Home ఎడిటోరియల్ మహిళల అభద్రతలో టాప్

మహిళల అభద్రతలో టాప్

Article about Modi china tour

మహిళలకు భద్రత విషయంలో అత్యంత దారుణమైన పరిస్థితులున్న 10 దేశాల్లో భారత్ అత్యంత ప్రమాదకరమైన దేశంగా ఉందని థాంప్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ సేకరించిన నిపుణుల అభిప్రాయాలు నిర్ధారించాయి. ఆఫ్ఘనిస్థాన్, సిరియా, సోమాలియా, సౌదీ అరేబియా వరుసగా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఎమెన్, నైజీరియా, అమెరికా ఆ వరుస క్రమంలో 6 నుంచి 10 స్థానాల్లో ఉన్నాయి. మహిళలకు ఎన్నో స్వేచ్ఛలు, అవకాశాలు, హక్కులున్న భారత్‌వంటి ప్రజాస్వామ్య దేశం మహిళల అభద్రతలో అత్యంత ప్రమాదకర దేశంగా నీచమైన టాప్ ర్యాంక్ పొందటం బాధాకరం. దాన్ని వాస్తవ విరుద్ధమైన సర్వేగా కొట్టి పారేయటం సులభం. దాంతో విభేదిం చినా, 2011 నాటి సర్వేలో నాల్గవ స్థానం నుంచి ఎందుకు దిగజారేమో నిరావేశంగా ఆలోచించాలి. ఇది విస్తృతమైన శాంపుల్‌తో సర్వే కాదు.ఈ ఏడాది మార్చి 26నుంచి మే 4 మధ్య ప్రపంచ వ్యాప్తంగా 548 మంది నిపుణులను ఆన్‌లైన్, ఫోన్‌ద్వారా సంప్రదించివారి అభిప్రాయాలు తీసుకున్నారు. సహాయక చర్యల నిపుణులు, విద్యావేత్తలు, ఆరోగ్య రక్షణ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, విధాన నిర్ణేతలు, సామాజిక అంశాలపై వ్యాఖ్యాతలు ఆ నిపుణుల్లో ఉన్నారు. సంధించిన ప్రశ్నలు ఐరాసలో సభ్యత్వమున్న 193 దేశాల్లో ఏ ఐదు మహిళలకు అత్యంత ప్రమాదకరమైనవి?మహిళలకు సంబంధించి ఆరోగ్య పరిరక్షణ, ఆర్థి క వనరులు, సాంస్కృతిక, సాంప్రదాయక విధానాలు, లైంగిక, లైంగికేతర హింస, వేధింపులు, వ్యభిచారంలోకి రవాణా వంటి అంశాల్లో అత్యంత గడ్డు పరిస్థితులున్న దేశమేదీ?
పై అంశాలకు సంబంధించి మూడు విషయాల్లో భారత్ అత్యంత ప్రమాదకర దేశం ర్యాంక్ పొందింది. అవి లైంగిక హింస ఇక్కట్లు, మహిళలపై వేధింపులు; సాంస్కృతిక, సాంప్రదాయక ఆచారాల నుంచి మహిళలు ఎదుర్కొంటున్న ప్రమాదం; నిర్బంధ శ్రమ, లైంగిక బానిసత్వం, గృహ హింస సహా వ్యభిచార వృత్తిలోకి మహిళలను ఎక్కువగా తరలించే ప్రమాదం.
2012లో నిర్భయపై అత్యాచారం, హత్య ఘోరం తదుపరి చట్టాన్ని కఠినతరం చేసి రేపిస్టులకు మరణ శిక్షను గరిష్ఠ శిక్షగా నిర్ణయించినా మహిళలపై అత్యాచారాలు తగ్గకపోగా పెరుగుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. 200716 మధ్య కాలంలో మహిళలపై నేరాలు 83 శాతం పెరిగినట్లు ప్రభుత్వ సమాచారమే తెలుపుతోంది. గంటకు నాలుగు అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళల అభద్రతలో మరో ముఖ్యకోణం సాంస్కృతిక, సాంప్రదాయక అణచివేతలు. బాల్య వివాహాలను చట్టం నిషేధించినా యథావిధిగా జరుగుతున్నాయి. చదువుకు, వివాహానికి, ఉద్యోగానికీ స్వేచ్ఛ బహు పరిమితం. ఆడ పిండాల గర్భ విచ్ఛిత్తికి తలొగ్గవలసిందే, ఆర్థిక స్వేచ్ఛ లేమి. ఇష్టం లేకున్నా భర్త కామవాంఛ తీర్చవలసిందే. ఇదే లైంగిక బానిసత్వం. కులాంతర, మతాంతర వివాహం చేసుకుంటే పరువు పేరుతో హత్యలు పెరుగుతున్నాయి. ఇవి ప్రధానంగా పితృస్వామిక సమాజ లక్షణం నుండి ఉత్పన్నమవుతున్న అరాచకాలు, అత్యాచారాలు. ప్రేమించనందుకు లేదా పెళ్లికి ఒప్పుకోనందుకు యువతులపై యాసిడ్ దాడులు, హత్యలు జరుగుతున్నాయి. ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించి అశ్లీల చిత్రాలను పోస్ట్ చేసి బెదిరించి ఆడవారిని లొంగదీసుకునే ప్రయత్నాలు దిగజారుతున్న సాంస్కృతిక విలువలకు నిదర్శనం. ఉద్యోగాల్లోనో, వ్యాపారాల్లోనో మహిళకు లబ్ది కూర్చటానికి ప్రతిఫలంగా లైంగిక సుఖానికై ఒత్తిడి విస్తరిస్తున్న అవినీతి. కాబట్టి కుటుంబం నుంచి సమాజం వరకు అన్ని స్థాయిల్లో మహిళలకు భద్రత పెరగాలంటే ఆమెను ముందుగా తోటి మనిషిగా చూసే సంస్కారం పెరగాలి. మూఢ విశ్వాసాలు, సాంస్కృతిక అణచివేతలకు వ్యతిరేకంగా మహిళ చైతన్యం పొందాలి. పురుషునివలె తన శరీరానికి, మనసుకు, మేధకు తానే బాధ్యురాలినని మహిళ భావించటమే కాదు, అందు కొరకు పోరాటాలు చేయనిదే పరిస్థితులు మారవు. ‘స్త్రీ నిర్భయంగా అర్ధరాత్రి నడిరోడ్డుపై తిరగగలిగినపుడే నిజమైన స్వాతంత్య్రం’ అన్నారు గాంధీజీ.
‘నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ అని స్త్రీని కట్టడి చేశాడు మనువు. ఈ సమాజం మనువు భావాలను తిరస్కరించగలిగినపుడే స్త్రీ స్వేచ్ఛ, పురుష స్త్రీ సమానత్వం లభిస్తాయి.