

ట్రంప్ చైనాతో, మెక్సికోతో, కొన్ని యూరప్ దేశాలతో, భారత్‌తో సైతం వాణిజ్య యుద్ధం ప్రారంభించారు. అవి ప్రతి చర్యలు తీసుకున్నాయి. వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు దెబ్బతింటున్నాయని అమెరికన్ రైతులు గగ్గోలుపెడితే వారికి భారీగా సబ్సిడీలు పెంచిన ట్రంప్ చైనాతో సర్దుబాటుకు సిద్ధం కాలేదు. అమెరికాతో వాణిజ్యం వల్ల లబ్దిపొందిన దేశాలు ఇప్పుడు బదులు చెల్లించుకోవాలన్నది ట్రంప్ వైఖరిగా ఉంది. అగ్రరాజ్యాధి నేతగా తన మాటే శాసనం అంటున్న ట్రంప్ ఒంటెత్తుపోకడ భారత్ సహా ప్రాదుర్భావ ఆర్థిక వ్యవస్థలకు చేటు చేస్తున్నది.