Home వార్తలు లంకలో ఇండో-పాక్ సిరీస్?

లంకలో ఇండో-పాక్ సిరీస్?

indo-pakదుబాయి : చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌కు శ్రీలంక వేదిక అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి ఇరు దేశాల క్రికెట్ బోర్డు పెద్దలు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు దుబాయిలో ఆదివారం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్, భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌ల మధ్య జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓ ఇరు దేశాల చర్చలు ఫలప్రదంగా జరిగాయని పిసిబి చైర్మన్ షహర్యార్ ఖాన్ పేర్కొనడం దీనికి మరింత బలానిస్తోంది. కాగా, ఈసిరీస్ కు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం వెల్లడికాలేదు. ముందస్తు ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య వచ్చే నెలలో యూఏఈలో క్రికెట్ సిరీస్ జరగాల్సి ఉంది. అయితే ఇరుదేశాల మధ్య నెలకొన్న రాయకీయ పరిస్థితుల నేపథ్యంలో సిరీస్‌పై సందిగ్ధత నెలకొంది. ఈ సిరీస్ ను ఆడటానికి భారత్ కు రావాలని బిసిసిఐ కోరగా పిసిబి తిరస్కరించి, యూఏఈలోనే ఆడాలని పాక్ పట్టుబట్టింది. అయితే యూఏఈలో ఆడటానికి తమకు కొన్ని కొన్ని అడ్డంకులు ఉన్నట్లు బిసిసిఐ పేర్కొనడంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఆమోదయోగ్యమైన, సురక్షితమైన వేదికకోసం అన్వేషించాయి. ఈ సిరీస్ నిర్వహణకు సమయం దగ్గర పడుతుండటంతో శ్రీలంకలో నిర్వహించాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఒకవేళ సిరీస్ జరిగిన పక్షంలో పాక్ తో మూడు వన్డేలు, రెండు ట్వంటీ20లను భారత్ ఆడుతుంది.