Thursday, March 28, 2024

ఓడినా ‘మనసులు గెలిచారు’

- Advertisement -
- Advertisement -

 

Indian Women's Hockey team defeat at Olympics

కాంస్యం పోరులో భారత్ ఓటమి
చిరస్మరణీయం రాణి సేన పోరాటం
మహిళా హాకీ జట్టు ఆటకు దేశం ఫిదా

టోక్యో: ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించే అవకాశాన్ని భారత మహిళా హాకీ జట్టు తృటిలో చేజార్చుకుంది. కాంస్యం కోసం శుక్రవారం బ్రిటన్‌తో జరిగిన హోరాహోరీ పోరాటంలో భారత్ ఓటమి పాలైంది. డిఫెండింగ్ చాంపియన్ బ్రిటన్‌తో జరిగిన పోరులో రాణి రాంపాల్ టీమ్ చివరి వరకు గట్టి పోటీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. చివరి నిమిషం వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో బ్రిటన్ 43 తేడాతో భారత్‌ను ఓడించి కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఓడినా భారత మహిళలు చిరస్మరణీయ పోరాటంతో కోట్లాది మంది అభిమానుల మనసులను దోచుకున్నారు. ఏమాత్రం అంచనాలు లేకుండా ఒలింపిక్స్ బరిలోకి దిగిన రాణి టీమ్ ఏకంగా సెమీఫైనల్‌కు చేరుకుని పెను ప్రకంపనలే సృష్టించింది. ఇక కాంస్యం కోసం జరిగిన పోరులో తనకంటే ఎంతో మెరుగైన స్థానంలో ఉన్న బ్రిటన్‌ను దాదాపు ఓడించినంత పనిచేసింది. కాగా త్రుటిలో పతకం చేజారడంతో మహిళా జట్టు సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక భారత ప్రధాన మంత్రి స్వయంగా వారితో ఫోన్‌లో మాట్లాడి ఓదార్చారు.

ఆరంభం నుంచే హోరాహోరీ..

ఇక బ్రిటన్‌తో జరిగిన పోరులో భారత్ అంచనాలకు మించి రాణించింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన బ్రిటన్ అనుకున్నట్టుగానే ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించింది. తొలి క్వార్టర్‌లో బంతిని తన ఆధీనంలోనే ఉంచుకుంది. భారత మహిళలు కూడా అడపాదడపా ప్రత్యర్థి గోల్ పోస్ట్ వైపు దాడులు చేస్తూ గోల్ కోసం ప్రయత్నించారు. ఇక 16వ నిమిషంలో బ్రిటన్ ప్రయత్నం ఫలించింది. ఎలినా రేయర్ అద్భుతమైన గోల్‌తో బ్రిటన్‌కు ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత బ్రిటన్ మరింత చెలరేగి ఆడింది. 24వ నిమిషంలో రాబర్ట్‌సన్ జట్టుకు రెండో గోల్ అందించింది. దీంతో ఇంగ్లీష్ టీమ్ 20 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే బ్రిటన్‌కు ఆ ఆనందం ఎంతో సేపు నిలువలేదు. భారత స్టార్ గుర్జీత్ కౌర్ రెండు పెనాల్టీ కార్నర్‌లను గోల్‌గా మలచి బ్రిటన్ ఆధిక్యాన్ని 22తో సమం చేసింది. మరికొద్ది సేపటికే వందన అద్భుత ఫీల్డ్ గోల్ చేయడంతో భారత్ 32 ఆధిక్యంలోకి వెళ్లింది.

అతి జాగ్రత్తకు పోవడంతో..

ఇక మూడో క్వార్టర్‌లో భారత్ రక్షణాత్మకంగా ఆడేందుకు ప్రయత్నించింది. ఇదే టీమిండియాకు ప్రతికూలంగా మారింది. ఆధిక్యాన్ని కాపాడుకునేందుకు మాత్రమే ప్రయత్నించడంతో గోల్స్ రాలేదు. అంతేగాక దూకుడును తగ్గించడంతో ప్రత్యర్థికి కలిసి వచ్చింది. దూకుడుగా ఆడిన బ్రిటన్ 35వ నిమిషంలో మూడో గోల్‌ను సాధించి స్కోరును సమం చేసింది. హోలీ షేర్న్ ఈ గోల్‌ను నమోదు చేసింది. తర్వాత భారత్‌బ్రిటన్‌లు ఆధిక్యం కోసం సర్వం ఒడ్డాయి. కానీ కీలక సమయంలో భారత్ ఒత్తిడికి గురికావడంతో బ్రిటన్ అనూహ్యంగా పుంజుకుది. ఇదే క్రమంలో 48వ నిమిషంలో గ్రేస్ బాల్డ్‌సన్ జట్టుకు నాలుగో గోల్ అందించింది. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడు కోవడంలో సఫలమైన బ్రిటన్ 43 గోల్స్ తేడాతో మ్యాచ్‌ను గెలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

స్ఫూర్తినింపే ప్రదర్శన ఇదీ
రాణి సేనపై ప్రశంసల వర్షం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా హాకీ జట్టు ప్రదర్శనకు దేశం మొత్తం ఫిదా అయ్యింది. బ్రిటన్‌తో కాంస్యం కోసం జరిగిన పోరులో టీమిండియా కనబరిచిన ఆటపై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. మీ అసాధారణ పోరాట పటిమను చూసి దేశం మొత్తం గర్వపడుతుందని పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు గుప్పించారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్, పంజాబ్ సిఎం అమరీందర్ సింగ్, రాష్ట్ర మంత్రి కెటిఆర్ తదితరులు భారత హాకీ టీమ్ ప్రదర్శనను కొనియాడారు. ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు పోరాట పటిమ యువతరంలో కొత్త స్ఫూర్తిని నింపడం ఖాయమని వారు జోస్యం చెప్పారు. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత్ చారిత్రక ప్రదర్శనతో దేశ ఖ్యాతిని ఇనుమడింప చేసిందని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News