హైదరాబాద్ : ఆర్టిసి ఉద్యోగులతో ఆదివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహించిన సమావేశం సందర్భంగా జనహితలో సూచనల బాక్స్‌ను సంస్థ ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. సంస్థను కాపాడడం, దానిని లాభాల బాటలోకి తీసుకెళ్ళడంతో పాటు ఇతర అంశాలపై కార్మికులు తమ అభిప్రాయాలను స్వేచ్చగా వెల్లడించడం కోసం ఈ సూచనల బాక్స్‌ను ఏర్పాటు చేశారు. ఆర్టిసి యజమాన్యం కల్పించిన ఈ వెసులుబాటును ఉద్యోగులు వినియోగించుకున్నారు. ముఖ్యంగా కార్మికుల పదవీ విరమణ కాలాన్ని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచడంపైనే ఎక్కువ అభిపాయలు వచ్చినట్లుగా తెలుస్తోంది.
అలాగే డ్రైవర్ కమ్యూనిటికి 60 ఏళ్ల వయో పరిమితి ఇబ్బందిగా మారే అవకాశాలు ఉంటాయని సజెషన్ బాక్స్ ద్వారా వెల్లడించినట్లు సమాచారం. కంటి చూపు లాంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో డ్రైవర్లకు పదవీ విరమణ వయో పరిమితి పెంపు సాధ్యపడదని అభిప్రాయాలను కొందరు వ్యక్తం చేశారని తెలుస్తోంది. అలాంటి వాళ్లకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీం (విఆర్ఎస్) ప్రకటిస్తే సమస్య పరిష్కారం అవుతుందని కార్మికులు భావిస్తూ తమ మనోభావాలను వెల్లడించారని సమాచారం.