దేశ ఆర్థిక వ్యవస్థపై నిపుణులు వెలిబుచ్చుతున్న అభిప్రాయాలను గమనిస్తే ఆరున్నరేళ్లు దాటిన ఎన్‌డిఎ పాలనలో దానికింకా స్పష్టమైన దిశ ఏర్పడలేదనే ఆందోళన కలుగుతుంది. ఏడాదిగా పీడిస్తున్న కరోనా కారణంగా వృద్ధి దెబ్బతిన్న సంగతి అలా ఉంచితే అంతకు ముందు కూడా దేశం ఆర్థిక అస్వస్థతనే అనుభవించిందన్న చేదు వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను అసమగ్ర అమలు వంటి చర్యలు దేశ ఆర్థిక పురోగతిని నిరుత్సాహపరిచిన మాట వాస్తవం. కరోనా కల్లోలం మధ్యనే అపూర్వ వేగాన్ని పుంజుకున్న సంస్కరణల వల్ల కూడా ఎటువంటి సత్ఫలితాలు కలుగుతున్న సూచనలు లేవు. కరోనా కాలంలో చతికిలబడిపోయిన వివిధ ఉత్పాదక రంగాలకు భారీగా ప్రకటించానని ప్రభుత్వం చెప్పుకున్న ఉద్దీపన పథకాల ప్రభావమూ లేదు. ఎప్పటికీ సామాజిక, రాజకీయ వివాదాలే తప్ప ఆర్థిక రంగంలో మాత్రం అడుగులు వడివడిగా ముందుకు పడుతున్న దాఖలాలు కరువు.
మన పొరుగునున్న చైనా విదేశీ వాణిజ్యంలో గణనీయమైన అభివృద్ధిని సాధించిన ఏకైక దేశంగా గుర్తింపు పొందితే మనం ఆ రంగంలో నత్తను కూడా మరిపిస్తున్నాము. 2020 డిసెంబర్‌లో మన ఎగుమతులు అత్యంత స్వల్పంగా పెరగగా, దిగుమతులు మాత్రం 7.6 శాతం ఎగబాకాయి. 2019 డిసెంబర్‌లో మన వాణిజ్య ఎగుమతులు 27.1 బిలియన్ డాలర్లుగా నమోదు కాగా, 2020 డిసెంబర్‌లో అది 27.2 బిలియన్ డాలర్లకు మాత్రమే చేరుకున్నది.2020 ఏప్రిల్ డిసెంబర్ కాలంలో దేశ ఎగుమతులు 12.7 శాతం పడిపోడం గమనించవలసిన అంశం. ఆత్మనిర్భర్, మేకిన్ ఇండియా వంటి గొప్ప ఆశయాల క్రియాశూన్యత ఇందులో వెల్లడవుతున్నది. భారత ఆర్థిక పరిస్థితి ఇంకా నీరసంగానే ఉందని అమెరికా బ్రోకరేజీ సంస్థ బోఫా సెక్యూరిటీస్ తాజాగా జోస్యం చెప్పింది. ఈ ఏడాది వృద్ధి క్షీణత 7.7 శాతం వద్ద ఆగుతుందని మన ప్రభుత్వం భావిస్తున్నది. ఆ తర్వాత బాగా పుంజుకుంటుందని కూడా విశ్వసిస్తున్నది.
అయితే అందుకోసం తీసుకోదలచిన చర్యలేమిటి అనేది ఇంత వరకు స్పష్టం కావడం లేదు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెలాఖరులో ప్రవేశపెట్టే 2021-22 బడ్జెట్‌లో ఎటువంటి సంకేతాలు ఉంటాయో చూడాలి. అవి ఏవిధంగా ఉన్నప్పటికీ సమ్మిళిత అభివృద్ధి మార్గం పట్టాలి. అంటే ప్రజల భాగస్వామ్యంతో కూడిన ఆర్థిక కార్యకలాపాలను బాగా అమలు జరిపితేగాని వృద్ధి పుంజుకోడం సాధారణ జనం క్షేమంగా ఉండడం అనే రెండు లక్షాలు సాధ్యం కావు. ప్రభుత్వ ఆర్థిక వ్యూహకర్తలు, కీలక నిర్ణేతలు ఈ ఒక్క అంశాన్నే పక్కన పెడుతున్నారనిపిస్తున్నది. ప్రైవేటు రంగానికి ప్రాధాన్యాన్ని అపరిమితంగా పెంచడం అనే ఏకైక మంత్రం ద్వారానే దేశాన్ని బాగు చేయొచ్చనే నిశ్చితాభిప్రాయంలో వారు ఉన్నట్టు బోధపడుతున్నది. ఒకవైపు బ్యాంకులు సహా దేశ సకల ఆర్థిక సౌష్టవాలను ప్రైవేటు కార్పొరేట్ శక్తులు స్వప్రయోజనాలకు వాడుకుంటూ జాతి సౌభాగ్యాన్ని నిర్లక్షం చేస్తున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఆర్థిక రంగం మీద వాటి పట్టు మరింత బిగుసుకోకుండా చూడవలసిన బాధ్యతను పాలకులు గుర్తించడం లేదనిపిస్తున్నది.
దీని వల్ల ప్రధాని మోడీ ప్రతిష్ఠ కూడా రోజురోజుకీ మరింతగా మసకబారుతున్నది. వ్యక్తిగతంగా ఆయన అవినీతి మకిలి అణుమాత్రమైనా అంటనివాడైనప్పటికీ దేశాన్ని మూలమట్టంగా కబళించి వేసే శక్తుల ఏజెంటుగా పని చేస్తున్నారనే అభిప్రాయం బలపడుతున్నది. వేలాది మంది రైతులు 55 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఎముకలు కొరికే చలిలో నిరవధిక నిరసనోద్యమం చేస్తున్నా వారి డిమాండ్‌ను ఆమోదించే ప్రసక్తే లేదంటూ ప్రధాని ఎందుకోసం, ఎవరి కోసం పట్టుసడలని వైఖరిని అవలంబిస్తున్నారు అనే ప్రశ్న మెజారిటీ ప్రజలను వేధిస్తున్నది. దేశ ఆర్థిక వ్యవస్థను వచ్చే ఏడాది మార్చి నాటికైనా మెరుగు పరుచుకొని గత ఏడాది మార్చిలో రికార్డయిన 8.7 శాతం వృద్ధిని తిరిగి సాధించుకోవాలని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ డాక్టర్ సి రంగరాజన్ చేసిన సూచన గమనించదగినది. అందుకు అనుగుణంగా వచ్చే బడ్జెట్ ప్రాధాన్యాలు ఉండాలని ఆయన అంటున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఖర్చు బాగా పెరగాలని, మౌలిక సదుపాయాల రంగం కింద ఎక్కువగా నిధులు వెచ్చించి ప్రభుత్వ ఆస్తులను పెంచాలని ఆయన అభిప్రాయపడుతున్నారు.
అందువల్ల 15- 59 ఏళ్ల మధ్యలో ఉన్న 62 శాతం జనాభాకు ఉపాధులు, ఉద్యోగాలు విశేషంగా లభించి వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. అది ఒక్కటే మన ఆర్థిక వృద్ధి రేటును పెంచగలుగుతుంది. అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టాన్ని అమలు చేసి ఆ కార్మికులందరి వివరాలనూ సేకరించి వారికి ఆయా యాజమాన్యాల చేత గృహ వసతి వంటివి కల్పించాలని రంగరాజన్ చేసిన సూచన గమనించదగినది. అలా చేసి మనకున్న అరుదైన మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలన్న హితాన్ని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలి.