Home తాజా వార్తలు ప్రసవం కోసం వస్తే.. శిశువు మృతి

ప్రసవం కోసం వస్తే.. శిశువు మృతి

Infant baby

 

తీరు మారని వైద్య సిబ్బంది!
కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు
వైద్యుల నిర్లక్షంపై నిరసన

ఎవరెన్ని చెప్పినా.. వారు మారరు..! ఉన్నతాధికారులు ఆదేశించినా పెడచెవిన పెడతారు..! నిరుపేద రోగులు వేడుకున్నా.. కనికరించరు..! ప్రాణాలు పోయాల్సిన చోట ప్రాణాలు తీస్తారు..! ప్రేమతో వైద్యం అందించకుండా పీడించుకు తింటారు!! సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రి తీరిది. ఓ వైపున ప్రసవాలన్నీ ఆస్పత్రుల్లోనే జరగాలని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం మాట విశ్వసిం చిన ప్రజలు ఆస్పత్రిలో ప్రసవం కోసం వస్తుంటే.. ఇలా శిశువుల ప్రాణాలు పోవడంతో వారు భయాందోళనకు గురవుతున్నారు.

సంగారెడ్డి : ఎవరెన్ని చెప్పినా..వారు మారరు..!ఉన్నతాధికారులు ఆదేశించినా పెడచెవిన పెడతారు..! నిరుపేద రోగులు వేడుకున్నా..కనికరించరు..!ప్రాణాలు పోయాల్సిన చోట ప్రాణాలు తీస్తారు..! ప్రేమతో వైద్యం అందించకుండా పీడించుకు తింటారు!! సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రి తీరిది.ఓ వైపున ప్రసవాలన్నీ ఆస్పత్రుల్లోనే జరగాలని ప్రభుత్వం చెబుతోంది. కేసీఆర్ కిట్ పేరిట ప్రోత్సహకాలు అందజేస్తోంది. ప్రభుత్వం మాట విశ్వసించిన ప్రజలు ఆస్పత్రి ప్రసవం కోసం వస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా, పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లా నుంచి కూడా నిత్యం అనేక మంది వివిధ సమస్యలపై ఇక్కడికి వస్తుంటారు. కనీస వైద్యం కోసం వారు వస్తుండగా, ఇక్కడ మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు.

ధైర్యంగా వస్తున్న వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. ముఖ్యంగా గ్రామాల్లోని గర్భిణులకు అక్కడి అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఇతర సిబ్బంది ఎన్నో విధాలుగా నచ్చజెప్పి ఆస్పత్రులకు తీసుకొస్తున్నారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వారి మాటకు విలువ లేకుండా చేస్తున్నారు. కనీస స్థాయిలో కూడా వైద్యం అందించడం లేదు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఓ మగ శిశువు మృతి చెందడం కలకలం సృష్టించింది. కన్న వారికి కడుపుకోత మిగిల్చింది. ఆ తల్లి శోకానికి అంతు లేకుండా పోయింది.సంగారెడ్డి పట్టణంలోని విజయనగర్ కాలనీలోని ఇందిర అనే వివాహిత శుక్రవారం రాత్రి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేరింది. కాన్పు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చారు.

నొప్పులు అధికం అయినప్పటికీ, సాధారణ ప్రసవం కోసం వైద్యులు ఆగారు. అక్కడి సిబ్బంది కూడా నిర్లక్షంగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సాధారణ ప్రసవం కావడం లేదని తెలిసినా, సిజేరియన్ ఆపరేషన్ చేయకుండా నిర్లక్షం ప్రదర్శించారు. ఆ మరుసటి రోజు ఉదయం చివరకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు. మగ శిశువు జన్మించగా, బాబు ఉమ్మనీరు మింగాడంటూ హైద్రాబాద్‌లోని నీలోఫర్‌కు ఇక్కడి వైద్యులు సిఫారసు చేశారు. దీంతో ఒక్క సారిగా ఇందిరతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీంతో చేసేది లేక ఇందిర కుటుంబ సభ్యులు ఆ మగ శిశువును హైద్రాబాద్‌కు తరలించారు. నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరిశీలించారు. శిశువు దారిలోనే చనిపోయిందని తేల్చి చెప్పడంతో కుటుబం సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ఆదివారం మధ్యాహ్నం మృత శిశువును జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకువచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అడుగడుగునా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్షం ప్రదర్శించడం వల్లనే తమ శిశువు చని పోయిందని వారు ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బంది తాము ఆస్పత్రికి వచ్చినప్పుటి నుంచి వివిధ రకాలుగా డబ్బు అడిగారని, చివరకు ఒక నర్సు మిర్చి బజ్జీలు కూడా అడిగారని, ప్రభుత్వ ఆస్పత్రి అని నమ్మకంతో వస్తే, తమ శిశువును పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. అడుగడుగునా సిసి కెమెరాలు ఏర్పాటు చేసినా, రోగుల నుంచి డబ్బులు అడగడంలో ఏ మాత్రం మార్పు లేదని వారు అన్నారు.

ఇష్టానుసారంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, మగ శిశువు జన్మించారని తెలియగానే మరింత డబ్బు అడుగుతున్నారని, తీరా తమ శిశువును తమకు కాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నవ మాసాలు మోసి ఆస్పత్రికి వస్తే, తమ బిడ్డను తమకు దక్కకుండా చేశారని తల్లి ఇందిర కన్నీరు, మున్నీరయ్యారు. వారి బంధువులు ఆస్పత్రి వద్ద నిరసన తెలిపారు. తొలి కాన్పులోనే ఇన్ని ఇబ్బందులు పెట్టారని వారు ఆరోపించారు. తమ శిశువు మృతికి కారకులను అరెస్టు చేయాలని, మున్ముందు ఇలాంటి గర్భశోకం ఎవరికీ రాకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు.

Infant died due to Negligence of Doctors