Home ఎడిటోరియల్ నూతన జాతీయ విద్యా విధానంలో దివ్యాంగులకు అన్యాయం

నూతన జాతీయ విద్యా విధానంలో దివ్యాంగులకు అన్యాయం

Handicaps

 

భారత ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకురాబోతుంది. దీనికి కేంద్ర మానవ వనరుల శాఖ ఒక కమిటీని ఇస్రో మాజీ చైర్మన్ డా. కస్తూరి రంగం ఆధ్వర్యంలో ఒక ముసాయిదాని మంత్రిత్వ శాఖకి సమర్పించింది, దీనిపై దేశ ప్రజలు, విద్యా వంతులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు మొ॥ నవారి నుండి అభిప్రాయసేకరణ చేస్తుంది. ఈ ముసాయిదాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల(దివ్యాంగులకు) విద్య కోసం పెద్దగా ఏమి చేర్చలేదు. దివ్యాంగులను ఎస్సీ, ఎస్టీ, ఓబిసిలు, ముస్లింలు, వలసదారుల పిల్లలు మరియు పట్టణ పేదలతో చేర్చారు. అందువలన దివ్యాంగులకు విద్యాపరమైన అవకాశాల కొరకు ‘ప్రాతినిధ్యం లేని సమూహం‘ క్రింద చేర్చారు. కానీ దివ్యాంగుల విద్యా అవకాశాల గురించి గత మూడు దశాబ్దాలుగా పెద్దగా చర్చకు నోచుకోలేదు. దివ్యాంగుల సాధికారం కొరకు అనేక చట్టాలు చేసిన వారికీ విద్యా పరమైన విధానంలో ఆ చట్టాలను గమనంలోనికి ఇంతవరకు తీసుకోలేదు.

ఐక్యరాజ్యసమితి వికలాంగుల హక్కులపై ఒక అంతర్జాతీయ విధానాన్ని (యుఎన్‌సిఆర్‌పిడి) తీసుకురాగా భారతదేశం 2007 లో దీనిని ఆమోదించింది. కానీ విద్యా హక్కు చట్టం 2009 మాత్రం విస్మరించింది. కానీ వికలాంగుల హక్కుల చట్టం, 2016 లో దివ్యాంగుల విద్యకై సహిత (సమ్మిళిత) విద్యకి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. భారత పునరావాస చట్టం దివ్యాంగుల విద్యా బోధకులను దేశ వ్యాప్తంగా తమ జాతీయ సంస్థల ద్వారా తయారు చేస్తుంది. కానీ వీటి ప్రస్తావన ముసాయిదాలో గుర్తించబడలేదు. ఈ రెండింటిలో విద్యపై గణనీయమైన విభాగాలు ఉన్నాయి. విచిత్రమేమిటంటే, ఉనికిలో లేని వికలాంగుల చట్టం, 1995 గురించి ప్రస్తావించింది!

ఇది అప్రజాస్వామికం మరియు దివ్యాంగులపై ఉన్న వివక్షను శాశ్వతం చేస్తూనే ఉంది. ముసాయిదా హక్కుల-ఆధారిత విధానాన్ని అమలు చేయడంలో బాటలు వేయాలి కానీ వైకల్యాన్ని ఎత్తి చూపే సాంప్రదాయ పద్ధతిని ప్రోత్సహించేదిగా ఉంది. ముసాయిదా కేవలం ‘ప్రత్యేక అవసరాలతో ఉన్న పిల్లలు‘ అనే పదాన్ని ఉపయోగించి ఎలిమెంటరీ స్థాయి విద్య గురించి ప్రస్తావించి, మాధ్యమిక మరియు ఉన్నత విద్యలో వికలాంగులను విస్మరించింది.

వికలాంగుల హక్కుల చట్టం, 2016 లో అనేక నిబంధనలు ఉన్నప్పటికీ, ఇక్కడ యాక్సెస్ కేవలం ర్యాంప్‌లు, హ్యాండ్ రెయిల్స్ మరియు మరుగుదొడ్ల సదుపాయాల కేవలం భౌతిక అవసరాల గురించి మాత్రమే ప్రస్తావించి, ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం, దివ్యాంగులకు అనుకూలంగా పాఠ్యాంశాల మార్పు, సహా పాఠ్య కార్యక్రమాల మార్పు, ఉపాధ్యాయుల శిక్షణ, బోధనాభ్యసన పరికరాలు, దివ్యాంగులకు ఉపకరణాలు, పునరావాస విభాగాలు మొ॥ న అంశాలను విస్మరించింది. పార్లమెంట్ లో ఇచ్చిన నివేదిక ప్రకారం 22.4 శాతం పాఠశాలలు మాత్రమే స్నేహపూర్వక మరుగుదొడ్లు కలవు. రైలింగ్ తో గల రాంప్ లు అవసరమయ్యే పాఠశాలల్లో కేవలం 20 శాతం పాఠశాలల్లో మాత్రమే కలవు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ యొక్క సొంత డేటా ప్రకారం, వివిధ సమూహాలలో, పాఠశాల పిల్లలలో అత్యధిక సంఖ్యలో, వైకల్యాలున్న పిల్లలు ఉన్నారు. 2014 సంవత్సరంలో, ఈ సమూహం యొక్క సంఖ్య 28.07 శాతం.

అయితే, ముసాయిదా వికలాంగ పిల్లల నమోదును పెంచడానికి ఎటువంటి ఖచ్చితమైన చర్యలను ఇవ్వలేదు. దీనికి విరుద్ధంగా, విద్యా హక్కుల చట్టంలో అందించబడిన అట్టడుగు వర్గాలకు 25 శాతం రిజర్వేషన్లను తొలగించాలని ఈ విధానం ప్రతిపాదించింది. ముసాయిదా స్థాయి మరియు అతి తీవ్ర స్థాయి కల దివ్యాంగులకు ప్రత్యేక పాఠశాలలను మరియు వాటి పాత్రను పూర్తిగా విస్మరిస్తుంది. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఎన్‌జీఓలచే ఎక్కువగా నడుస్తున్న ప్రత్యేక పాఠశాలల ప్రస్తావన ముసాయిదాలో లేదు. వీటిని MHRD పరిధిలోకి తీసుకురాబడతారా మరియు వాటి కోసం ఏమైనా ప్రత్యేక మార్గదర్శకాలు తెస్తారా అనేది ఈ ముసాయిదాలో పేర్కొనలేదు.

మాజీ హెచ్‌ఆర్‌డి మంత్రి జవదేకర్ నుండి వచ్చిన ప్రారంభ సందేశం ప్రకారం ఈ ముసాయిదాను ‘అన్ని వర్గాల, బహుముఖ ప్రజ్ఞా వేత్తలు, శాస్త్రవేత్తలు, విద్యా రంగ నిపుణులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, దిగువ శ్రేణి ప్రజలు, అపూర్వమైన వ్యక్తుల సహకారంతో సంప్రదింపుల ప్రక్రియ‘ తర్వాత ముసాయిదా తయారు చేయబడిందని‘ పేర్కొన్నప్పటికీ, ఈ ప్రక్రియలో పాల్గొన్న వికలాంగుల కొరకు పనిచేసే నోడల్ మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, వికలాంగుల సాధికారత విభాగం, నేషనల్ ట్రస్ట్, భారత పునరావాస సంస్థ మొ॥న వన్నీ జాబితాలో లేవు.

వికలాంగుల విద్య గురించి అధిక ప్రాధాన్యత గల చట్టాలు వికలాంగుల చట్టం 2016 మరియు భారత పునరావాస చట్టం 1992/2000 ప్రకారం ‘వైకల్యం ఉన్నవారికి ఇచ్చే సేవలను నియంత్రించడం మరియు పర్యవేక్షించడం, సిలబస్‌ను ప్రామాణీకరించడం మరియు పునరావాసం మరియు ప్రత్యేక విద్యారంగంలో పనిచేసే అన్ని అర్హత గల నిపుణులు మరియు సిబ్బంది యొక్క కేంద్ర పునరావాస రిజిస్టర్‌ను నిర్వహించడం‘ తప్పనిసరి చేసిన భారత పునరావాస మండలి కూడా జాబితాలో లేదు. ఇటీవల యునెస్కో అంతర్జాతీయ సంస్థ వారు భారతీయ విద్య 2019: వికలాంగ పిల్లలకు విద్యపై నివేదికను విడుదల చేసింది. ఈ సంస్థ యొక్క సిఫార్సులు క్రింది విధంగా ఉన్నాయి

1. వికలాంగ పిల్లల విద్య RPWౄ చట్టం, 2017 లోని నిర్దిష్ట విభాగాలను విద్యా హక్కు చట్టం సవరణ ద్వారా చేర్చడం ద్వారా దివ్యాంగుల విద్య మెరుగవుతుంది.
2. వికలాంగ పిల్లల అన్ని విద్యా కార్యక్రమాలను సమర్థవంతంగా కలుసుకోవడానికి MHRౄ క్రింద ఒక సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయండి.
3. వికలాంగ పిల్లల అభ్యాస అవసరాలను తీర్చడానికి విద్యా బడ్జెట్లలో నిర్దిష్ట మరియు తగిన ఆర్థిక కేటాయింపు ఉండేలా చూసుకోండి.
4. ప్రణాళిక, అమలు మరియు పర్యవేక్షణకు ఒక బలమైన డేటా వ్యవస్థలను బలోపేతం చేయండి.
5. పాఠశాల పర్యవేక్షణ వ్యవస్థలను మెరుగుపర్చండి మరియు వికలాంగ పిల్లలకు మద్దతుగా అన్ని విభాగాల సహకారం తీసుకోవాలి.
6. వికలాంగ పిల్లల విద్య కోసం సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని భారీగా విస్తరించండి.
7. ప్రతి బిడ్డకు అవకాశం ఇవ్వండి మరియు వైకల్యం లేని పిల్లలతో పాటు పాఠశాలలో చేర్చండి. .
8. అన్ని రకాల దివ్యాంగులకు సహాయపడే బోధనా పద్ధతులను మరియు పాఠ్యంశాలను మార్చండి.

                                                                                                                      – కల్పగిరి

Injustice to Handicap in New national education system