Home ఎడిటోరియల్ సంపాదకీయం : రాజ్యాంగ వ్యవస్థకు సవాలు

సంపాదకీయం : రాజ్యాంగ వ్యవస్థకు సవాలు

Sampadakeeyam-Logoఅంతర్రాష్ట్ర వివాదాల్లో సుప్రీంకోర్టు తీర్పును పాటించకపోవటం రాజ్యాంగబద్ధ పరిపాలనా వ్యవస్థకు సవాలు వంటిది. సరిహద్దులు, నీరు వంటి సమస్యలు అతి సున్నితమైనవి. వాటితో రాజకీయం చేయదలు చుకుంటే అది ప్రజల మధ్య విద్వేషాలకు హేతువవుతుంది. భావోద్రేకాలను అదుపులో ఉంచాల్సిన పాలక – ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తమ స్వార్థం కొరకు వాటికి ఆజ్యంపోస్తే ఎంత విధ్వంసం జరుగుతుందో కర్నాటక – తమిళనాడు మధ్య కావేరీ జలాల విడుదల వివాదంలో ఇటీవల మనం చూశాం. సుప్రీంకోర్టు ఆదేశాన్ని తొలుత కొంతమేరకు అమలు జరిపిన కర్నాటక ప్రభుత్వం తరువాత అడ్డంతిరగటం, శాసనసభ ఏకగ్రీవ తీర్మానం తో నీటి విడుదలను నిలుపు చేయటం, సుప్రీం కోర్టు తదుపరి ఉత్తర్వును అమలుజరపలేమని నిస్సహాయత వ్యక్తం చేయటం చూశాం.
రావి, బియాస్ నదీ జలాల వివాదంపై పంజాబ్ ఏకపక్ష వైఖరి అటువం టిదే. పంజాబ్ పునర్వవస్థీకరణ చట్టం, 1966 ద్వారా పంజాబ్ నుండి హర్యానా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తదుపరి కేంద్ర ప్రభుత్వం 1976లో హర్యానాకు 3 మిలియన్ ఏకర్ ఫీట్ నీటిని కేటాయించింది. నీటి వినియోగం నిమిత్తం హర్యానా ఆ సంవత్సరమే తమ భూభాగంలో సట్లెజ్ – యమున సంధాన కాల్వ నిర్మాణం ఆరంభించగా, పంజాబ్ 1980 వరకు జాప్యం చేసింది. 1981 లో నీటి పంపిణీపై ఢిల్లీ, జమ్మూ-కశ్మీర్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ మధ్య ఒప్పందం జరిగింది. దాని ప్రకారం తదుపరి రెండేళ్లలో ఎస్‌వైఎల్ కాల్వ నిర్మాణం పూర్తి కావాలి. కాల్వ నిర్మాణ పని వారలపై మిలిటెంట్ల దాడితో పని నిలిచిపోయింది. కాల్వను త్వరగా పూర్తి చేయాలని పంజాబ్‌ను ఆదేశించాల్సిందిగా కోరుతూ హర్యానా 1996లో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సంవత్సరంలో కాల్వ నిర్మాణం పూర్తి చేయాల్సిందిగా పంజాబ్ ప్రభుత్వాన్ని 2002లో సుప్రీంకోర్టు ఆదేశించింది. దానిపై పంజాబ్ దాఖలు చేసిన కేసు ను 2004లో ఉన్నత న్యాయ స్థానం కొట్టి వేసింది. శాసనసభ తీర్మానం ద్వారా దీన్ని అడ్డుకునే ఉద్దేశంతో పంజాబ్ ప్రభుత్వం 2004లో నదీ జలాలు పంచుకునే బాధ్యత నుంచి వైదొలుగుతూ శాసనం ఆమోదించింది. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఈ సమస్యను సుప్రీం కోర్టు అభిప్రాయానికి పంపారు. అది పెండింగ్‌లో ఉండగా, కాల్వ కొరకు రైతుల నుంచి సేకరించిన 5 వేల ఎకరాలను తిరిగి ఇచ్చే నిమిత్తం అకాలీ ప్రభుత్వం 2016 మార్చిలో మరో బిల్లు ఆమోదించింది. దాని అమలు నిలుపుదల కోరుతూ హర్యానా ప్రభుత్వం మళ్లీ సుప్రీంకోర్టు తలుపు తట్టగా యథాతథ స్థితిని ఆదేశించింది.
రాష్ట్రపతి నివేదనపై 12 ఏళ్ల అనంతరం గురువారం నాడు తీర్పు వెలువరించిన ఐదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పంజాబ్ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా కొట్టివేసింది. 1981 డిసెంబర్ 31న నదీ జలాల పంపిణీపై పంజాబ్, హర్యానా, రాజస్థా న్ మధ్య సంతకాలు జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసే ధ్యేయంతో పంజాబ్ ప్రభు త్వం చట్ట విరుద్ధంగా శాసనం చేసిందని కోర్టు పేర్కొన్నది. పంజాబ్ తనకు ప్రయోజన మున్న కేసు లో తనకుతానే జడ్జీగా వ్యవహరించిందని వ్యాఖ్యానించింది. అత్యున్నత న్యాయస్థానం అంతిమ తీర్పు ఇచ్చిన కేసులో దానికి విరుద్ధంగా శాసనసభ శాసనం చేయ జాలదని ముల్ల పెరియార్ (తమిళనాడు, కేరళ) డ్యాం విషయంలో 2006లో వెలువ రించిన సుప్రీం కోర్టు తీర్పును రాజ్యాంగ ధర్మాసనం ప్రస్తావించింది. రాష్ట్రపతి నివేదన పెండింగ్‌లో ఉండగా 2016 బిల్లు ఆమోదించటం అవాంఛనీయమైన పరిణామంగా పేర్కొన్నది.
అంతర్రాష్ట్ర వివాదాల్లో ఎగువ రాష్ట్రం తన ఇష్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటే అది ఫెడరల్ స్ఫూర్తికి, రాజ్యాంగ వ్యవస్థకు విరుద్ధమవుతుంది. నదీ జలాల వంటి సున్నిత సమస్యల్లో ట్రిబ్యునల్ వ్యవస్థ, ఆపైన సుప్రీంకోర్టు ఉన్నాయి. వాటి తీర్పు శిరోధార్యం. కాని పంజాబ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్టా అకాలీదళ్, కాంగ్రెస్ రెండూ కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడటం దురదృష్టకరం. ఒక్క చుక్క నీరు బయటకు పోనివ్వబోమని, దీనిపై నవంబర్ 16న శాసనసభ ప్రత్యేక సమావేశం పిలుస్తున్నామని ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రకటించగా , తమ ప్రజల కొరకు తాను లోక్‌సభకు రాజీనామా చేస్తున్నట్లు పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ అమరేందర్ సింగ్, తాము స్పీకర్‌కు రాజీనామా ఇవ్వబోతున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటించటం రాజకీయ అవకాశవాద నిర్ణయాలు. కేంద్ర జోక్యం చేసుకుని, రాజ్యాంగ వ్యవస్థను కాపాడాలి.