Home తాజా వార్తలు పుస్తకపఠనంపై ఆసక్తి పెరగాలి

పుస్తకపఠనంపై ఆసక్తి పెరగాలి

KTRగ్రంథాలయంలో సాహితీ సభలు జరపండి : కెటిఆర్,  సిరిసిల్లలో రూ. 3.60 కోట్లతో నిర్మించిన సినారె స్మారక గ్రంథాలయ భవనం ప్రారంభం

సిరిసిల్ల : గ్రంథాలయంలో సాహితీ సమావేశాలు నిర్వహించాలని, సమాజ సంక్షేమం కోసం సమాలోచనలు జరపాలని సిరిసిల్ల శాసన సభ్యుడు, టిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 3.60 కోట్ల రూపాయలతో నిర్మించిన సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సినారె ) స్మారక గ్రంథాలయ భవనాన్ని, రూ. 50 లక్షల పునర్నిర్మించిన సినారె ఆడిటోరియాన్ని, రూ.లు 25 లక్షలతో నిర్మించిన సుభాస్‌నగర్ కమ్యూనిటీ హాల్‌ను శనివారం కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో ఆయన మాట్లాడుతూ, గ్రంథాలయాన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిర్మించామని, రాష్ట్రానికి ఆదర్శప్రాయం అన్నారు. గ్రంథాలయం కేవలం పుస్తకాలు చదువుకోవడానికి, రాజకీయాలు మాట్లాడుకోవడానికి కాకుండా సమాజహితమైన కార్యక్రమాలను రూపొందించే కేంద్రంగా పనిచేయాలన్నారు. కవులు, సాహి తీ వేత్తలు, జర్నలిస్టులతో సమావేశాలు ఏర్పాటు చేసి గ్రంథాలయ భవనంలో ఇం కా కావాల్సిన ఏర్పా ట్లు, వసతులపై సూచనలు స్వీకరించాలన్నారు. గ్రంథపఠనం మంచి అలవాటన్నారు.

నేటి బాలలు, యువత స్మార్ట్‌ఫోన్‌లు, ఐ ఫోన్‌లకే పరిమితమైన పరిస్థితుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచాలన్నారు. ఉత్తమ పౌరుల తయారీకి గ్రంథాలయం ఉపకరించాలన్నారు. టెక్నాలజీ పెరిగిన కాలంలో పుస్తకాలను బతికించేందుకు చేస్తున్న చిరు ప్రయత్నిమిదన్నారు. బొంబాయిలోని ఆసియా పసిఫిక్ లైబ్రరీ భవనం స్ఫూర్తితో సిరిసిల్లలో గ్రంథాలయ భవనాన్ని నిర్మించామన్నారు. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలకు తోడుగా ఇంకా కావల్సిన పుస్తకాలను తెప్పించాలన్నారు. గ్రంథాలయం అందరికీ బహుళార్థకంగా ఉపయోగపడినప్పుడే సార్ధక మవుతుందన్నారు.

కేవలం పుస్తకాలు చదివేందుకు గ్రంధాలయం అనే భావన పోవాలన్నారు. గ్రంథాలయం ద్వారా సమాజంలో మార్పు వచ్చేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సింగిరెడ్డి నారాయణ రెడ్డి సిరిసిల్ల జిల్లాలో జన్మించారని, ఆయన విగ్రహాన్ని త్వరలో రానున్న ఆయన జయంతి నాటికి ఏర్పాటు చేయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సినారె పేరిట స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని, ఆ దిశగా కవులు కళాకారులు తగిన సూచనలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు టి భానుప్రసాదరావు, గ్రంధాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, సెస్ చైర్మన్ డి లకా్ష్మరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, వైస్ చైర్మన్ తవుటు కనుకయ్య, కౌన్సిలర్ పత్తిపాక పద్మ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ శంకరయ్య, నూతన జడ్‌పి చైర్మన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Interest in book reading should be increased Says KTR