Thursday, April 25, 2024

పెట్టుబడులకు అయస్కాంతం

- Advertisement -
- Advertisement -

International companies are attracted towards Hyderabad

 

నీరు పల్లానికి ప్రవహిస్తే పెట్టుబడులు అనుకూలతలున్న వైపు పరుగులు తీస్తాయి. ఉత్పాదకతకు అవాంతరాలు ఏ కొంచెమైనా ఉండని, నాణ్యమైన సౌకర్యాలు కలిగిన ప్రాంతాలను అవి ఎంచుకుంటాయి. అటువంటి ప్రోత్సాహకర పరిస్థితులను కల్పించడంలోనే అక్కడి పాలకుల సామర్థ్యం నిరూపణ అవుతుంది. పెట్టుబడులు విశేషంగా రావడం వల్ల యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు అసాధారణ స్థాయిలో కలుగతాయి. ఆ ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందుతుంది. అన్ని అనుకూలతలు తెలంగాణలో బాగా ఉన్నందునే పెట్టుబడులు పెద్ద స్థాయిలో వస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ వంటి సుప్రసిద్ధ అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ వైపు ఆకర్షితమయ్యాయి. ఇక్కడ అనేక స్టార్టప్ సంస్థలు కూడా నెలకొంటున్నాయి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తున్నది. సమాచార సాంకేతిక (ఐటి) దిగ్గజం, ఆన్‌లైన్ వాణిజ్య మేటి అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ తన ఆసియా పసిఫిక్ ప్రాంతీయ కేంద్రాన్ని నెలకొల్పడానికి తెలంగాణను ఎంచుకోడం రాష్ట్రానికి గల పెట్టుబడుల అయస్కాంత శక్తి అనితరమని చాటుతున్న పరిణామం.

అమెజాన్ ఇక్కడ నెలకొల్పదలచిన ప్రాంతీయ కేంద్రం కింద అపూర్వ స్థాయిలో రూ. 20,761 కోట్లు పెట్టుబడి పెట్టదలచినట్టు శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ కేంద్రంలో మూడు అవైలబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో డేటా కేంద్రాలను నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఇంటర్‌నెట్‌లో నెలకొల్పే రిమోట్ సర్వర్ల ద్వారా సమాచారాన్ని నిక్షిప్తం చేసి నిర్వహించే క్లౌడ్ కంప్యూటింగ్‌తో ఈ డేటా కేంద్రాలు పని చేస్తాయి. ఇవి అమెజాన్ సొంత అవసరాలను తీర్చడమే కాకుండా బయటి వినియోగదార్లకూ సేవలందిస్తాయి. ఇందువల్ల అసంఖ్యాక వెబ్ డెవలపర్లు, స్టార్టప్ పరిశ్రమలు, ఐటి సంస్థలకు ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు, ఇ కామర్స్ కేంద్రాలకు మేలు చేకూరుతుంది. అమెజాన్ ప్రాంతీయ కేంద్రం పని చేయడం 2022లో మొదలవుతుంది. ఇంత భారీ పెట్టుబడి రాష్ట్రానికి రావడం చరిత్రలో ఇది మొదటి సారి. ఇన్‌ఫర్మేషన్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఐసిటి), ఎలెక్ట్రానిక్స్ రంగాల్లో విశేషంగా విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)ను ఆకర్షిస్తున్న 20 అగ్రశ్రేణి ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ ఇప్పటికే స్థానం సంపాదించుకున్నది.

ఈ విషయాన్ని 2019 మార్చిలో లండన్ లో విడుదలైన సాధికారిక నివేదిక తెలియజేసింది. భారతదేశంలో బెంగళూరు, హైదరాబాద్ నగరాలకే ఈ గౌరవం లభించింది. తమ ప్రాంతీయ కేంద్రాన్ని ఇక్కడ నెలకొల్పదలచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రగతిశీలతే కారణమని అమెజాన్ పేర్కొనడం గమనార్హం. తెలంగాణలో ఐటి రంగం అభివృద్ధి చెందుతున్న తీరు, నిపుణుల లభ్యత, సరికొత్త స్టార్టప్ సంస్థలు వెలుస్తూ ఉండడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న అమోఘమైన సహకారం కూడా తమ కేంద్రాన్ని నెలకొల్పాలని నిర్ణయం తీసుకోడానికి కారణాలని అమెజాన్ వెల్లడించింది. రాష్ట్ర పురపాలక, ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ సంవత్సరం మొదట్లో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) శిఖరాగ్ర సమావేశానికి హాజరయినప్పుడు అంతర్జాతీయ వాణిజ్య దిగ్గజాల అధినేతలతో ఉన్నత స్థాయి ప్రతినిధులతో చర్చలు జరిపారు. అందులో భాగంగా కోకాకోలా, గూగుల్ వంటి సంస్థల సిఇఒలతో పాటు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధులతోనూ మాట్లాడారు. అమెజాన్ అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు ఫలవంతమై ఇప్పటి చరిత్రాత్మక నిర్ణయం వెలువడింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్తు రంగంలో విశేష ప్రగతి సాధ్యమయింది. ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో గల మొత్తం స్థాపిత విద్యుదుత్పాదక సామర్థం 16024.02 మెగా వాట్లు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వరంగ ఉత్పాదన కేంద్రాల కెపాసిటీ 7683.65 మెగావాట్లు. రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చి దిద్దడానికి ప్రభుత్వం బహు ముఖమైన కృషి చేస్తున్నది. ఫార్మా రంగం అభివృద్ధి కోసం నిర్విరామంగా పని చేస్తున్నది. గత నాలుగేళ్లలో ఈ రంగానికి సంబంధించి రాష్ట్రానికి రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సమాచారం. 201920 ఆర్థిక సంవత్సరంలో గత ఏడాది డిసెంబర్ నాటికే రాష్ట్రం నుంచి 3.48 బిలియన్ డాలర్ల ఔషధ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. అన్నింటి కంటే మిక్కిలిగా భిన్న వర్గాల ప్రజల మధ్య సామరస్య సహజీవనాలను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం కృతకృత్యురాలయింది. జాతీయ స్థాయి నిర్ణయాల వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల్లో విద్వేషాలు రగులుతున్నప్పటికీ రాష్ట్రం మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుండడం పెట్టుబడుల రాకకు ఎంతో దోహదకారిగా ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News