Saturday, April 20, 2024

ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు

- Advertisement -
- Advertisement -

IndiGo, AirAsia flights came face to face Jan 29: Report

తృటిలో తప్పిన ప్రమాదంపై ఎఎఐబి దర్యాప్తు నివేదిక

ముంబై : జనవరి 29 న ఎయిర్ ఏషియా, ఇండిగో విమానాలు ముంబై గగనతలంలో ఎదురెదురుగా చాలా దగ్గరకు వచ్చినా తర్వాత అప్రమత్తం కావడంతో అవి ఢీకొనే ప్రమాదం తప్పింది. ఈ సంఘటనకు సంబంధించిన నివేదికను ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఎఎఐబి) ఇటీవల విడుదల చేసింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పరిస్థితుల అవగాహన లోపం తోనే ఈ సంఘటన ఏర్పడిందని నివేదిక వివరించింది. జనవరి 29న ఎయిర్ ఏషియాకు చెందిన అహ్మదాబాద్ చెన్నై విమానం, ఇండిగోకు చెందిన బెంగళూరువడోదర విమానం ముంబై గగన తలంలో ఎదురెదురుగా చాలా దగ్గరకు వచ్చాయి. ఇవి 8 కిమీ దూరంలో ఉండగాఇండిగో విమానం 38,000 అడుగుల ఎత్తు లోను, ఎయిర్ ఏషియా విమానం 38,008 అడుగుల ఎత్తు లోను ఎదురెదురుగా ఉన్నాయి. ఆ రెండు విమానాల మధ్య దూరం 6.5 కిమీ దూరం ఉండగా, ఎయిర్ ఏషియా విమానం లోని ఆటోమేషన్ వ్యవస్థ పైలట్లను హెచ్చరించింది. విమానాన్ని మరింత ఎత్తు లోకి తీసుకెళ్లాలని అప్రమత్తం చేసింది. దీంతో ఆ విమానం 38,396 అడుగుల ఎత్తుకు చేరడంతో ఆ రెండూ ఢీకొనే ప్రమాదం తప్పింది.

అయితే ఆ రెండు విమానాల పొజిషన్‌ను అంచనా వేయడంలో ముంబై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ విఫలమయ్యారని ఆ నివేదిక పేర్కొంది. ఆటోమేటిక్ సిస్టమ్ హెచ్చరించినప్పటికీ రెండు విమానాలను హెచ్చరించడంలో కంట్రోలర్ నిర్లక్షం వహించారని ఆరోపించింది. సాధారణంగా అహ్మదాబాద్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే విమానాలు భావనగర్ మీదుగా ప్రయాణిస్తుంటాయి. అయితే ఆరోజున ఎయిర్ ఏషియా విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్ మార్గంలో ప్రయాణించింది. ఎయిర్ ఏషియా విమానం తన మార్గాన్ని మార్చుకోవడంతో అదే మార్గంలో వస్తున్న ఇండిగో విమానం సమీపానికి వచ్చింది. చివరకు ఎయిర్ ఏషియా విమానం లోని వ్యవస్థ హెచ్చరించడంతో ఎత్తు పెంచడంతో ఆ రెండు విమానాలు 300 మీటర్ల ఎత్తు, 500 మీటర్ల సమీపంలో క్రాస్ అయ్యాయి.

ఎయిర్ ఏషియా విమానం సాధారణ రూటు లోనే ప్రయాణిస్తున్నదని కంట్రోలర్ భావించడం వల్లనే ఇది జరిగి ఉంటుందని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తన నివేదికలో పేర్కొంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు పరిస్థితుల బట్టి అవగాహన కలిగి ఉండడం, ఆటోమేషన్ వ్యవస్థ నుంచి వచ్చే హెచ్చరికల ప్రాముఖ్యతను గుర్తించేలా సరైన శిక్షణ అవసరమని నివేదిక సిఫార్సు చేసింది. లాక్‌డౌన్ సమయంలో విమానాల ట్రాఫిక్ చాలా తక్కువగా ఉన్నందున కొన్ని మార్గదర్శకాలు అనుసరించక పోవడం పరిపాటి అయిందని, అందువల్ల ఇప్పుడు మళ్లీ విమానాల ట్రాఫిక్ రద్దీని తిరిగి సమీక్షించుకోవాలని నివేదిక సిఫార్సు చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News