Friday, April 19, 2024

ఇంటర్ పరీక్షలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Inter exams

 

ఆలస్యం నిబంధన కారణంగా పరీక్ష రాయలేకపోయిన కొంతమంది విద్యార్థులు

కరోనా మాస్కులు, వాటర్ బాటిళ్లకు అనుమతి

తొలి రోజు 4.7 శాతం విద్యార్థులు గైర్హాజరు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. మొదటి రోజు జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సరం ద్వితీయ భాషా సబ్జెక్టుకు ‘ఎ’ సెట్ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,80,531 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 4,57,899 మంది హాజరయ్యారు. 22,632 మంది (4.7 శాతం) విద్యార్థులు మొదటి రోజు గైర్హాజయ్యారు. ఇంటర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,339 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గురువారం నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మారేడుపల్లిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సాయి జూనియర్ కళాశాలకు చెందిన 48 మంది అంధ విద్యార్థులు పరీక్ష రాయడానికి హాజరయ్యారు. వీరికి ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగులు, శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అంధ విద్యార్థులకు పరీక్ష రాయడానికి సహాయం చేశారు.

మంత్రి కెటిఆర్ అభినందనలు
ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ‘విజయాలు సాధించండి, ఒత్తిడికి లోనుకాకండి అని పేర్కొన్నారు. పరీక్షలు, గ్రేడ్‌లు ముఖ్యమే అయినప్పటికీ అవే జీవితం కాదని ట్వీట్ చేశారు.

విద్యాశాఖ మంత్రి శుభాకాంక్షలు
ఇంట్మీడియట్ పరీక్షల సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బ్రుంగీ కళాశాల, సిద్దార్థ కళాశాల వద్ద ఉదయం 8.30 నుంచి 8.45 గంటల మధ్య పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులతో మంత్రి స్వయంగా మాట్లాడి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పరీక్ష రాయాలని కోరారు. పరీక్షా సమయానికి ముందే పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకునేలా చూడాలని అక్కడున్న విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.

మాస్క్‌లు, వాటర్ బాటిళ్లకు అనుమతి
కరోనా వైరస్(కోవిద్ 19) నేపథ్యంలో ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇంటర్ బోర్డు మాస్క్‌లు, వాటల్ బాటిళ్లతో హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించింది.

నిమిషం నిబంధనతో పలువురి విద్యార్థులకు చేటు
ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభం కాగా, మిషం నిబంధన, ఇతర కారణాల వల్ల పలుచోట్ల కొంతమంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినందుకు వెన్నెల రాజేశ్వరి అనే విద్యార్థినిని పోలీసులు పరీక్ష రాయటానికి అనుమతివ్వలేదు. అలాగే పెద్దపల్లి జిల్లాలోని మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సెంటర్లో మరో ముగ్గురు విద్యార్థులు ఇంటర్ పరీక్ష రాయలేకపోయారు. హాల్ టికెట్ లేకుండా ఇద్దరు విద్యార్థులు, ఒకరు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్షకు అనుమతించలేదు. దీంతో సదరు విద్యార్థులు అక్కడినుంచి వెనుతిరగాల్సి వచ్చింది.

వీరితో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్న పేటలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వివిధ కళాశాలలకు చెందిన ఆరుగురు విద్యార్థులు సెంటర్ దగ్గరకు ఆలస్యంగా రావటంతో పరీక్ష హాల్‌లోకి అనుమతించలేదు. వారిలో ఐదుగురు రామన్నపేట గవర్నమెంట్ కళాశాలకు చెందిన వారు కాగా, ఒకరు నలంద కళాశాలగా గుర్తించారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు విద్యార్థులు పరీక్ష మిస్ అయ్యారు. వారిలో నిజామాబాద్‌కు చెందిన గణేష్ అనే విద్యార్థి పరీక్షా కేంద్రం పేరు ఒకేలా ఉండటంతో అయోమనానికి గురై మరో కేంద్రానికి వెళ్లాడు. దీంతో అధికారులు అతడ్ని బయటకు పంపించేశారు. అదేవిధంగా బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని అనిత 10 నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష కేంద్రంలోకి అనుమతి లభించలేదు.

Inter exams have begun
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News