Thursday, December 1, 2022

తెలంగాణ రాష్ట్రంలో చేనేత

- Advertisement -

indirectly employment to millions of people in Telangana
తెలంగాణ రాష్ట్రంలో చేనేత లక్షలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నది. రెండున్నర వేల ఏళ్ళుగా చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందుతూ సంస్కృతి, నాగరికతల్లో భాగమవుతూ వస్తున్నది. తెలంగాణ చేనేత వృత్తి దెబ్బతినడం, బట్టల మిల్లులు ఉత్పత్తి రంగంలో దూసుకురావడంతో ఉన్న ఊరు వదిలి ముంబాయి, అహ్మద్‌నగర్, సూరత్, పూనా, షోలాపూర్, భీవండి వంటి నగరాలకు, ప్రాంతాలకు వలసలు సాగించారు. ఆయా నగరాల, పట్టణాల నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. సామాజికంగా, రాజకీయంగా కూడా ఆయా ప్రాంతాల్లో ఎదుగుతూ వచ్చారు. దేశానికి కోట్లాది సంపద సృష్టించి, లక్షలాది కార్మికులు కార్మికులుగానే మిగిలిపోయారు. అందులో మా నాన్న ఒకరు. 1955లో మా నాన్న చనిపోయేనాటికి ముంబాయి నుండి రోగాలతో ఇల్లు చేరి సరియైన వైద్యం లేక, రోగమేంటో నిర్ధారణ కాకుండానే చనిపోయారు. ఇలా 150 ఏళ్ళుగా వృత్తిపరమైన రోగాలతో, వలసలవల్ల తిండితిప్పలు, నిద్ర, వసతి సంబంధితంగా సంక్రమించే రోగాలతో లక్షలాది మంది అర్ధాంతరంగా, అల్పాయుష్కులుగా కాలం తీరిపోయారు. కనపడని దూది గాలిలో చేరి, నోటిద్వారా, ముక్కుద్వారా శరీరంలో చేరి అనేక రోగాల బారినపడ్డారు.
ప్రాచీన కాలంలో చేనేత అంటే పత్తిని దూది చేసి ఏకులు చేసి, ఏకులతో దారం వడికి నూలు చేసుకొని ఆ నూలుతో పడుగు ఆసుపోసి, గంజితో పోగులను సరిచేసి, నాడెను చేతితో అటూ, ఇటూ వేస్తూ, కాళ్ళతో తొక్కుతూ బట్టలు నేసేవారు. ప్రస్తుతం గొంగళ్ళు నేస్తున్న పద్ధతిలోనే వెనుకట బట్టలు కూడా నేసేవారు. పవర్‌లూవ్‌ులవలె షట్టర్ మగ్గాలను అభివృద్ధి పరచి, కొత్త మగ్గాలు రావడంతో చేనేతకు ఒక మలుపు. నూలు మిల్లుల నూలుతో బట్టలు నేయడం చేనేతలో మరో మలుపు. ప్రస్తుతం వెనుకటి చేనేతను ఖాదీ బట్టలు అని పిలుస్తున్నాము. ఇప్పుడు నేస్తున్న చేనేత బట్టలు మిల్లు నూలుతో చేతి మగ్గంతో నేస్తున్న బట్టలు. రంగుల అద్దకం చేతితోనే చేస్తున్న విధానం నేటికీ కొనసాగుతున్నది.

రంగులు పారిశ్రామిక ఉత్పత్తిగా, మార్కెట్‌లోకి రాకముందు చెట్ల పసర్లతో, రసాయనాలతో స్వయంగా ప్రకృతిసిద్ధ రంగులు తయారు చేసుకునేవారు. కాషాయం రంగు అన్నిటికన్నా ప్రాచీనమైనది. రంగు అద్దడానికి సుళువైనది. కొన్ని రంగులు ఉడకబెట్టి నూలును ముంచితే స్థిరంగా ఉంటాయి. కొన్ని రంగులు కేవలం పచ్చినీళ్ళతోనే స్థిరంగా ఉంటాయి. రంగుల కలయికతో కొత్త రంగులు తయారు చేసేవారు. ఆకాశం రంగు, బీరపువ్వు రంగు కలిపి అద్దితే ఆకుపచ్చ రంగు బట్టలు తయారవుతాయి. ఇలా అనేక మిశ్రమాలతో అనేకరంగులు తయారు చేసేవారు. పారిశ్రామికంగా ఉత్పత్తి చేస్తున్న రంగంలో కూడా ఇలా మిశ్రమం చేసి వాడుతున్నారు. గ్లౌజులు లేకుండా చేతి అద్దకంతో రంగులు అద్దేవారి చేతులు జీవితమంతా రంగులు పూసుకున్నట్లుగా ఉండేవి.

గ్రామీణ జీవితంలో మిల్లు బట్టలు ప్రవేశించక ముందు చేనేత విరివిగా వాడేవారు. మా తాత, మా మేనమామ చేనేత బట్టలు నేసేవారు. 1960లలో 20 నెంబర్, 30 నెంబర్, 32 నెంబర్, 40 నెంబర్, 60 నెంబర్ చీరలు, ధోవతులు నేసేవారు. ఎంత నెంబర్ పెరిగితే అంత సన్నం, అన్ని పోగులు ఎక్కువ ఉంటాయి. 120 నెంబర్ సన్న బట్టలు కూడా నేసేవారు. కాయాకష్టం చేసే పల్లెకారు జనం దొడ్డుబట్టలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. 20, 30 నెంబరు చీరలు, ధోతులు మూటగట్టి భుజాన వేసుకొని మా తాత పది, పన్నెండు కిలోమీటర్లు నడిచి పల్లెటూర్లలో అమ్మేవాడు. పంటలమీద వారు డబ్బులో, ధాన్యమో ఇచ్చేవారు. సైకిళ్ళు రావడంతో మా తాత భుజాన వేసుకొని అమ్మే మూటల కాలం తీరిపోయి వెనుకబడిపోయారు. ఆ తర్వాత సైకిళ్ళకు, టివిఎస్ మోపెడ్‌లు తోడయ్యాయి. ప్రస్తుతం పెద్ద ఊర్లలో వారానికి ఒకరోజు సాగుతున్న అంగళ్ళలో బట్టల షాపులు కూడా పెడుతుంటారు. కరీంనగర్‌లో ప్రత్యేకంగా నేత జార్ కొనసాగుతున్నది. నల్లగొండలో, హైదరాబాద్‌లో నేత వ్యాపారస్తులు ప్రత్యేకంగా షాపింగ్ కాంప్లెక్స్‌లు కట్టి నిర్వహిస్తున్నారు. వీటిల్లో చేనేతతోపాటు, అన్నిరకాల బట్టలు, రెడీమేడ్ కూడా అమ్ముతున్నారు. ఇది ఇలా ఉండగా చేనేత కేవలం మహిళలు పోషించే పరిశ్రమగా మారిపోయిందా అని అనిపిస్తుంది. ఇటీవల ఐటి, చేనేత శాఖామంత్రి కెటిఆర్ ప్రతి సోమవారం చేనేత ధరించండి అని ఇచ్చిన పిలుపు లక్షలాదిమందిని కదిలించింది. ఆలోచింపజేసింది. అయితే చేనేత సహకార దుకాణాల్లో అందుకు అనువైన, సరిపడే బట్టలు అందుబాటులో లేకపోవడం విచారకరం. హైదరాబాద్‌లోని నారాయణగూడలోని టిస్కో చేనేత కేంద్ర కార్యాలయంలోని షాపును మూడుసార్లు సందర్శించినప్పటికీ అవసరమైన బట్టలు దొరకకపోవడం స్వీయ అనుభవం.

ఆధునిక నైపుణ్యాలు, అవసరాలు, డిజైన్లు, రెడీమేడ్ ఉత్పత్తులు, అందుబాటు ధరలు మొదలైనవి చేనేత మార్కెట్ విస్తరణలో ముఖ్యాంశాలు. తెలంగాణాలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో డిజైన్లు, నైపుణ్యాలు ప్రాచుర్యం పొందాయి. కమలాపూర్ వావిలాల ఖాదీ, మెట్‌పల్లి ఖాదీ, గద్వాల చీరలు, పోచంపల్లి చీరలు, దుబ్బాక దుప్పట్లు, బతికేపల్లి, గర్షకుర్తి, నారాయణపూర్, చౌటుప్పల్, వరంగల్, సిరిసిల్ల, కొత్తపల్లి, సిద్దిపేట మొదలైన ప్రాంతాల్లోని చేనేత ఉత్పత్తులు ఆయా ఊర్ల పేర్లను ప్రసిద్ధిలోకి తెచ్చాయి. గద్వాల జరీ చీరలు, పోచంపల్లి పట్టుచీరలు వంటి పేర్లతో ఊర్ల పేర్లే బ్రాండ్ నేవ్‌ులుగా ప్రసిద్ధి చెందాయి. అలా ఆయా ఊర్లు కూడా ప్రసిద్ధికెక్కాయి.

ఇటీవల చేనేతకు అనేక సబ్సిడీలు, సౌకర్యాలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం చేనేత మగ్గాల పక్కా లెక్కలు తీసి జియో ట్యాగింగ్ చేయడం జరిగింది. 17 వేల మగ్గాలు మాత్రమే ఉన్నాయని అధికారులు లెక్క తేల్చారు. అయితే అంతకు రెండు రెట్లు, మూడు రెట్లు మగ్గాలు ఉంటాయని పద్మశాలి చేనేత సంఘాల నాయకులు అంటుంటారు. పద్మశాలి చేనేత కులాల జనాభా తెలంగాణాలో 13 లక్షలు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి, ఇంకా తెలంగాణా వాళ్ళమే అనుకునే పద్మశాలి చేనేత కులాలవాళ్ళు 5 లక్షలకు పైగా ఉంటారు. జనాభా లెక్కల విషయంలో ప్రతి కులం తమ జనాభా ఇబ్బడి ముబ్బడిగా ఉంటుందని భావిస్తుంటారు. ప్రచారం చేస్తుంటారు. అవన్నీ లెక్కవేస్తే తెలంగాణా జనాభా మూడున్నర కోట్లకు బదులుగా పది, పన్నెండు కోట్లవుతుంది. ఇదే పద్ధతిలో చేనేత మగ్గాలు ఎక్కువచేసి చెప్తుంటారు. ఇటీవల సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం జిల్ల మహాసభలో తమ పద్మశాలి సామాజిక వర్గంలో 94 శాతం చేనేత వృత్తి, గిట్టుబాటు కాక ఇతర వృత్తుల్లోకి చేరిపోయారని నాలుగు, ఐదు శాతం మాత్రమే చేనేతమీద ఆధారపడి బతుకుతున్నారని స్పష్టంగా చెప్పడం జరిగింది. సిద్దిపేట స్థానిక శాసనసభ్యులు, నీటి పారుదల శాఖామంత్రి హరీష్‌రావు, నేను ఆ సభలో పాల్గొనడం జరిగింది. అదేరోజు సిరిసిల్లలో చేనేత మంత్రి కెటిఆర్ సిరిసిల్లలో పెద్ద ఎత్తున జరిగిన సభలో పాల్గొని అనేక వరాలు ప్రకటించారు.

అయితే చేనేతపై ఆధారపడిన వారికి చేయూతనివ్వడం, పద్మశాలీల్లో ఐదు శాతం జనాభాకు చేయూతనివ్వడమని, మిగతా 90 శాతానికి పైగా గల జనాభా చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ, పాన్‌టేలా, కూరగాయల షాపు, చాయ్ ెటల్, కిరాణా షాపు, సైకిల్ రిపేరు షాపు, మెకానిక్‌లుగా పని చేస్తున్నారని, అందువల్ల చేనేతకే కాకుండా, ప్రత్యేకంగా పద్మశాలీలకు ఇతర రంగాల్లో ఎదగడానికి ప్రత్యేకంగా ప్రణాళికలు చేపట్టాలని ఫెడరేషన్, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. పద్మశాలీల, చేనేత కార్మికుల పిల్లలకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలు నెలకొల్పాలని, డబుల్ బెడ్‌రూం పథకంలో ప్రత్యేకంగా చేనేత వృత్తివారికి ప్రత్యేక బ్లాకులు నిర్మించి ఇవ్వాలని తద్వారా చేనేత కాలనీలుగా రూపొంది చేనేత అభివృద్ధి చెందుతుందని కోరడం జరిగింది.

తెలంగాణాలోని చేనేత వృత్తిలో నూతన నైపుణ్యాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. చేనేత సహకార సంఘాలు అమ్మే బట్టల షాపుల్లో దొరికే బట్టలు చూస్తే యాభై ఏళ్ళు వెనుకున్నామని, పాత షాపులను తిరిగి కొత్తగా తెరిచినట్లు భావన కలుగుతుంది. తమిళనాడులో, ఉత్తరప్రదేశ్ బెనారస్, కర్నాటక బెంగుళూరు, ఈశాన్య రాష్ట్రాల్లో చేనేతలో ప్రత్యేక నైపుణ్యాలు, పోకడలు, ఆధునిక పరికరాల వాడకం పెరిగింది. తమిళనాడు చేనేత నిపుణులు తెలంగాణ చేనేతను చూసి మాకన్నా మీరు ఇరవై ఏళ్ళు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారని, మా ప్రాంతాలను సందర్శించి మీకు అనువైన రీతిలో మీ పరిశ్రమలను అభివృద్ధి పరచుకోవాలని సలహా ఇవ్వడం జరిగింది. ఇటీవల బిసి కమిషన్, బిసి సంక్షేమ శాఖ, ఎంబిసి కార్పొరేషన్ సంయుక్తంగా కర్నాటక, గుజరాత్ రాష్ట్రాలను పర్యటించింది. బట్టలు ఉతికే వృత్తిలో భారీ వాషింగ్ మెషిన్లు, డ్రైయింగ్ మెషిన్ల వాడకాన్ని చూసి రవీంద్రభారతిలో వాటి ప్రదర్శన ఏర్పాటు చేసి, సబ్సిడీపై రజక సంఘాలకు అందించడం జరుగుతున్నది.

పోచంపల్లిలోని స్వామిరామానంద తీర్థ శిక్షణా సంస్థలో ప్రత్యేకంగా కుమ్మరి, మట్టి పాత్రల వృత్తి నైపుణ్యాల శిక్షణ, మేదరి వెదురుబొంగుల నూతన ఉత్పత్తుల, నూతన నైపుణ్యాల శిక్షణ కొనసాగుతున్నది. ఇదేవిధంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లోని చేనేత నైపుణ్యాలను, ఉత్పత్తి సాధనాలను, మార్కెట్‌ను అధ్యయనం చేసి నూతన నైపుణ్యాలను అభివృద్ధి పరచడం, వివిధ ఉత్పత్తుల ద్వారా ప్రజలను ఆకర్షించడం అవసరం.

Related Articles

- Advertisement -

Latest Articles