Home తాజా వార్తలు కరోనాలోనూ ప్రగతిపథం

కరోనాలోనూ ప్రగతిపథం

Industries And IT Annual Reports Released By KTRహైదరాబాద్ మరో సిలికాన్ వ్యాలీ

ఐటి రంగంలో రెట్టింపు వృద్ధి, పారిశ్రామికంలోనూ పైచేయి

సిఎం కెసిఆర్ దార్శనికతతోనే దేశంలో అగ్రగామిగా తెలంగాణ
గత ఏడాదితో పోల్చితే ఈ సారి ఐటిలో 13 శాతం వృద్ధి
ఏడేళ్లలో రెండింతలు ఉద్యోగ అవకాశాల కల్పన
ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటి విస్తరణ, త్వరలో రామగుండం, సిద్దిపేట, నల్లగొండలోనూ ఐటి టవర్స్
మహబూబ్‌నగర్‌లోని దివిటి ప్రాంతంలో సోలార్ పార్క్
రాష్ట్ర స్థూల ఉత్పత్తి 9.78లక్షల కోట్లు, వ్యవసాయ రంగంలో 20.9 శాతం వృద్ధి నమోదు
ఐటి, పరిశ్రమల వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకుపోతుందని ఐటి, పరిశ్రమలు,పురపాలక శాఖల మంత్రి కె.టి.రామారావు అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఐటి, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి సాధించామని తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో గురువారం పరిశ్రమలు, ఐటి శాఖల వార్షిక నివేదికను మంత్రి కెటిఆర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్, రాష్ట్ర హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్స్ శాఖ కార్యదర్శి శైలజ రామయ్యార్, టిఎస్‌ఐఐసి ఎండి నరసింహారెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ కె.మాణిక్ రాజ్, మీసేవా, టిఎస్‌టిఎస్ కమిషనర్ జి.టి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, పారదర్శకత కోసమే వార్షిక నివేదిక విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సిఎం కెసిఆర్ విధివిధానాలు, సమిష్టి కృషితోనే ఈ రంగాల్లో అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. సిఎం దార్శనికతతో దేశంలో అగ్రగామిగా ఎదుగుతున్నామని కెటిఆర్ వివరించారు. 2019- 20లో రాష్ట్ర ఐటి ఎగుమవుతులు రూ.1.28 లక్షల కోట్లు అని, అదే 2020- 21లో రూ.1.45 లక్షల కోట్లు అని తెలిపారు. ఐటిలో దేశంతో పోలిస్తే రెట్టింపు వృద్ధి సాధించామని అన్నారు. ఐదేళ్లుగా తన శాఖల వార్షిక నివేదికలను కెటిఆర్ విడుదల చేస్తున్నారు.
రాష్ట్ర ఉద్యోగిత మెరుగ్గా ఉంది
జాతీయ స్థాయిలో పోలిస్తే రాష్ట్ర ఉద్యోగిత మెరుగ్గా ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 3.23 లక్షల మంది ఐటి ఉద్యోగులు ఉన్నారని, ఏడేళ్ల తర్వాత ఆ సంఖ్య రెట్టింపు అయిందని వివరించారు. రాష్ట్ర ఐటి రంగం 6.28 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పిస్తోందని తెలిపారు. 20 లక్షల మందికి పైగా ఐటి రంగంపై ఆధారపడి పనిచేస్తున్నారని చెప్పారు.
సమర్ధ బృందం పని చేస్తోంది
క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఐటి, పారిశ్రామిక రంగాలు సాధించిన పురోగతిని వేడుకగా చేసుకోవాలని మంత్రి కెటిఆర్ అన్నారు. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో సాదాసీదాగా జరుపుతున్నామని తెలిపారు. ఐటి, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూస్తున్నారంటే తనతో పాటు సమర్థ బృందం కృషి ఫలితమే అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఐటిని రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించే కార్యాచరణతో ముందుకెళ్తున్నామని చెప్పారు. టి హబ్ ఫేజ్-2 భవనాన్ని తర్వలో ప్రారంభిస్తామని తెలిపారు. టీ వర్క్‌ను ఈ ఏడా లాంఛనంగా ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. 2020-21లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9.78 లక్షల కోట్లు అని, వ్యవసాయ రంగంలో 20.9 శాతం వృద్ధి సాధించామని వెల్లడించారు. దేశ తలసరి ఆదాయం రూ.1,27,768 కాగా, రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,27,145 అని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రరమలను కేంద్రం ఆదుకోవాలని కోరారు. రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ అమలు చేయాలని అన్నారు.
ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటి విస్తరణ
ఫేస్‌బుక్, టెక్ మహీంద్ర వంటి దిగ్గజ సంస్థలు నగరంలో విస్తరిస్తున్నాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఫార్చూన్ 500 కంపెనీల్లో స్థానం పొందిన 20కి పైగా కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలోని ద్వితీయ నగరాలకు ఐటి విస్తరణలో భాగంగా రామగుండం, సిద్దిపేట, నల్గొండలోనూ త్వరలో ఐటి టవర్స్ ఏర్పాటు చేసి రాబోయే రెండేళ్లలో ప్రారంభిస్తామని తెలిపారు. దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్స్ రంగంలో రూ.4 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ దివిటి ప్రాంతంలో త్వరలో సోలార్ పార్క్‌కు శంకుస్థాపక చేస్తామని మంత్రి కెటిఆర్ అన్నారు.
ఏరోస్పేస్ సిటీస్ కేటగిరీలో హైదరాబాద్‌కు తొలి స్థానం
ఎఫ్‌డిఐ ఏరోస్పేస్ సిటీస్ ఆఫ్ ఫ్యూచర్ 2020- 21 ర్యాంకింగ్స్‌లో వ్యయ సమర్ధత విషయంలో టాప్ 10 ఏరోస్పేస్ సిటీస్ కేటగిరీలో హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచిందని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. జాతీయస్థాయిలో 2019 ఏడాదికిగానూ సులభతర వాణిజ్యంలో తెలంగాణ మూడవ స్థానంలో నిలిచిందని చెప్పారు. అదేవిధంగా నీతి ఆయోగ్ విడుదల చేసిన ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ రిపోర్ట్‌లో ప్రధాన రాష్ట్రాల కేటగిరీలో రాష్ట్రానికి నాలుగవ స్థానం దక్కినట్లు తెలిపారు. అలాగే ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్(ఐటిపిఒ) 28వ కన్వర్జెన్స్ ఇండియా 2021 ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, 6వ స్మార్ట్ సిటీస్ ఇండియా ఎక్స్‌పోలో హైదరాబాద్‌కు మూడు స్మార్ట్ సిటీస్ ఇండియా(ఎస్‌టిఐ) అవార్డులు దక్కాయని పేర్కొన్నారు. గ్రీన్ అండ్ క్లీన్ సిటీ, స్మార్ట్ వేస్ట్ డిస్పోజల్, స్టార్టప్ కేటగిరీల్లో ఈ అవార్డులు వచ్చినట్లు తెలిపారు.