Friday, April 19, 2024

ఆన్‌లైన్ విద్యలో అసమానతలు!

- Advertisement -
- Advertisement -

Inequalities in Online Education!

తెలంగాణ ప్రభుత్వం జూన్ 15 వరకు విద్యా సంస్థలకు వేసవి సెలవులు కొనసాగించింది. జూన్ నెల మధ్య నుండి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది చివరి వరకూ ఆన్‌లైన్ బోధనే కొనసాగే అవకాశం ఉంది.
కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఆన్‌లైన్ తరగతులు ఆవశ్యకంగానూ, ఉన్నంతలో మెరుగైన ప్రత్యామ్నాయంగానూ కనిపిస్తున్నాయి. అయితే కోట్లాది మంది విద్యార్థులకు ఇంకా డిజిటల్ పరికరాలు, ఇంటర్నెట్ సదుపాయం వంటివి అందుబాటులో లేకపోవడంతో విద్యా వ్యవస్థలో ఇప్పటికే ఉన్న అసమానతలు మరింత పెరిగాయి. అసమానతలతో పాటు విద్యా ప్రమాణాలు, నాణ్యత వంటి విషయాలలో ఇప్పటికీ ఎన్నో సమస్యలు ఉన్నాయి.

కొవిడ్‌కు ముందు పరిస్థితిని ఒకసారి గమనిస్తే ప్రథం అనే స్వచ్ఛంద సంస్థ 2019లో దేశంలోని కొన్ని గ్రామీణ జిల్లాలలో నిర్వహించిన యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ సర్వే ప్రకారం ఒకటవ తరగతి పిల్లలలో కేవలం 16% మంది మాత్రమే తమ తరగతి పాఠ్య పుస్తకాలను చదువగలుగుతున్నారు. కేవలం 40% మంది పిల్లలు మాత్రమే అక్షరాలను గుర్తించగలిగే పరిస్థితిలో ఉన్నారు. గత ఏడాది కాలంగా బడులు మూతపడి ఉండడంతో పిల్లల అభ్యాస స్థాయిలు మరింత దిగజారాయి అని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. మొన్న ఏప్రిల్ నెలలో లాన్సెట్ మెడికల్ జర్నల్ కొవిడ్‌పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ విద్యార్థులపై కొవిడ్ ప్రభావంపై నిర్వహించిన అధ్యయనం అనేక ఆందోళనకరమైన అంశాలను వెల్లడించింది.

నాలుగు రాష్ట్రాలలో నలభై నాలుగు జిల్లాలలో నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం ప్రాథమిక స్థాయి విద్యార్థులలో 92% మంది తాము గత సంవత్సరం నేర్చుకున్న భాషా సామర్ధ్యాలను మర్చిపోయారు. ముందు సంవత్సరంతో పోలిస్తే 82% మంది పిల్లలు ఏదో ఒక గణిత సామర్ధ్యాన్ని కోల్పోయారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులలో అధిక శాతం తర్వాత తరగతి పాఠాలను అర్ధం చేసుకునేందుకు తగిన ప్రాథమిక నైపుణ్యాలను కోల్పోయారు.

ఇందుకు కారణాలు తెలుసుకోవడం పెద్దగా కష్టమైన విషయమేమీ కాదు. దేశ వ్యాప్తంగా 24 % కుటుంబాలకు ఇంటర్నెట్ సదుపాయం లేదు. పట్టణ ప్రాంతాలలో 42% కుటుంబాలకు ఇంటర్నెట్ సదుపాయం ఉండగా, గ్రామీణ ప్రాంతాలలో 15% కుటుంబాలు మాత్రమే ఈ సదుపాయం కలిగి ఉన్నాయి. డిజిటల్ అంతరం చాలా ఎక్కువగా ఉంది. పేద కుటుంబాలలో కేవలం 2.7% మందికి మాత్రమే కంప్యూటర్ అందుబాటులో ఉండగా, 8.9% మందికి మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉంది. సంస్థాగత పరంగా చూసిన డిజిటల్ బోధనకు తగిన సంసిద్ధత లేదనే చెప్పాలి. దేశ వ్యాప్తంగా 12 లక్షల ప్రభుత్వ పాఠశాలలకు, 4 లక్షల చిన్న స్థాయి ప్రైవేట్ పాఠశాలలకు డిజిటల్ ఆధారిత బోధనను నిర్వహించేందుకు తగిన మౌలిక సదుపాయాలు కానీ, ఆర్ధిక వనరులు కానీ లేవు.

ఈ నేపథ్యంలో పిల్లల అభ్యాస స్థాయి మళ్ళీ మెరుగుపడాలంటే బడులు తెరిచాక నేరుగా తరువాత తరగతులు ప్రారంభించే బదులు కొన్నాళ్ళ పాటు రెమెడీయల్ తరగతులు నిర్వహించాల్సి ఉంటుందని ఈ టాస్క్ ఫోర్స్ అభిప్రాయ పడింది.
అభ్యాస స్థాయి విషయం పక్కన పెడితే బడుల మూసివేత పిల్లల ఆరోగ్యం, పోషకాహార స్థాయిపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. పిల్లలు పుట్టిన దగ్గర నుండి అత్యంత కీలకమైన తొలి ఎనిమిది వేల రోజులు వారి ఎదుగుదలకు కావలసిన పోషకాహారాన్ని అందించడంలో అంగన్వాడీలు, పాఠశాలలే ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. దేశంలోని 12 లక్షల పాఠశాలల్లో దాదాపు 12 కోట్ల మంది పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం అందుబాటులో లేకుండా పోయింది. ఇందులో కనీసం పదకొండున్నర లక్షల మంది పిల్లలు తీవ్ర పోషకాహార లేమితో బాధపడే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి.

పోషకాహారాన్ని ఇంటి వద్దనే అందించే ఏర్పాట్లు చేశామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ఆక్స్ఫామ్ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఈ పిల్లలలో కేవలం 35% మందికే ఇది అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది. మిగిలిన 65%లో 8 % మంది పిల్లలకు వండిన ఆహారం ఇంటివద్దకు సరఫరా అవుతుండగా, మిగిలిన 53% పిల్లలకు నిత్యావసరాల రూపంలో అందిస్తున్నారు. ఇక లాక్ డౌన్ వలన పెద్ద సంఖ్యలో స్వస్థలాల బాట పట్టిన వలస కార్మికుల పిల్లలలో ఎంతమంది తిరిగి వెళ్ళిన ప్రదేశంలో పాఠశాలలో చేరారని, వారిలో ఎంతమందికి ఈ భోజన సదుపాయం అందుతుందనే దానిపై సమాచారం ఎక్కడా అందుబాటులో లేదు.

గత ఏడాది పిల్లల మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్వహించబడే హెల్ప్‌లైన్ ‘చైల్ లైన్ 1098’ కి ప్రతి ఏటా వచ్చే కాల్స్ కన్నా ఈ ఏడాది 50% అధిక సంఖ్యలో తమను కాపాడమంటూ కాల్స్ వచ్చాయని ఆ సంస్థ తెలిపింది. అనేక కుటుంబాలు ఆర్ధికంగా నష్టపోవడం వలన పిల్లలు బాల కార్మికులుగా మారి తల్లిదండ్రులకు సహాయంగా పని చేయడం, తమ బరువుని దించుకోవాలని ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేయడం కూడా గత ఏడాదిలో అధికమయ్యిందని తెలుస్తుంది.

ఇన్ని సమస్యల మధ్య విద్యా సంవత్సరం మొదలవుతున్నప్పుడు ఇప్పుడైనా తగిన సంసిద్ధత అవసరం. విద్యార్థులలో ఎంత మందికి డిజిటల్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి, ఎంత మందికి లేవు, ఎంత మంది ఆన్‌లైన్ తరగతులకు హాజరవ్వగలరు అనేది సమగ్రంగా అధ్యయనం చేసి అందుకు తగినట్లు డిజిటల్ బోధనతో పాటు మరిన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి ఉంది. పాఠశాలలను, ఉపాధ్యాయులను తగినంతగా సంసిద్ధులను చేయడం కూడా అవసరం. తగినంత సన్నాహాలు, పరిస్థితి పట్ల సమగ్ర అవగాహన లేకుండా తరగతులు ప్రారంభిస్తే మరింత మంది పిల్లలు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News