Thursday, April 25, 2024

ఇండోనేసియా క్రీడా విషాదం.. బాష్పవాయు షాక్‌లో బాధితులు

- Advertisement -
- Advertisement -

Indonesia sports tragedy

మలంగ్ (ఇండోనేసియా): తూర్పు జావా ప్రాంతంలో మలంగ్ నగరానికి చెందిన అరెమా ఫుట్‌బాల్ క్లబ్ జట్టు ఓటమి పాలు కావడం ఎంతటి విషాదానికి దారి తీసిందో , ఎన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయో తెలిసిందే. ఆనాటి బీభత్స కాండ బాధితుల కళ్ల ముందు ఇంకా కదులుతోంది. ఈ క్రీడా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి వచ్చిన వారు ఆనాటి సంఘటన గురించి హృదయ విదారక అనుభవాలను ఏకరువు పెట్టారు. స్టేడియంలో జనం గుంపును చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. 22 ఏళ్ల యువకుడు డికీ కుర్నియావాన్ బాష్పవాయువు షాక్‌కు గురయ్యాడు. స్టేడియం అంతా బాష్పవాయువు కమ్ముకొస్తుండగా కుర్నియావాన్ తన గర్ల్‌ఫ్రెండ్‌ను పట్టుకుని బయటపడ్డాడు. ముఖంపై గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్టేడియం అంతా గందరగోళంలో ఉండగా పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. అరెమా ఫుట్‌బాల్ టీమ్ అభిమానులు తీవ్ర అసంతృప్తితో తోసుకురావడం, బాష్పవాయువు కమ్ముకుని వస్తుండడంతో తొక్కిసలాట జరగడం అంతా కళ్లారా చూశానని, ఇక చేసేది లేక బయటకు వెళ్లే ద్వారం వద్దనే తన సీటు ఉండడంతో వెంటనే బయటపడగలిగానని చెప్పాడు.

ఆస్పత్రిలో కుర్నియావాన్ బెడ్ పక్కనే మరో బెడ్‌పై చికిత్స పొందుతున్న టీనేజర్ ఫారెల్ పంజీ కూడా అదృష్టవశాత్తు తొక్కిసలాట నుంచి తప్పించుకోగలిగాడు. 16 ఏళ్ల పంజి తన సీటు నుంచి లేచి బయటకు వెళ్లే లోపు బాష్పవాయువు కమ్ముకొచ్చింది. జనం ఒక్కసారి తోసుకురావడంతో తాను కింద పడిపోయానని చెప్పాడు. కొంతసేపు స్పృహ కోల్పోయానని, తెలివి వచ్చేసరికి ఇంకా స్టేడియం లోనే సీటింగ్ ఏరియాలో పడి ఉన్నానని పంజి చెప్పాడు. తరువాత ఇంటికి సురక్షితంగా చేరుకోగలిగాడు. మరునాడు ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. శనివారం నాటి దుర్ఘటన క్లబ్‌పై అభిమానాన్ని ఆపలేదని చెప్పుకొచ్చాడు. మలంగ్ లోని డాక్టర్ సైఫుల్ అన్వర్ జనరల్ ఆస్పత్రిలో బాధితులకు వైద్య సేవలు అందుతున్నాయి. బాధితుల సంబంధీకులు ఆవేదనతో ఆస్పత్రికి ఆదివారం చేరుకుని వాకబు చేయడం ప్రారంభించారు. శవాగారంలో తమ వారిని గుర్తిస్తున్నారు. వారి సమాచారం తెలుసుకొంటున్నారు.

ఈ విషాద సంఘటనలో 323 మంది గాయపడ్డారని, కొందరు ఇంకా విషమ పరిస్థితిలో ఉన్నారని పోలీసులు చెప్పారు. మృతుల్లో 17 మంది పిల్లలు ఉన్నారు. మరో ఏడుగురు పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని మహిళా సాధికారత, పిల్లల సంరక్షణ మంత్రిత్వశాఖ వివరించింది. మృతులకు సోమవారం క్రీడాకారులు, ఇతర అధికారులు శ్రద్ధాంజలి ఘటిస్తారని ఆరేమా చిలియన్ కోచ్ జావియర్ రోకా చెప్పారు. కంజురుహాన్ స్టేడియం బయట సింహం తల ఆకారంతో కూడిన విగ్రహం వద్ద క్రీడాకారుల బృందం నల్లని దుస్తులు ధరించి సమావేశమయ్యారు. అరెమా మద్దతుదారులు కూడా పాల్గొన్నారు. క్రీడాకారులు విగ్రహం చుట్టూ గులాబీ పుష్పాలను వెదజల్లుతుండగా వారంతా బోరున విలపించారు. ఈ విషాదానికి బలైన వారితోపాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారి కుటుంబాలు తమను మన్నించాలని వేడుకోడానికి తాము ఇక్కడకు వచ్చామని రోకా పేర్కొన్నారు. సాసర్ హింస మళ్లీ జరగకూడదని కోరుకున్నారు. తాము శిక్ష పొందుతున్నట్టు భావిస్తున్నామని, ఒక మ్యాచ్ ఫలితం ప్రజల జీవితాల కన్నా విలువైనది కాదని ఆవేదన వెలిబుచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News