Home తాజా వార్తలు రేషన్ బియ్యం దందా చేస్తున్న ఉపాధ్యాయునిపై విచారణ…

రేషన్ బియ్యం దందా చేస్తున్న ఉపాధ్యాయునిపై విచారణ…

Ration Rice

 

వనపర్తి : వనపర్తి జిల్లాలో విచ్చలవిడిగా కొనసాగుతున్న రేషన్ బియ్యం అక్రమ దందాపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమీషనర్ దృష్టి సారించారు. పేదల బియ్యాన్ని పెద్దల బోజ్యం అన్నట్లుగా ఇటీవల కాలంలో వనపర్తి జిల్లాలోని వివిధ మండలాల్లో వరుసగా భారీ ఎత్తున పట్టుబడుతున్న రేషన్ మాఫియాపై కమీషనర్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. అందులో జిల్లాలోని సివిల్ సప్లై అధికారుల పాత్ర పై కూడా విచారణ జరిగినట్లు తెలుస్తుంది. సిఎంఆర్ బియ్యం సరఫరాలో కొందరు వ్యాపారులు దళారులు రైస్ మిల్లులను లీజ్‌కు తీసుకొన్ని ప్రభుత్వం ఇచ్చిన (ప్యాడి) వడ్లను ముందే బయటికి అమ్ముకొని తిరిగి ప్రభుత్వానికి బియ్యం ఇచ్చే క్రమంలో రేషన్ బియ్యం దందాను ఎంచుకున్నారు.

ఇటీవల వనపర్తి జిల్లాలో కొనసాగుతున్న రేషన్ బియ్యం దందాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఒకరు వ్యాపారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లి దర్జాగా బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్న వైనంపై ఇటీవల ఒక దినపత్రికలో వార్తా ప్రచురితమైంది. దీనిపై స్పంధించిన సివిల్ సప్లై రాష్ట్ర అధికారులు, విద్యాశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు వనపర్తి మండలంలోని దత్తాయపల్లి గ్రామ పరిధిలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయు నిగా పని చేస్తున్న అతనిపై పాఠశాలకు హాజరయ్యే విషయం పై కూడా రహస్యంగా విచారణ చేసినట్లు తెలిసింది.

అలాగే నాగర్ కర్నూల్ జిల్లా కోడేర్ మండలం ఎత్తం గ్రామంలో సదరు ఉపాధ్యాయుడు ఒక రైస్‌మిల్లును లీజ్‌కు తీసుకొని అక్కడి నుండి రేషన్ బియ్యాన్ని అక్రమంగా వనపర్తి జిల్లాలోని కొన్ని మిల్లు లకు తరలిస్తున్న వైనం బయటపడినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా వనపర్తి పట్టణంతో పాటు వివిధ మండలాల్లోని రేషన్ డీలర్లను, గోదాం ఇంచార్జీల సహాయంతో రేషన్ బియ్యం దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రతి నెల అతని ఆదాయం రూ . 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు అక్రమ సంపాదన రేషన్ బియ్యం దందాపైనే జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.

Inquiry on Teacher doing Ration Rice illegal Business