Home తాజా వార్తలు ఇన్ఫోసిస్ లాభం రూ.4,037 కోట్లు

ఇన్ఫోసిస్ లాభం రూ.4,037 కోట్లు

Infosys

 

రెండో త్రైమాసికంలో అంచనాలను అందుకున్న ఐటి దిగ్గజం
రూ.8 మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన కంపెనీ

బెంగళూరు: దేశంలో రెండవ అతిపెద్ద ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో రూ.4,037 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.4,110 కోట్లతో పోలిస్తే ఇప్పుడు నికర లాభం 1.7 శాతం మేర తగ్గినప్పటికీ గత త్రైమాసికంతో పోలిస్తే పెరగడం గమనార్హం. అంతేకాదు కంపెనీ లాభాలు మార్కెట్ నిపుణుల అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఉద్యోగులు కంపెనీ వదిలిపెట్టి వెళ్లడాన్ని తగ్గించడం కోసం ఉద్యోగులపై చేసేఖర్చు పెరగడమే నికర లాభాలు తగ్గడానికి కారణంగా భావిస్తున్నారు.

గత ఏడాదితో పోలిస్తే ఉద్యోగుల ప్రయోజనాల కోసం కంపెనీ చేసే ఖర్చు 13.6 శాతం మేర పెరిగింది. కంపెనీ తీసుకున్న చర్యల కారణంగా ఒకప్పుడు 23.4 శాతం మేర ఉండిన ఉద్యోగులు కంపెనీని వదిలిపెట్టి వెళ్లడం ఇప్పుడు 21.7 శాతానికి తగ్గింది. కాగా కంపెనీ ఈ ఆర్థిక పంవత్సరానికి రెవిన్యూ రాబడి అంచనాను సైతం గతంలో అంచనా వేసిన 8.510 శాతంనుంచి 910 శాతానికి పెంచింది. కంపెనీ రాబడిలో కీలకమైన డిజిటల్ వ్యాపారం గత ఏడాదితో పోలిస్తే ఈ త్రైమాసికంలో 38.4 శాతం పెరగడంతో కంపెనీకి దీని ద్వారా వచ్చే రాబడి సైతం రూ. 1.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. మరో వైపు కంపెనీ ప్రధాన వ్యాపారం 0.7 శాతం తగ్గడంతో దీనిద్వారా వచ్చే రాబడి 1.98 బిలియన్ డాలర్లుగా ఉంది.

కొత్త ఒప్పందాలు
కంపెనీ ఈ త్రైమాసికంలో 2.8 బిలియన్ డాలర్ల విలువైన కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంది. గత త్రైమాసికంలో 2.7 బిలియన్ డాలర్ల విలువైన కొత్త ఒప్పందాలను కుదుర్చుకోగా ఇప్పుడు అది మరింత పెరిగింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు మాసాల్లో ఇన్ఫోసిస్ 5.5 బిలియన్ డాలర్ల విలువైన కొత్త ఒప్పందాలను కుదుర్చుకున్నట్లయింది. గత ఏడాది కుదుర్చుకున్న కొత్త ఒప్పందాలతో పోలిస్తే 75 శాతం పెరిగాయి. ఈ త్రైమాసికంలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 13 భారీ ఒప్పందాలున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసులు, రిటైల్ రంగాల్లో చెరి నాలుగు భారీ ఒప్పందాలు కుదిరాయి. కంపెనీ ఆదాయంలో అత్యధిక భాగం అందే అమెరికాఈ కంపెనీకి ఆరు భారీ కాంట్రాక్ట్‌లు ఇచ్చింది. డిజిటల్ వ్యాపారంపై ఆధారపడ్డం పెరిగిన కారణంగా ఇన్ఫోసిస్ మార్జిన్లు కూడా మెరుగుపడ్డాయి.

మా పని తీరు మెరుగుపడింది: పరేఖ్
‘రెవిన్యూ వృద్ధి, డిజిటల్ వ్యాపారం వృద్ధి, నిర్వహణ లాభాలు, నిర్వహణ సామర్థాలు, భారీ ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఉద్యోగులు కంపెనీ వదిలిపెట్టి వెళ్లడం తగ్గడం .. ఇలా అనేక కోణాల్లో మా కంపెనీ పని తీరు మెరుగుపడింది. క్లయింట్లకు సేవ అందించడమే లక్షంగాను, మా వాటాదారులకు గరిష్ఠంగా విలును అందించడమనే మా ప్రయాణంలో మేము పురోగతి సాధిస్తున్నామనడానికి ఇవన్నీ సంకేతాలు’ అని శుక్రవారం విలేఖరుల సమావేశంలో త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తూ ఇన్ఫోసిస్ ఎండి, సిఇఓ శైలేష్ పరేఖ్ చెప్పారు. కాగా ఈ త్రైమాసికంలో కొత్తగా7,457 మంది ఉద్యోగులను చేర్చుకున్నామని, దీంతో కంపెనీలో మొత్త ఉద్యోగుల సంఖ్య 2,36,486కు చేరుకుందని పరేఖ్ చెప్పారు. అయితే అమెరికా చూనా వాణిజ్య యుద్ధం, బ్రెగ్జిట్ పరిణామాలు లాంటివి కంపెనీ పని తీరుపై ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదని కూడా ఆయన చెప్పారు.

ఉత్తర అమెరికానే టాప్
కాగా ఇన్ఫోసిస్ ఉత్తర అమెరికాలో తన స్థానాన్ని పటిష్ఠం చేసుకుంది. దీంతో కంపెనీకి వచ్చే రెవిన్యూలో 61.4 శాతం ఇక్కడినుంచే లభిస్తోంది.గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ ఖండంనుంచి వచ్చే రాబడి60.3 శాతంగా ఉండింది. కాగా ఇన్ఫోసిస్‌కు వచ్చే మొత్త రాబడిలో దాదాపు 50 శాతం ఫైనానిసయల్ సర్వీసులు, రిటైల్ విభాగాలనుంచే లభిస్తోంది.

రూ.8 మధ్యంతర డివిడెండ్
కాగా ఇన్ఫోసిస్ తన వాటాదారులకు ప్రతి షేరుపై 8 రూపాయల మధ్యతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ నెల 30 నాటికి మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించడం జరుగుతుందని కంపెనీ తెలియజేసింది.

Infosys Q2 net profit falls 1.7% at Rs 4,037 crore