Friday, April 19, 2024

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

Inter exams

 

నిమిషం లేటైనా నో ఎంట్రీ

ఉదయం 8.45 గంటలకే సీట్లో కూర్చోవాలి
9 తర్వాత నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
రాష్ట్రవ్యాప్తంగా 1,339 కేంద్రాల ఏర్పాటు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 4(బుధవారం) నుంచి ఈ నెల 23వ తేదీ వరకు ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్మీడియేట్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్న ఈ పరీక్షలకు విద్యార్థులు ఉదయం 8.45 గంటలకే తమకు కేటాయించిన సీట్లో కూర్చోవాలి. ఆ తర్వాత 15 నిమిషాల పాటు అంటే 9 గంటల వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఉదయం 9 తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. పరీక్షా కేంద్రాలు పరీక్షా సమయానికి గంట ముందుగా అంటే ఉదయం 8 గంటలకు తెరిచి ఉంటాయి.

రాష్ట్రవ్యాప్తంగా 1,339 పరీక్షా కేంద్రాలలో నిర్వహించే ఈ పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన 9,65,875(బాలురు 4,82,808, బాలికలు 4,83,067) మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రంలో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెస్ వంటివి విద్యార్థులతోపాటు ఛీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లకు కూడా అనుమతి ఉండదు. టాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఉదయం 8 గంటలకే ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థుల కోసం ఆర్‌టిసి అదనపు బస్సులు నడపనుంది.

నేలమీద కూర్చుని పరీక్షలు రాయిస్తే కఠిన చర్యలు
పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు నిర్వహించే ఏ పరీక్షా కేంద్రాలలో అయినా విద్యార్థులను నేలపై కూర్చుని పరీక్షలు రాయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు
పరీక్షల సమయంలో విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ప్రైవేట్ యాజమాన్యాలు వేధిస్తున్నాయని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఇంటర్ బోర్డు విద్యార్థుల హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు నేరుగా www.tsbie.cgg.gov.in నుంచి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చు. కళాశాలతో ప్రమేయం లేకుండా విద్యార్థులు నేరుగా వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ హాల్‌టికెట్లపై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం లేకుండానే విద్యార్థులను పరీక్షకు అనుమతించాలని రాష్ట్ర ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఆదేశాలు జారీ చేశారు.

పరీక్షా కేంద్రాలను గుర్తించే సెంటర్ లోకేటర్ యాప్
విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సెంటర్ లొకేషన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని స్పెషల్ సిఎస్ వెల్లడించారు. విద్యార్థులు తమ ఫోన్‌లో గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి ద్వారా సెంటర్ లొకేటర్ యాప్ TSBIE m– servicesను డౌన్‌లోడ్ చేసుకుని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్‌లో హాల్‌టికెట్ నంబర్ టైప్ చేసి సెర్చ్ చేస్తే.. పరీక్షా కేంద్రం ఫొటోతోపాటు ఆ కేంద్రానికి వెళ్లే మ్యాప్ వస్తుంది. విద్యార్థుల ఇంటి నుంచి పరీక్షా కేంద్రానికి ఎంత దూరం ఉంది..?, ఎంత సమయంలో అక్కడికి చేరుకోవచ్చు అనే వివరాలు కూడా వస్తాయి. అలాగే పరీక్ష కేంద్రానికి ఏ రూట్‌లో ఎలా చేరుకోవాలో కూడా తెలుసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఒకే పేరుతో ఉన్న కళాశాలలు అధికంగా ఉన్నందున సరైన పరీక్షా కేంద్రాన్ని గుర్తించేందుకు కూడా ఈ యాప్ దోహదపడుతుంది.

ఈ జాగ్రత్తలు పాటించండి
ఇంటర్ పరీక్షలకు ఉదయం 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు కాబట్టి ముందుగానే పరీక్షా కేంద్రాన్ని చూసుకుని, కనీసం అరగంట ముందుగానే కేంద్రం వద్ద ఉంటే మంచిది. సాధ్యమైనంతవరకు ఉదయం 8 గంటల వరకు పరీక్షా కేంద్రానికి చేరుకోవడం ఉత్తమం. చివరి నిమిషంలో వస్తే కంగారు పడి పరీక్ష సరిగ్గా రాయలేకపోవచ్చు. పరీక్ష ప్రారంభమైన తర్వాత విద్యార్థులకు ఇచ్చిన జవాబు పత్రాల బుక్‌లెట్‌లో 24 పేజీలు ఉన్నాయా…లేదా..చూసుకోవాలి. అదనపు జవాబు పత్రాలు ఇవ్వరు కాబట్టి కొట్టివేతలు లేకుండా జవాబులు రాయాలి.

అందుబాటులో ఆన్‌లైన్ ఫిర్యాదుల విధానం
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఈ సారి ఇంటర్ ఆన్‌లైన్ ఫిర్యాదుల విధానం (బోర్డు ఆఫ్ ఇంటర్మీడియేట్ గ్రివియెన్స్ రిడ్రెసల్ సిస్టమ్– బిఐజిఆర్‌ఎస్)ను ఇంటర్ బోర్డు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా www.bigrs.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేయడానికి విద్యార్థికి లేదా తల్లిదండ్రులకు ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుంది. విద్యార్థులు ఫిర్యాదు చేసిన వెంటనే వారి ఫోన్ నెంబర్‌కు టోకన్ నెంబర్‌తో ఎస్‌ఎంఎస్ వస్తుంది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత అధికారికి, ఉన్నతాధికారులకు సమాచారం వెళుతుంది. విద్యార్థుల ఫిర్యాదు ఏ దశలో ఉందో కూడా తెలుసుకోవచ్చు.

విద్యార్థుల ఫిర్యాదులను నిర్ధిష్ట కాలపరిమితితో రెండు మూడు రోజుల్లో పరిష్కారించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అలాగే పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనయ్యే విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు.కౌన్సిలింగ్ కోసం ప్రముఖ మానసిక నిపుణులు, స్టూడెంట్ కౌన్సిలర్ డాక్టర్ అనితను 7337225803 ఫోన్ నెంబర్‌లో సంప్రదించవచ్చు. అలాగే కళాశాలల్లో నియమించిన స్టూడెంట్ కౌన్సిలర్లను సంప్రదించవచ్చు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా స్టూడెంట్ కౌన్సిలర్లు దిశానిర్ధేశం చేసేలా వారికి మానసిక నిపుణులతో శిక్షణ ఇప్పించారు. విద్యార్థులు ఏమైనా సమస్యలు ఉంటే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇంటర్ బోర్డు కంట్రోల్ రూమ్ నెంబర్ 040- -24601010లో సంప్రదించవచ్చు లేదా helpdesk_ie@telangana.gov.inకు ఈమెయిన్ పంపించవచ్చు. .

ఇంటర్ విద్యార్థులు, పరీక్షా కేంద్రాల వివరాలు

పరీక్షా కేంద్రాలు : 1,339
ఛీఫ్ సూపరింటెండెంట్లు : 1,339
ఇన్విజిలేటర్లు : 26,964, ఫ్లైయింగ్ స్కాడ్‌లు : 75, సిట్టింగ్ స్కాడ్‌లు : 150, కస్టోడియన్లు : 450
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు : 9,65,875(బాలురు 4,82,808, బాలికలు 4,83,067)
ప్రథమ సంవత్సరం విద్యార్థులు : జనరల్ 4,31,334, ఒకేషనల్ 49,195
ద్వితీయ సంవత్సరం విద్యార్థులు : జనరల్ 3,74,458, ఒకేషనల్ 37,139
ద్వితీయ సంవత్సరం జనరల్ ప్రైవేట్ విద్యార్థులు : 70,094
ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ ప్రైవేట్ విద్యార్థులు : 3,653

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి : విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి
ఇంటర్మీడియట్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా, భయానికి లోనుకాకుండా ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి కోరారు. సరైన ప్రణాళికతో పరీక్షలకు సిద్ధమై మీ బంగారు భవితకు బాటలు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరీక్షా సమయానికి ముందే పరీక్షా కేంద్రం చేరేలా చూసుకోవాలని కోరారు. భయం, ఆందోళన, వత్తిడికి గురైనట్లు ఎవరైనా విద్యార్థులు భావిస్తే ఇంటర్మీడియట్ బోర్డు నియమించిన సైకాలజిస్టుల ఫోన్ నెంబర్‌పై సంప్రదించి సలహాలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మంత్రి అభినందనలు తెలిపారు.

Inter exams from today
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News