Saturday, April 20, 2024

నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం: రంజిత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Brijesh tribunal deadline year extension on krishna water disputes

మన తెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానది నీటిని తెలంగాణ, ఎపిలకు యాభై శాతం చొప్పున నీటి కేటాయింపులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని చేవెళ్ల టిఆర్‌ఎసి జి. రంజిత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎటువంటి కాలయాపన జరగకుండా కేంద్రం తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. కృష్టానది జలాల కేటాయింపులు, వివాదాలపై సోమవారం లోక్‌సభలో జీరో అవర్‌లో ఆయన నోటీస్ ఇచ్చారు. ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ, కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద సోదరుడిగా నదీ పరీవాహక ప్రాంతం ఆధారంగా జలాలను విభజించాలన్నారు. తెలంగాణలోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం 69 శాతం ఉండగా, ఎపిలో 31శాతం మాత్రమే ఉందన్నారు.

కానీ రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపును చూస్తే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. తెలంగాణలో కృష్ణానది పరివాహక ప్రాంతం 69 శాతం ఉన్నప్పుడు కేంద్రం కేవలం 299 టిఎంసిల నీటిని మాత్రమే కేటాయించడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అలాగే ఎపిలో పరివాహక ప్రాంతం కేవలం 31 శాతం ఉన్నప్పుడు 512 టిఎంసిల నీటిని ఏ విధంగా కేటాయించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేటాయింపులు ఎంత వరకు న్యాయమే కేంద్రం తగు సమాధానం చెప్పాలన్నారు. దీనిపై న్యాయం చేయాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పలుమార్లు కేంద్రాన్ని కోరిన విషయాన్ని ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి ప్రస్తావించారు. ఈ విషయంలో కేంద్రం న్యాయం చేయడంలో విఫలమైనప్పుడు తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసిందన్నారు.

అయితే ఈ కేసులను ఉపసంహరించుకోవాలని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించిందన్నారు. నీటి వాటాలో న్యాయం జరుగుతుందని స్పష్టమైన హామీ ఇచ్చిందన్నారు. మంత్రిత్వ శాఖ న్యాయం చేస్తుందని ఆశిస్తూ తెలంగాణ ప్రభుత్వం తన కేసును ఉపసంహరించుకుందని రంజిత్‌రెడ్డి తెలిపారు. అయితే న్యాయం చేయడానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం చెడు ఉద్దేశ్యంతో గత నెలలో కృష్ణా నది నిర్వహణ మండలిని ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. కెఆర్‌ఎంబి అధికార పరిధిని గుర్తించడం ద్వారా సమస్యలు ఎలా పరిష్కరించబడతాయో తనకు అర్థం కావడం లేదని రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు సమస్యల పరిష్కారం మరింత క్లిష్టతరం, ఆలస్యం చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని కృష్ణానది నీటి వాటాను రెండు రాష్ట్రాలను సమానంగా పంచాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News